క్యారెక్టర్స్ బేస్డ్ కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరించగల సిద్ధహస్తుడు మారుతి తెరకెక్కించిన తాజా చిత్రం “శైలజారెడ్డి అల్లుడు”. నాగచైతన్య-అను ఎమ్మాన్యుల్ జంటగా నటించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ టైటిల్ పాత్ర పోషించడం విశేషం. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వినాయక చవితి సందర్భంగా నేడు (సెప్టెంబర్ 13) విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ : తనకు ఆకలేస్తున్నా కూడా పక్కనోడు “తినమ్మా” అని బ్రతిమిలాడితే తప్ప భోజనం చేయని ఈగోయిస్టిక్ అమ్మాయి అను (అను ఎమ్మాన్యూల్). అలాంటి ఈగో ఉన్న అమ్మాయిని తొలిచూపులోనే ప్రేమిస్తాడు చైతన్య (నాగచైతన్య).. ఆమె ఈగో లో ఇరుక్కుపోయి బయటకి రాలేకపోతున్న ప్రేమను బయటకి రప్పించి ఆమె తనను ప్రేమించేలా చేసుకొంటాడు చైతూ. అయితే.. అనుని ఒప్పించడం కంటే ఆమె తల్లి శైలజా రెడ్డి (రమ్యకృష్ణ)ను తమ పెళ్ళికి ఒప్పించడం చాలా కష్టమని తెలుసుకొని వరంగల్ వెళతాడు.
కానీ.. “శైలజా రెడ్డి అల్లుడు” అనిపించుకోవడం అంత సులభమైన విషయం కాదని తెలుసుకొని తల్లీకూతుళ్ల ఈగోలకు తగ్గట్లుగా తాను మెలుగుతూ రకరకాల ప్లాన్స్ వేస్తూ ఇద్దరినీ తనవైపుకు ఎలా తప్పికొన్నాడు? అనేది సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు : నాగచైతన్య తనకు బాగా సెట్ అయిన ప్రేమమ్ లుక్ నే ఈ సినిమాలోనూ కంటిన్యూ చేసి.. ఈ సినిమాకి కూడా ఆ ఫ్లేవర్ తీసుకురావడానికి ప్రయత్నించాడు కానీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. అబ్బాయి క్యారెక్టరైజేషన్ ఏమిటనేది క్లారిటీ ఉండదు. అలాగే.. సినిమాలో చైతూ పెర్ఫార్మెన్స్ కూడా పెద్ద డీటెయిల్డ్ గా ఉండదు. కామెడీ సీన్స్ లో మాత్రం పర్వాలేదనిపించుకొన్నాడు.
అను ఎమ్మాన్యూల్ సినిమా మొత్తం చీరలు కట్టడం వల్ల అలా కనిపించిందా? లేక అమ్మాయి లావెక్కిందో తెలియదు కానీ చైతన్య కంటే పెద్దాడానిలా కనిపించి అను ఎమ్మాన్యూల్. అసలే యావరేజ్ పెర్ఫార్మెన్స్ అనుకుంటే లుక్స్ పరంగానూ చాలా యావరేజ్ గా ఉండడంతో ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. చిన్మయి డబ్బింగ్ బాగున్నప్పటికీ.. దానికి అను లిప్ మూమెంట్ సింక్ అవ్వకపోవడంతో డైలాగులన్నీ ఏదో అలా వెళ్లిపోతున్నాయి అనిపిస్తుంటుంది.
రమ్యకృష్ణ లుక్స్ & పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా విశ్లేషించాల్సిన అవసరం లేదనుకోండి. మన శివగామి ఈ సినిమాలోనూ తన కళ్ళతోనే అభినయించి అదరగొట్టింది. అయితే.. ఆవిడ మరీ సన్నగా కనిపించాలని పడుతున్న కష్టం కాస్త ఎక్కువయ్యిందో ఏమో కానీ మునుపటి చార్మ్ కోల్పోయి కాస్త విభిన్నంగా కనిపించింది.
మురళీశర్మ క్యారెక్టరైజేషన్, అతడి మ్యానరిజమ్స్ బాగున్నాయి. అలాగే.. పృధ్వీ-వెన్నెల కిషోర్ ల కామెడీ కాస్త నవ్వించింది. ఫిదా సినిమాలో సాయిపల్లవి సిస్టర్ గా నటించిన రేణుకను తీసుకొచ్చి ఈ సినిమాలో పనిమనిషి పాత్ర పోషింపజేయడం ఎందుకో అర్ధం కాదు.
సాంకేతికవర్గం పనితీరు : గోపీసుందర్ పాపం కేరళ వరద విధ్వంసం నుంచి ఇంకా బయటపడినట్లు లేడు. పాటల్లో కొత్తదనం లేకపోగా.. బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా పేలవంగా ఉంది. కాస్త టైమ్ ఇచ్చి ఉంటే బెటర్ అవుట్ పుట్ ఇచ్చేవాడేమో.
నిజార్ షఫీ సినిమాటోగ్రఫీలో రిచ్ నెస్ కనబడింది కానీ.. సినిమాటిక్ ఫీలింగ్ మరియు ఎమోషన్స్ మాత్రం మిస్ అయ్యాయి. నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదనే విషయం ప్రతి సన్నివేశంలోనూ అర్ధమవుతూనే ఉంటుంది. ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా ఉంటే కనీసం ప్రేక్షకులు చివరి వరకూ ఓపిగ్గా కూర్చునేవారేమో.
దర్శకుడు-రచయిత మారుతి మెలమెల్లగా తన మార్క్ కోల్పోతున్నాడు. “భలే భలే మగాడివోయ్” చిత్రంతో ప్రేక్షకుల చేత ముక్తకంఠంతో “మారుతిలో ఇంత అద్భుతమైన దర్శకుడు ఉన్నాడా?” అనిపించుకొన్న మారుతి రానురాను స్క్రీన్ ప్లే మీద పట్టు కోల్పోతున్నాడని అర్ధమవుతుంది. ఒక సింగిల్ పాయింట్ తో సినిమా మొత్తాన్ని లాక్కొచ్చేయాలనే మారుతి ప్రయత్నం రాను రాను బోరు కొట్టేస్తుంది. ముఖ్యంగా ఎమోషన్స్ ను పూర్తిగా గాలికొదిలేస్తున్నాడు మారుతి. మారుతి మార్క్ కామెడీ కూడా రొటీన్ అయిపోతుంది. ఆయన ఆర్టిస్టులతోపాటు తన రైటింగ్ స్టైల్ కూడా కాస్త మార్చితే బాగుంటుంది. హీరో లేదా హీరోయిన్ కి ఒక సమస్య పెట్టేసి, ఒక నాలుగైదు కామెడీ సీన్లు యాడ్ చేసి సినిమా అయిపోయింది అనిపిస్తానంటే ప్రేక్షకులు మాత్రం ఎన్నాళ్లు ఆదరిస్తారు చెప్పండి. సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడు ఒక సినిమా నుంచి కోరుకొనేది కేవలం ఎంటర్ టైన్మెంట్ మాత్రమే కాదు మనసుకి హత్తుకొనే భావోద్వేగాలు కూడా. వాటిని పూర్తిగా పట్టించుకోవడం మానేస్తున్నాడు మారుతి.
ఇలాగే కంటిన్యూ అయితే గనుక ఒకప్పుడు మారుతి మంచి కథలు రాసేవాడనో లేక ఒక మంచి సినిమా తీశాడు అనో చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ.. చిన్న సినిమా-డిజిటల్ సినిమా అనే పదానికి విలువ పెంచిన మారుతి లాంటి దర్శకుడి దగ్గర మంచి కథ రాయగల సత్తా మాత్రమే కాక ఆ కథను అర్ధవంతంగా తెరకెక్కించగల దర్శకత్వ సామర్ధ్యం కూడా పుష్కలంగా ఉందనే నమ్మకంతో ఆయన తదుపరి చిత్రమైనా ఆకట్టుకొంటుందని ఆశించడం తప్ప ఏమీ చేయలేం.
విశ్లేషణ : “శైలజారెడ్డి అల్లుడు” సినిమాలో లెక్కకు మిక్కిలి ఆర్టిస్టులున్నారు. ఒకట్రెండు కామెడీ సీన్స్ ఉన్నాయి. రెండు కమర్షియల్ ఫైట్స్ ఉన్నాయి. సో, టైమ్ పాస్ కోసం ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా ఈ చిత్రాన్ని చూడాలి తప్పితే.. భారీ అంచనాలు పెట్టుకొని సినిమా వెళ్తే మాత్రం థియేటర్ నుంచి నీరసంగా బయటకి వస్తారు.
రేటింగ్ : 2.5/5