‘డైలాగ్ కింగ్’ సాయి కుమార్.. తెలుగు, కన్నడ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు.. రంగస్థల కళాకారుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హోస్ట్ గా పలు విభిన్న పాత్రలు పోషిస్తూ తనకు తానే సాటి అనిపించుకున్నారు. తండ్రి నుండి వారసత్వంగా అనువాద కళను అలవాటు చేసుకున్న సాయి కుమార్ సినిమా పరిశ్రమలో విజయవంతంగా గోల్డెన్ జూబ్లీ (50 సంవత్సరాలు) పూర్తి చేసుకున్నారు.సాయి కుమార్ తండ్రి పి.జె.శర్మ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ కావడంతో చిన్నతనం నుండే తనకు నటన పట్ల ఆసక్తి కలిగింది.
మయసభలో దుర్యోధనుడిగా తొలిసారి సాయి కుమార్ ముఖానికి మేకప్ వేసుకుని 50 వసంతాలు పూర్తయ్యాయి. మద్రాసులో పుట్టి పెరిగిన సాయి కుమార్ కంఠస్వరం, తెలుగు ఉచ్చారణ బాగుండడంతో డబ్బింగ్ ఆర్టిస్టుగా మారారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ నటించిన ‘సంసారం’ ఆయన డబ్బింగ్ చెప్పిన ఫస్ట్ ఫిలిం.. అప్పటి స్టార్ హీరోలు సుమన్, రాజశేఖర్ లకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఆయన గాత్రదానం చేశారు. స్టార్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా డెవలప్ అయిన సాయి కుమార్ లో నటుడి లక్షణాలున్నాయని దర్శక నిర్మాతలు వేషాలు ఆఫర్ చెయ్యడంతో కెమెరా ముందుకొచ్చారు.
బాలనటుడిగా ‘దేవుడు చేసిన పెళ్లి’ ఆయన నటించిన తొలిచిత్రం. ఇందులో అంధుడిగా ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేశారు. బాలనటుడిగానే కాకుండా టీనేజ్ వరకు పలు తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడలో హీరోగా పరిచయమై స్టార్ గా ఎదిగారు. తర్వాత తెలుగులో ‘పోలీస్ స్టోరీ’ తో డైలాగ్ కింగ్ గా మారి తనకంటూ ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించుకున్నారు. హీరోగానే కాకుండా విలన్ గానూ సత్తా చాటారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ తనదైన ముద్ర వేశారు. ఆయన నటించిన సినిమాలు, తన నటనతో అద్భుతంగా అలరించిన క్యారెక్టర్లు, అందుకున్న అవార్డులు, రివార్డులు, ప్రశంసలు కోకొల్లలు..
సాయి కుమార్ స్ఫూర్తితో పెద్ద తమ్ముడు రవిశంకర్ కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చిన్న తమ్ముడు అయ్యప్ప పి.శర్మ కూడా నటుడిగా, దర్శకుడిగా రాణిస్తున్నారు. సాయి కుమార్ అన్నదమ్ముళ్లకు తెలుగులోనే కాకుండా తమ తల్లి సొంత రాష్ట్రమైన కర్ణాటకలో మంచి గుర్తింపు ఉంది. ఆయన తనయుడు ఆది కూడా హీరోగా సినిమాలు చేస్తున్నాడు. చిత్ర పరిశ్రమలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా సినీ ప్రముఖులు సాయి కుమార్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Most Recommended Video
ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!