తెలుగులో సూపర్ స్టార్ డమ్ ఎంజాయ్ చేసే హీరోలు తమ మార్కెట్ ను పెంపొందించుకోవడం కోసం పరాయి భాషల్లో సినిమాలు చేయడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. అప్పట్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లు బాలీవుడ్ లోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు. ఫెయిల్ అవ్వకపోయినా.. ఆశించిన స్థాయి ఫలితం దక్కకపోవడంతో లైట్ తీసుకొన్నారు. అనంతరం రామ్ చరణ్ “జంజీర్”తో బాలీవుడ్ లో, మహేష్ బాబు “స్పైడర్”తో తమిళంలో దారుణమైన పరాభవం ఎదుర్కొన్నారు. ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండ ఒకేసారి తమిళ, మలయాళ భాషల్లోకి ఎంట్రీ ఇద్దామనే ప్రయత్నంలో నటించిన “డియర్ కామ్రేడ్” కూడా బాస్కాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇలా రామ్ చరణ్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండలు వేరే భాషలో దారుణంగా విఫలమవ్వడం చూసిన టాలీవుడ్ ఫ్యాన్స్ అందరూ.. నెక్స్ట్ ప్రభాస్ సంగతి ఏంటా? అని టెన్షన్ పడుతున్నారు. “బాహుబలి”తో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కొట్టినప్పటికీ అది డబ్బింగ్. కానీ.. మొదటిసారిగా “సాహో”తో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో డెబ్యూ చేయనున్నాడు ప్రభాస్. 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంపై విశేషమైన అంచనాలున్నాయి. తమిళ, మలయాళం పక్కన పెడితే.. బాలీవుడ్ లో స్ట్రయిట్ హీరోగా ప్రభాస్ ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. ఈ రిజల్ట్ తెలియాలంటే ఆగస్ట్ 30 వరకూ వెయిట్ చేయాల్సిందే.