సినిమా కథ విన్నప్పుడు అనిపించిన ఫీలింగ్.. సినిమా చూసినప్పుడు రాదు అంటుంటారు కొంతమంది నటులు. అదేంటి రెండూ ఒకటే కదా అని అనుకోవచ్చు. అయితే కథ విజువలైజ్ అయ్యాక, తెర మీద సినిమాగా కనిపించాక, అందులో తమను తాము చూసుకున్నాక నాటి కథ విన్న రోజులు, అప్పటి ఫీలింగ్ ఇప్పుడు ఉండవు అని. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంది ప్రముఖ కథానాయిక, ఇటీవల బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి. ‘ఏక్ దిన్’ సినిమాతో ఆమె హిందీ నాట తొలి అడుగు వేసిన సంగతి తెలిసిందే.
‘ఏక్ దిన్’ సినిమా ఇటీవల విడుదలై ఆశించిన పలితం అయితే అందుకోలేదు. కొంతమంది అయితే సాయిపల్లవి ఇలాంటి పాత్ర ఓకే చేసిందా అని కూడా అన్నారు. వారెవరో అనడం కాదు సాయిపల్లవి కూడా ఇప్పుడు అదే మాట అంటోంది. అంతేకాదు ఆ సినిమా అంగీకరించడానికి ఆమిర్ ఖాన్‌తో ఉన్న అనుబంధమే ముఖ్య కారణమని కూడా చెప్పింది. ఆమిర్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమాను ఒప్పుకోవడానికి స్క్రిప్ట్ ఓ కారణం. సినిమా టీమ్ నన్ను సంప్రదించినప్పుడు నేను ఎమోషనల్ సినిమాల్లో నటిస్తున్నాను. అందుకే మనసుకు హాయిగా అనిపించే పాత్రలు చేయాలని అనుకున్నాను. ఆ సమయంలో ఈ కథ విన్నప్పుడు ‘బిఫోర్ సన్‌రైజ్’ అనే హాలీవుడ్ సినిమా గుర్తొచ్చింది. ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఈ ప్రాజెక్ట్‌కి ఒకే చెప్పా అని బ్యాక్‌స్టోరీ చెప్పింది సాయిపల్లవి.
అయితే సినిమా ప్రీమియర్ షో చూసిన తర్వాత ఆ పాత్రకు తాను సరిపోలేదని అనిపించిందని అసలు విషయం చెప్పింది. ఈ సినిమా కోసం తనను కాకుండా వేరకొరిని ఎంపిక చేసుకుని ఉంటే బాగుండేది. వాళ్లు ఈ పాత్రకు బాగా న్యాయం చేసేవాళ్లు అని అప్పుడే ఆమిర్ ఖాన్‌తో చెప్పాను అని చెప్పుకొచ్చింది సాయి పల్లవి. ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. థాయ్ చిత్రం ‘వన్ డే’కు రీమేక్‌గా రూపొందింది.