పవన్ కళ్యాణ్ – సాయి తేజ్ కాంబినేషన్లో ‘బ్రో’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడం జరిగింది. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించగా వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. జూలై 28 న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా హీరో సాయి తేజ్ పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. అవి మీ కోసం :
ప్ర) ‘బ్రో’ కథ మీ వద్దకు వచ్చినప్పుడు ఎలా ఫీలయ్యారు?
సాయి తేజ్ : నేను ఈరోజు సినిమాల్లో ఉండటానికి కారణం.. పవన్ కళ్యాణ్ గారు.ఆయన నాకు మావయ్య మాత్రమే కాదు నాకు గురువు కూడా..! ఆయన ఫోన్ చేసి ఈ ప్రాజెక్టు గురించి చెప్పారు. నేను మెయిన్ లీడ్ అన్నారు. షాక్ అనిపించింది. కథ వినకుండానే ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఓకే చెప్పేశాను.
ప్ర)’వినోదయ సీతమ్’ చూశారా?
సాయి తేజ్ : లేదు చూడలేదు. కానీ తర్వాత కథ విన్నప్పుడు చాలా బాగా అనిపించింది.
ప్ర)’బ్రో’ మీ కెరీర్లో ఎలాంటి సినిమా అనుకోవచ్చు?
సాయి తేజ్ : నా కెరీర్ కి ఇది ఒక ట్రిబ్యూట్ ఫిల్మ్ లాంటిది.నా గురువుతో(పవన్ కళ్యాణ్) పనిచేసే ఛాన్స్ వచ్చింది. ఆయన వద్దే నేను ఏమి నేర్చుకున్నాను అనేది చూపించాలి అనుకున్నాను. ‘బ్రో’ తో నాకు ఆ అవకాశం వచ్చింది.
ప్ర) మీ ఇంట్లో చూసిన పవన్ కళ్యాణ్ గారికి.. సినిమా సెట్లో ఉండే పవన్ కళ్యాణ్ గారికి తేడా ఏమైనా గమనించారా?
సాయి తేజ్ : షూటింగ్ మొదటి రోజు నేను కంగారు పడ్డాను, వణికిపోయాను. మావయ్య పిలిచి ఎందుకురా కంగారు పడుతున్నావ్, నేనే కదా అంటూ నా టెన్షన్ ను పక్కన పెట్టేశారు. దీంతో నాకు సెట్లో పనిచేసిన ఫీలింగ్ కలగలేదు. హ్యాపీగా గడిచిపోయింది. దర్శకులు సముద్రఖని గారు కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు.
ప్ర) ఈ కథలో ఉన్న టర్నింగ్ పాయింట్.. మీ రియల్ లైఫ్ కి కనెక్ట్ అయినట్టుంది?
సాయి తేజ్ : కథ ఓకే అయినప్పుడు నాకు యాక్సిడెంట్ అవ్వలేదు. అది యాదృచ్చికం. టైం విషయంలో మాత్రం ఇది కనెక్ట్ అయ్యింది.
ప్ర) నిజజీవితంలో మీ ఫ్యామిలీకి టైం ఇస్తారా?
సాయి తేజ్ : వందశాతం.. ! నేను కుటుంబంతో గడపటానికి ఎక్కువ ఇష్టపడతాను. మా అమ్మ, నాన్నలతో రోజుల్లో ఒక్కసారైనా గడుపుతాను. నా దృష్టిలో కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సమయం గడపడం కంటే విలువైనది ఇంకోటి లేదు అనిపిస్తుంది.
ప్ర) త్రివిక్రమ్ గారితో పనిచేయడం ఎలా అనిపించింది?
సాయి తేజ్ : అలాంటి గొప్ప టెక్నీషియన్ తో పనిచేయడం చాలా సంతోషంగా అనిపించింది. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ చాలా బాగా వచ్చాయి.సినిమా గురించి, జీవితం గురించి ఆయన చాలా విలువైన సలహాలు ఇస్తారు.
ప్ర) పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించారు.. మరి చిరంజీవి గారితో ఎప్పుడు?
సాయి తేజ్ : నాకు మా ముగ్గురు మావయ్యలతో కలిసి నటించాలని ఉండేది. నాగబాబు మావయ్యతో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ ‘రిపబ్లిక్’ చేశాను.. పవన్ కళ్యాణ్ గారితో ‘బ్రో’ చేశాను.. చిరంజీవి గారితో ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.
ప్ర) కళ్యాణ్ కృష్ణ గారి దర్శకత్వంలో చిరంజీవి గారు చేస్తున్న సినిమాలో మరో హీరోకి ఛాన్స్ ఉందట కదా?
సాయి తేజ్ : ఏమో.. నా వరకు రాలేదు. నన్ను అప్రోచ్ అయితే మారు మాట్లాడకుండా ఓకె చెప్పేస్తాను.
ప్ర) భవిష్యత్తులో మీ ఫ్యామిలీ హీరోలతో కాకుండా వేరే హీరోలతో కలిసి సినిమా చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారు?
సాయి తేజ్ : అందరి హీరోలతో చేయాలని ఉంది.మరీ ముఖ్యంగా రవితేజ గారు, ప్రభాస్ అన్నతో చేయాలనే ఆసక్తి ఉంది. అలాగే కళ్యాణ్ రామ్ అన్న, తారక్, మనోజ్ ఇలా అందరితో కూడా చేయాలని ఉంది.
ప్ర) మనోజ్ గారితో ‘బిల్లా రంగా’ ఉంటుందా ?
సాయి తేజ్ : నాకు.. మనోజ్ కి ఆ కథతో చేయాలని ఉంది. కానీ మెటీరియలైజ్ కావడం లేదు.
ప్ర) హీరోయిన్లు కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ లతో పనిచేయడం ఎలా అనిపించింది?
సాయి తేజ్ : కేతిక.. వైష్ణవ్ తో ఓ సినిమా చేసింది. కాబట్టి ఆమె నాకు (Sai Tej) ముందునుంచీ తెలుసు. వాళ్ళకి తెలుగు రాకపోయినా డైలాగులు విని చెప్పడానికి రెడీగా ఉండేవారు. అది వాళ్ళ హార్డ్ వర్క్ కి నిదర్శనం.
ప్ర) తమన్ మ్యూజిక్ ఎలా అనిపించింది?
సాయి తేజ్ : సినిమా చూశాక తమన్ ను మెచ్చుకోని వారంటూ ఉండరు. సంగీతం అద్భుతంగా ఉందని చెప్తారు. క్లైమాక్స్ అయితే ఆ మ్యూజిక్ కి కన్నీళ్లు వచ్చేస్తాయి.
ప్ర) నిర్మాతల గురించి చెప్పండి?
సాయి తేజ్ : ‘పీపుల్ మీడియా’ వారు గతంలో ‘వెంకీ మామ’ తో వెంకటేష్ – చైతన్య అంటే.. ఆ మేనల్లుడు – మేనమామతో చేశారు. ఇప్పుడు మా మావయ్యతో కలిసి నటించే అవకాశం ఇచ్చారు. ఇంత కంఫర్ట్ ఇచ్చే నిర్మాతలు చాలా రేర్ గా ఉంటారు. అందులో వీళ్ళు మెయిన్ అని చెప్పవచ్చు.
ప్ర) ఇదే బ్యానర్లో మరో సినిమా చేసే అవకాశం ఉందా?
సాయి తేజ్ : తప్పకుండా ఉంది. కానీ కథ ఫైనల్ అవ్వాలి.
ప్ర) ‘బ్రో’ తర్వాత కొంత గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నారట?
సాయి తేజ్ : నిజమే ..! ఒక 6 నెలలు గ్యాప్ తీసుకుని.. కొంచెం బెటర్ గా తయారవ్వాలి అనుకుంటున్నాను. కథలు వింటూనే ఉంటాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతూనే ఉంటాయి.