ప్రభాస్ నటించిన ‘బుజ్జిగాడు’ చిత్రంతో తెలుగు ఆడియన్స్ కు పరిచయమయ్యింది సంజన. ఈ చిత్రం తప్ప సంజన కి గుర్తింపు తెచ్చిన చిత్రాలేమి రాలేదు అని చెప్పడంలో సందేహం లేదు. ‘సత్యమేవ జయతే’ ‘ముగ్గురు’ ‘యమహా యమ’ ‘నేనేం చిన్న పిల్లనా’ ‘అవును 2’ ‘సర్ధార్ గబ్బర్ సింగ్’.. ఇలా అరడజను పైగా సినిమాలు చేసినా ఈవిడ నటించినట్టే చాలామందికి తెలియదనే చెప్పాలి. ప్రస్తుతం సంజన కన్నడ .. మలయాళ భాషల్లో హీరోయిన్ గా నటిస్తూ బిజీగా ఉంది.
అయితే తాజాగా సంజన సర్జరీ చేయించుకుందట. ఈ విషయాన్నీ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. తన అండాశయంలో ప్రమాదకరంగా పెరుగుతోన్న 550 ఎమ్ ఎమ్ డెర్మాయిడ్ ను డాక్టర్లు ఆపరేషన్ చేసి తొలగించారనీ… ప్రస్తుతం హాస్పిటల్ లో బెడ్ రెస్ట్ తీసుకుంటున్నట్టు తెలిపింది. తాను దాదాపు నెలరోజుల నుండీ బయటికి రాకపోవడానికి ఇదే కారణమని, ఇప్పుడిప్పుడే తను కోలుకుంటున్నట్టు తెలిపింది. అంతే కాకుండా ప్రతీ మహిళ వారి ఆరోగ్యం పై చాలా జాగ్రత్త వహించాలని, ప్రతీ 6 నెలలకు ఒకసారైనా అండాశయం .. గర్భాశయాలకి సంబంధించిన టెస్టులు చేయించుకోవాలంటూ సందేశాన్ని జారీ చేసింది.