Tollywood: మరోసారి ‘8 వారాలు’ డిస్కషన్‌.. ఈసారైనా నిర్ణయం మీద నిలబడతారా?

మనం పదే పదే పాత మాటలు గుర్తు చేస్తుంటే టాలీవుడ్‌లో కొంతమంది పెద్దలకు కోపం వస్తుందేమో కానీ.. కొన్ని నెలల క్రితం ఇండస్ట్రీ అంతా బంద్‌ చేసి కొన్ని పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు. వాటన్నింటి గురించి మనం ఇప్పుడు డిస్కషన్‌ చేయలేం కానీ.. అందులో ముఖ్యమైంది నిర్మాతలకు, పరిశ్రమకు ఎంతో హెల్ప్‌ చేసేది.. పరిశ్రమ పట్టించుకోని ఓ అంశం గురించి ఇప్పుడు మాట్లాడదాం. నిజానికి ఆ అవకాశం ఇచ్చింది కూడా సినిమా పరిశ్రమనే. ఎందుకంటే అప్పుడు నిర్ణయం తీసుకొని అమలు చేయకుండా ఇప్పుడు మళ్లీ డిస్కషన్‌ చేస్తున్నారు కాబట్టి.

Tollywood

టాలీవుడ్‌లో తీసుకున్న నిర్ణయాలను బయటకు చెప్పి శాసనాలు, జీవోలు తీసుకురావడం లాంటిది ఏమీ ఉండదు. ఉండే అవకాశం కూడా లేదు. అయితే వాటిని ఓ మాటగా అందరూ పాటించాలి. అలా ఇప్పటివరకు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఒకటి థియేటర్లలో సినిమా విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీకి ఆ సినిమా ఇవ్వడం. దీనిపై కొన్ని రోజులు పట్టుపట్టి కూర్చున్న నిర్మాణ సంస్థలు ఆ తర్వాత సడలించాయి. అయితే బాలీవుడ్‌లో ఇంకా ఈ రూల్‌ని అక్కడి నిర్మాతలు, ఓటీటీలు చాలావరకు ఫాలో అవుతున్నాయి.

మన దగ్గర ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత పెద్ద విజయం సాధించిన సినిమా అయినా నాలుగు వారాలకే ఓటీటీ డోర్‌ తట్టేస్తున్నాయి. దీనికి కారణం అప్పటికే ఆ ఓటీటీ సంస్థతో నిర్మాతలు చేసుకున్న ఒప్పందమే. అలా అని నిర్మాతల తప్పు అని చెప్పలేం. ఎంత వేగంగా ఓటీటీకి ఇస్తే అంత ఎక్కువ డబ్బు ఇస్తున్నారు మరి. దీంతో థియేటర్లలో సినిమా అక్కడక్కడా ఉన్నా ఓటీటీలోకి ఇచ్చేస్తున్నారు. ఈ విషయంలో మల్టీప్లెక్స్‌ల అసోసియేషన్‌ ఇబ్బందిపడుతోందట. నాలుగు వారాలకే ఓటీటీలకు ఇవ్వడం వల్ల థియేటర్‌ బిజినెస్‌ దెబ్బతింటోందనేది వారి మాట.

ఈ మేరకు బాలీవుడ్‌లో నాలుగు వారాల ఓటీటీ సినిమాలను తమ మల్టీప్లెక్స్‌ల్లో ప్రదర్శించకూడదని అసోసియేషన్ కట్టుబాటు పెట్టుకుందట. ఇప్పుడు ఇదే ఆలోచనను దేశవ్యాప్తం చేయాలని చూస్తున్నారట. దీంతో టాలీవుడ్ నిర్మాతల్లో ‘8 వారాల’ చర్చ మళ్లీ మొదలైందట. ఈ నెలాఖరులో ఓసారి యాక్టివ్‌ నిర్మాతలు కూర్చుని ఈ సంగతి డిస్కషన్‌ చేస్తారట. పైన చెప్పినట్లు ఇదేం కొత్త డెసిషన్‌, డిస్కషన్‌ కాదు. గతంలో అనుకున్న మాట మీద నిలబడాలి అంతే.

అభిమానుల తాకిడికి తీవ్ర అసౌకర్యానికి గురైన హీరోయిన్ నిధి అగర్వాల్..!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus