యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న రవితేజ మహాదాస్యం కథానాయకుడిగా పరిచయమవుతూ నటించిన చిత్రం “సగిలేటి కథ”. రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విషిక కోట కథానాయికగా నటించింది. ఉత్తరాంధ్ర నేపధ్యంలో తెరకెక్కిన రూరల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని నటుడు నవదీప్ సమర్పించడం ప్రత్యేకతను సంతరించుకుంది. మరి ఈ విలేజ్ డ్రామా ఆడియన్స్ ను ఆకట్టుకోగలిగిందా లేదా? అనేది చూద్దాం..!!
కథ: సగిలేరు గ్రామ పెద్దలు చౌడప్ప, దొరస్వామీలు ఊరి జాతర విషయంలో తిట్టుకొని, కొట్టుకొని.. ఆఖరికి ప్రాణాల మీదకి తెచ్చుకొంటారు. వాళ్ళిద్దరి మధ్య తగువు కారణంగా ప్రాణంగా ప్రేమించుకుంటున్న కుమార్ (రవి మహాదాస్యం), కృష్ణ కుమారి (విషిక కోట) ప్రేమ బీటలు బారుతుంది. జాతరలో జరిగిన రచ్చ కారణంగా విడిపోయిన కుమార్-కుమారిల జంట మళ్ళీ ఎలా కలిశారు? వారి ప్రేమను ఎలా నెగ్గించుకున్నారు? అనేది “సగిలేటి కథ” కథాంశం.
నటీనటుల పనితీరు: లఘు చిత్రాలతోనే నటుడిగా నిరూపించుకున్న రవి మహాదాస్యం.. ఈ చిత్రంలో కడప జిల్లా కుర్రాడు కుమార్ గా ఒదిగిపోయి నటించాడు. యాస, బాడీ లాంగ్వేజ్ విషయంలో జాగ్రత్తపడిన తీరు అభినందనీయం. హీరోయిన్ విషిక కోట కూడా పాత్రలో ఇమిడిపోయింది. ఆమె యాస & ధైర్యంగా చెప్పే డైలాగులు అలరిస్తాయి. హావభావాల ప్రకటన విషయంలో మాత్రం ఇంకాస్త పరిణితి చెందాల్సి ఉంది. సినిమాలో ఓ ముఖ్యపాత్రధారి అయిన నరసింహ ప్రసాద్ పర్వాలేదనిపించుకున్నా.. అతడి పెట్టుడు మీసాలు మాత్రం ఎబ్బెట్టుగా ఉన్నాయి. రాజశేఖర్ ఆనింగి ఎప్పట్లానే జీవించేశాడు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకత్వం-ఛాయాగ్రహం-కూర్పు వంటి కీలకమైన బాధ్యతలను నిర్వర్తించిన రాజశేఖర్ తాను రాసుకున్న కథపై అతి ప్రేమ వలన ల్యాగ్ అనిపించే సన్నివేశాలను ఎడిట్ చేయకుండా అలానే ఉంచేశాడు. అలాగే.. ఆర్జీవీ ఫ్రేమ్స్ & యాంగిల్స్ మీద విపరీతమైన ప్రేమతో సినిమాటోగ్రాఫర్ గా అతడు ప్రయత్నించిన టైట్ క్లోజ్ షాట్స్ తెరపై సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని ఇబ్బందిపెట్టాయనే చెప్పాలి.
ముఖ్యంగా చికెన్ పాటలో కర్రీ మేకింగ్ క్లోజప్స్ ఎబ్బెట్టుగా ఉన్నాయి. ఇక దర్శకుడిగా రాజశేఖర్ పర్వాలేదనిపించుకున్నాడు. అనవసరంగా సాగతీస్తున్నాడు అని ప్రేక్షకుడు బోర్ ఫీలవుతున్నప్పుడల్లా.. మంచి ట్విస్టులతో కథను ముందుకు సాగించాడు. ఊహించని ట్విస్టులు ఉన్నప్పటికీ.. నత్తనడకలా సాగిన కథనం, షార్ట్ ఫిలిమ్స్ కంటే తక్కువగా కనిపించే కెమెరా క్వాలిటీ సినిమాకి పెద్ద మైనస్ గా మారాయి.
జశ్వంత్ పాటలు బాగున్నా.. నేపధ్య సంగీతం, డబ్బింగ్ & రీరికార్డింగ్ విషయంలో కనీస స్థాయి జాగ్రత్త తీసుకోకపోవడం మైనస్ గా మారింది. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్, సీజీ వర్క్ లాంటి టెక్నికాలిటీస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
విశ్లేషణ: కథగా మంచి స్కోప్ ఉన్న సినిమా “సగిలేటి కథ”. ఇదే సినిమాను మంచి టెక్నికాలిటీస్ తో తీస్తే మంచి హిట్ అయ్యేది. కానీ.. మింగుడుపడని కెమెరా వర్క్, ఆకట్టుకొని కథనం, ఆకట్టుకోలేని క్యారెక్టర్ ఆర్క్స్ కారణంగా.. ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. మంచి ప్రయత్నమని పొగడాల్సిన సినిమా అయినప్పటికీ.. దర్శకుడు, ఛాయాగ్రహకుడు, ఎడిటర్ అయిన రాజశేఖర్ పనితనం వల్ల మంచి కంటెంట్ వర్కవుటవ్వలేకపోయిందనే చెప్పాలి.
రేటింగ్: 1.5/5