సాహో

  • August 30, 2019 / 02:35 PM IST

“బాహుబలి” లాంటి ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ తర్వాత కంట్రీస్ బిగ్గెస్ట్ హీరోగా మారిపోయిన ప్రభాస్ నటించిన తాజా చిత్రం “సాహో”. “రన్ రాజా రన్” లాంటి డీసెంట్ కామెడీ ఎంటర్ టైనర్ అనంతరం సుజీత్ దర్శకత్వం వహించిన సినిమా కావడం, యువీ క్రియెషన్స్ సంస్థ ఖర్చుకు వెనుకాడకుండా.. ఏకంగా 350 కోట్లు పెట్టి సినిమా తీయడం.. టీజర్-ట్రైలర్ సినిమా మీద అంచనాలను విశేషంగా పెంచేశాయి. మరి సినిమా ఆ అంచనాలను అందుకోగలిగిందా? చిత్రబృందం మూడేళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించిందా? అనేది చూద్దాం..!!

కథ: హైయర్ పోలీస్ అఫీషియల్ డేవిడ్ (మురళీశర్మ) ఆర్డర్ మేరకు ముంబైలో జరిగిన 2000 కోట్ల రూపాయల దోపిడీ కేసును డీల్ చేయడం కోసం రంగంలోకి దిగుతాడు అశోక్ చక్రవర్తి (ప్రభాస్). ఆ కేస్ ను ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో పరిచయమవుతుంది అమృత నాయర్ (శ్రద్ధాకపూర్). కొంచెం ఇన్వెస్టిగేషన్, కొంచెం రొమాన్స్ తో సాఫీగా సాగిపోతున్న అశోక్ లైఫ్ లోకి వస్తాడు స్పెషల్ ఆఫీసర్ జై (నీల్ నితిన్ ముఖేష్) .

అప్పటివరకూ పోయిన 2000 కోట్ల చుట్టూ తిరిగిన ఇన్వెస్టిగేషన్.. దుబాయ్ లోని లక్షల కోట్లు విలువ చేసే ఓ బ్లాక్ బాక్స్ వైపు మళ్లుతుంది. ఈ క్రమంలో అశోక్ గురించి అమృతకు ఓ నమ్మలేని నిజం తెలుస్తుంది.

ఏమిటా నిజం? ఇంతకీ అశోక్ ఆ 2000 కోట్ల రూపాయల కేసును చేధించాడా? చివరికి ఏం జరిగింది? అనేది “సాహో” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.

నటీనటుల పనితీరు: “బాహుబలి”లో తండ్రిగా, కొడుకుగా రెండు వేరియేషన్స్ లో ప్రభాస్ ను అద్భుతంగా రాజమౌళి చూపించిన విధానం వల్లనో లేక పీరియాడిక్ సినిమాలోనే అలా ఉన్నాడంటే.. ఇక స్టైలిష్ గా ప్రభాస్ ఇంకెంత బాగుంటాడో అని మరీ ఎక్కువగా ఎక్స్ పెక్ట్ చేయడం వలనో ఏమో కానీ.. “సాహో” సినిమాలో కొన్ని సన్నివేశాల్లో పర్వాలేదు అనిపించేలా ఉన్న ప్రభాస్.. ఇంకొన్ని సన్నివేశాల్లో మాత్రం మరీ ఎబ్బెట్టుగా కనిపించాడు. డబ్బింగ్ విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. ప్రభాస్ సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్న సన్నివేశాల్లో కూడా అతని గొంతులో బద్ధకం తొణికిసలాడుతుంటుంది. యాక్షన్ సీన్స్ లో ఇరగదీశాడు కానీ.. డ్యాన్స్ ల విషయంలో ఇదివరకటిలా ఈజ్ తో కాక కాస్త ఇబ్బందిగా కనిపించాడు. ప్రభాస్ మేకోవర్ & కాస్ట్యూమ్స్ తోపాటు కంటిన్యూటీ విషయంలోనూ కాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది.

శ్రద్ధకపూర్ వల్ల హిందీ గ్రామర్ తప్ప.. కొత్తగా యాడ్ అయిన గ్లామర్ ఏమీ కనిపించలేదు. ఆమె పాత్రతో రొమాన్స్ & కామెడీ పండించారు. కామెడీ వరకూ బాగానే ఉంది. రొమాన్స్ విషయంలో మాత్రం ఎందుకో కెమిస్ట్రీ పెద్దగా వర్కవుట్ అయినట్లు కనిపించలేదు.

నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, చంకీ పాండే, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, ఎవ్లీన్ శర్మ.. ఇలా ఉన్న ఆర్టిస్టులండరు చూడ్డానికి గంభీరంగా కనిపించినా, కథనంలో వారి పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడంతో.. వాళ్ళ పాత్రలన్నీ కేవలం అలంకారాలుగా మిగిలిపోతాయి.

సాంకేతికవర్గం పనితీరు: “వివేకం” సినిమా రిలీజ్ అయిన టైమ్ లో ఆ సినిమా బీజీయమ్ వర్క్ చూసి, వినిన తర్వాత.. తెలుగులో ఈస్థాయి ఇంటర్నేషనల్ లెవెల్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఒక సినిమా ఎప్పుడు చూస్తామా అని ఆలోచించిన ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడికి దొరికిన సమాధానం “జిబ్రాన్”. తనదైన మార్క్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచాడు.

మధి సినిమాటోగ్రఫీ సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లింది. ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ మరియు కొన్ని యాక్షన్ బ్లాక్స్ అయితే.. ఫ్యాన్స్ కు పండగ. ముఖ్యంగా ప్రభాస్ ను చూపించిన విధానం విజిల్స్ వేసేలా చేస్తుంది.

ప్రొడక్షన్ వేల్యూస్ విషయంలో.. పది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట 1000 రూపాయలు ఖర్చు చేశారనిపిస్తుంది. సినిమా మొత్తం చాలా లావిష్ గా కనిపిస్తుంది. గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి. ట్రక్ ఛేజింగ్ సీన్స్ లో మాత్రం వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ఇంకాస్త బెటర్ గా ఉంటే బెటర్ అనిపిస్తుంది.

దర్శకుడు సుజీత్ రాసుకొన్న ఒక సాధారణ కథను.. భారీ సినిమా తీయాలన్న ధ్యేయంతో ఎక్కువగా ఖర్చు చేయించి, అనవసరంగా పెద్ద సినిమా చేసేశారు అనిపిస్తుంటుంది. యాక్షన్ బ్లాక్స్, ఇంటర్వెల్ ట్విస్ట్, ప్రీక్లైమాక్స్ యాక్షన్ చేజ్ ను హాలీవుడ్ రేంజ్ లో అద్భుతంగా రాసుకొన్న సుజీత్.. ప్రభాస్ ను చూసుకొని ఆయన ఫ్యాన్స్ మరియు డైహార్డ్ ఫ్యాన్స్ చూసుకొని మురిసిపోయేలా ఎలివేషన్స్ కూడా ఇచ్చాడు. కానీ.. తన మునుపటి చిత్రమైన “రన్ రాజా రన్” తరహాలో స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ “సాహో”లో లోపించింది. మరీ ముఖ్యంగా.. సినిమా మూల కథ ఎంత వద్దు అనుకున్నా “అజ్ణాతవాసి”ని గుర్తు చేస్తుంది. కొన్ని ఎలివేషన్స్ మరీ “వినయ విధేయ రామ” చిత్రంలోని ట్రైన్ ఫైట్ కు బాబులా ఉంటాయి. ఇలాంటి మైనస్ పాయింట్స్ అన్నీ ఆఖరి 30 నిమిషాల ట్విస్టులు, యాక్షన్ బ్లాక్ తో కాస్త మరిపించినా.. 171 నిమిషాల సినిమాను కేవలం 30 నిమిషాల ఎంగేజ్ మెంట్ కోసం జనాలు చూడలేరు అనే విషయాన్ని సుజీత్ గుర్తించి ఉంటే బాగుండేది.

విశ్లేషణ: ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే పర్లేదు కానీ.. భారీ అంచనాలతో ఏదేదో ఎక్స్ పెక్ట్ చేసి థియేటర్ కి వెళ్తే నిరాశ చెందడం ఖాయం. సో, డియర్ హార్డ్ కోర్ & డై హార్డ్ ఫ్యాన్స్ మీ అంచనాలను వీలైనంతగా తగ్గించుకొని సినిమాకు వెళ్ళండి. లేకపోతే మీరు కూడా వైల్డ్ గా మారే అవకాశాలున్నాయి. సుజీత్, ప్రభాస్ పడిన కష్టం కోసమైనా ఈ సినిమాను ఒకసారి థియేటర్లో చూడడంలో తప్పులేదు అనిపిస్తుంది కానీ.. ఫైనల్ గా జనాలకు కావాల్సింది ఎంటర్ టైన్మెంట్ అని గుర్తొచ్చినప్పుడు మాత్రం యూనిట్ పై, డిస్ట్రిబ్యూటర్లపై బాధేస్తుంది, జాలేస్తుంది.

రేటింగ్: 2/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus