‘యానిమల్’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు కొల్లగొట్టిన సందీప్ రెడ్డి వంగా, ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. ప్రభాస్ తో చేస్తున్న ‘స్పిరిట్’ సినిమా కోసం ఫ్యాన్స్ నమ్మకంతో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ టీ సిరీస్ తో సందీప్ ఏకంగా మూడు సినిమాల ఒప్పందం కుదుర్చుకున్నారట. ఇది చూసి కొంతమంది కార్పొరేట్ చేతిలో సందీప్ స్టైల్ ఏమైనా మారుతుందా అని సందేహిస్తున్నారు. కానీ ఆ భయం అస్సలు అవసరం లేదని విశ్లేషకులు అంటున్నారు.
ఈ డీల్ ప్రకారం.. ప్రభాస్ ‘స్పిరిట్’, అల్లు అర్జున్ తో చేయబోయే సినిమా, అలాగే రణబీర్ కపూర్ ‘యానిమల్ పార్క్’.. ఈ మూడూ టీ సిరీస్ బ్యానర్ లోనే రాబోతున్నాయని టాక్. సాధారణంగా బడా కార్పొరేట్ కంపెనీలు సినిమా తీసేటప్పుడు బిజినెస్ కోసం కొన్ని రూల్స్ పెడతాయి. ఎక్కువ మంది ఆడియన్స్ ను రీచ్ అవ్వడానికి కంటెంట్ లోని వాడిని, వేడిని తగ్గించమని కోరుతాయి. కానీ సందీప్ విషయంలో ఈ ఫార్ములా వర్తించదు.
ఎందుకంటే.. సెన్సేషనల్ హిట్ అయిన ‘యానిమల్’ సినిమాను నిర్మాణంలో కూడా ఇదే టీ సిరీస్ ఒక పార్ట్నర్. భూషణ్ కుమార్ సహా నిర్మాతగా ఉంటూనే సందీప్ కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. 3 గంటల నిడివి ఉన్నా, వైల్డ్ వయెలెన్స్ ఉన్నా, ‘ఏ’ సర్టిఫికెట్ వచ్చినా నిర్మాతలు అడ్డు చెప్పలేదు. ఫలితం కళ్ల ముందే ఉంది. 900 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. అంటే సందీప్ విజన్ మీద టీ సిరీస్ కు గుడ్డి నమ్మకం ఏర్పడింది.
కాబట్టి రాబోయే ‘స్పిరిట్’ విషయంలోనూ సందీప్ మార్క్ లో ఏమాత్రం మార్పు ఉండదు. పైగా బడ్జెట్ పెరుగుతుంది కాబట్టి సందీప్ ఇంకాస్త వైల్డ్ గా వెళ్లే ఛాన్స్ ఉంది. తన బ్రదర్ ప్రణయ్ రెడ్డి వంగా సహ నిర్మాతగా ఎలాగూ ఉంటారు కాబట్టి, క్రియేటివ్ ఫ్రీడమ్ విషయంలో ఎలాంటి ఢోకా లేదు. టీ సిరీస్ కేవలం పెట్టుబడి పెట్టి, డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటుంది తప్ప, కథలో వేలు పెట్టే సాహసం చేయదు.