ఒక్కోసారి సినిమాల్లోని పాత్రలకు హీరోహీరోయిన్లు బాగా ఎటాచ్ అయిపోతుంటారు. ఎంతలా అంటే వారు పోషించిన పాత్రల్లోనుంచి బయటకు రావడానికి ఒక్కోసారి వారికి నెలల సమయం పట్టేస్తుంటుంది. “జైలవకుశ” టైమ్ లో ఎన్టీయార్ జై క్యారెక్టర్ నుంచి బయటపడడానికి చాలా ఇబ్బందిపడ్డాడట. ఒకసారి నిద్రలో నడుచుకుంటూ బాల్కనీ మీద నుంచి దూకేయడానికి కూడా ప్రయత్నించాడట. ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్లపాటు ప్రశాంతంగా ఉంటే తప్ప ఆ పాత్ర నుంచి బయటపడలేకపోయాడట. ఇటీవల మహేష్ బాబు కూడా “భరత్ అనే నేను” సినిమాలో పోషించిన ముఖ్యమంత్రి పాత్ర ప్రభావం నుంచి బయటపడడం కోసం సినిమాకి రిలీజ్ కి వారం ముందు డబ్బింగ్ పూర్తి చేసి మరీ ఫ్యామిలీతో ట్రిప్ కి వెళ్లొచ్చాడు.
వీళ్ళ తరహాలోనే యువ కథానాయకి సాయిపల్లవి కూడా “కణం” సినిమాలో తాను పోషించిన తల్లి పాత్రకి బాగా ఎటాచ్ అయిపోయిందట. ముఖ్యంలో తనకు కుమార్తెగా నటించిన వెరోనికా అనే పాపకి బాగా దగ్గరైపోయిందట. ఒకానొక సందర్భంలో ఆ పాపని దత్తత తీసుకోవాలని కూడా అనుకొందట. ఈ విషయాన్ని తన తల్లితో డిస్కస్ చేస్తే ఒక మొట్టికాయ మొట్టి :ముందు నిన్ను నువ్వు సంభాళించుకోవడం నేర్చుకో.. ఆ పాపని తర్వాత దత్తత తీసుకుందువు” అన్నదట. సాయిపల్లవి ఈ విషయాన్ని “కణం” సినిమా రిలీజ్ సందర్భంగా మీడియాతో పంచుకొంది.