తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన “లక్ష్మీ నరసింహ” చిత్రానికి ఒరిజినల్ అయిన “స్వామి” చిత్రానికి సీక్వెల్ గా ఇన్నేళ్ల తర్వాత దర్శకుడు హరి తెరకెక్కించిన చిత్రం “సామి”. విక్రమ్, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ చిత్రంలో బాబీ సింహా ప్రతినాయకుడిగా నటించాడు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంపై బి,సి సెంటర్ ఆడియన్స్ కి తప్ప ఎవరికీ పెద్దగా ఆశలు కానీ అంచనాలు కానీ లేవు. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
కథ : సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పరశురామ స్వామి (విక్రమ్) కొడుకు రామస్వామి (విక్రమ్) తన తండ్రిని చంపిన భిక్షు (బాబీ సింహా) మీద పగ తీర్చుకోవడం అనే అంశం చుట్టూ “సామి” కథ పరిగెడుతూ ఉంటుంది. హరి మార్క్ కామెడీ కోసం సూరి, పాటల్లో డ్యాన్సులు చేసి హీరో పక్కన నిల్చోవాలి కాబట్టి హీరోయిన్లు సారీ గ్లామర్ డాల్స్ ఐశ్వర్య రాజేష్, కీర్తి సురేష్ అక్కడక్కడా మెరిసి మాయమవుతుంటారు. ఇంతకుమించిన కథ సినిమాలో కనిపిస్తే దయచేసి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయాల్సిందిగా మనవి.
నటీనటుల పనితీరు : విక్రమ్ ఈ చిత్రంలో పోషించింది డ్యూయల్ రోల్ అని చెప్పుకోవడానికి తప్ప చూడ్డానికి పెద్ద తేడా ఏమీ ఉండదు. అయితే.. విక్రమ్ మాత్రం ఒక స్ట్రాంగ్ పోలీస్ ఆఫీసర్ గా తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. యాక్షన్ సీక్వెన్స్ లో విక్రమ్ ను చూసి అభిమానులు మురిసిపోటారేమో. పాపం త్రిష తప్పుకోవడంతో సినిమాలోకి వచ్చిన ఐశ్వర్య రాజేష్ ఆ పాత్రలో ఇమడడానికి చాలా సమయం తీసుకొంది. ఓ మోస్తరుగా పర్వాలేదనిపించుకొంది కానీ.. పెద్దగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి.
కీర్తి సురేష్ కి కూడా డైరెక్టర్ ఎక్కువ టైమ్ ఇవ్వలేదు. మూడు సన్నివేశాలు రెండు పాటల్లో అలా మెరిపించి పక్కకి పంపేశాడు. కానీ.. కీర్తి మాత్రం తన పాత్రకు అందం-అభినయంతో న్యాయం చేసింది. ఆమె పాత్ర సినిమాకి పెద్దగా ఉపయోగపడకపోయినా.. ఆడియన్స్ కు కాస్త రిలీఫ్ ఇచ్చింది. ఈ సినిమాలో సూరి కామెడీ ట్రాక్ ను వరెస్ట్ కామెడీ ట్రాఫ్ ఆఫ్ ది డెకేడ్ గా డిక్లేర్ చేసినా తప్పులేదు. నాలుగైదు కామెడీ సీన్లు పెట్టకపోతే ఆడియన్స్ కొడతారేమోనన్నట్లుగా సినిమాలో సూరిని మధ్యమధ్యలో తీసుకొచ్చి అప్పటికే నీరసించి ఉన్న ప్రేక్షకుల నెత్తి మీద బండేసి బాదాడు హరి.
విక్రమ్ తర్వాత సినిమాలో కథ-కథనంతో సంబంధం లేకుండా తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన నటుడు బాబీ సింహా. రావణ భిక్షు అనే పాత్రలో విలనిజాన్ని అద్భుతంగా పాడించడమే కాక నటుడిగా తన స్థాయిని మరింత పెంచుకొన్నాడు.
సాంకేతికవర్గం పనితీరు : హరి బాధ భరించలేక ప్రియన్ కెమెరాని ఏదైనా కారుకి కట్టేశాడో ఏమో కానీ సినిమా మొత్తంలో కెమెరా ఎక్కడా స్టాండ్ కి ఫిక్స్ చేసినట్లు మాత్రం కనిపించదు. అవుట్ పుట్ క్వాలిటీ & కొన్ని ఫ్రేమ్స్-యాంగిల్స్ బాగున్నాయి కానీ.. ఏదో త్రీడీ సినిమా చూస్తున్న ఫీల్ కలిగిస్తుంది కెమెరా వర్క్.
“సింగం 3” (తెలుగులో “యముడు”) చిత్రం చూస్తున్నప్పుడు చెవుల్లో దూది పెట్టుకొన్న ప్రేక్షకులు ఈ సినిమా చూస్తున్నప్పుడు సీసం పోసుకోవడం బెటర్ అని ఫీలవుతారు. నేను సినిమా చూసిన థియేటర్ వాడు అంత సౌండ్ పెట్టాడా లేక సినిమానే అంతా అని వేరే థియేటర్ లో సినిమా చూసిన మిత్రులని అడిగినా కూడా అదే చెప్పడంతో.. దేవిశ్రీప్రసాద్ & డైరెక్టర్ హరి మీద “థియేటర్ హింస” అనే కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి మరీ కేసు వేయాలన్నంత కోపం వచ్చింది. ఆ సౌండ్ కి అలిసిపోయి పడుకొన్న ప్రేక్షకుడు ఉలిక్కిపడితే.. నిద్రపోకుండా ఓపిగ్గా కూర్చున్న ప్రేక్షకుడు లేచి థియేటర్ నుంచి వెళ్లిపోతున్నారు. యాక్షన్ సీక్వెన్సులు మాస్ ఆడియన్స్ పండగ చేసుకొనేలా ఉన్నాయి.
డైరెక్టర్ హరి తన మార్క్ ను ఒక అరగంట చూపించారు కానీ.. ఆ అరగంట కాకుండా మిగిలిన రెండు గంటలా ఏడు నిమిషాలు మాత్రం ప్రేక్షకుడి నెత్తి మీద తడిగుడ్డ వేసి మరీ బాదేశాడు. కథ వదిలేద్దాం కనీసం ఆకట్టుకొనే కథనం అయినా ఉండాలి కదా. “సింగం” 1,2,3 పార్ట్శ్ లో ఉన్న కనీస స్థాయి స్క్రీన్ ప్లే కూడా ఈ సినిమాలో కనిపించదు. సో, హరి ఇంకా ఎక్కడో 10 ఏళ్ల క్రితం ఫిలిమ్ మేకింగ్ దగ్గరే ఆగిపోయాడు అని స్పష్టంగా అర్ధమవుతుంది.
విశ్లేషణ : ఈ ఉరమాసు లౌడ్ స్పీకర్ ఎంటర్ టైనర్ ను మాస్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయడం చాలా కష్టం. సో, ఆ సౌండ్స్ ను భరించగలం అనుకున్న ప్రేక్షకులు మాత్రమే “సామి” థియేటర్లకు వెళ్ళడం ఉత్తమం.
రేటింగ్ : 1.5/5