వెంకటేష్ (Venkatesh Daggubati), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చూపించింది. సంక్రాంతి బరిలో దూసుకెళ్లి భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ రంగానికి అడుగుపెడుతోంది. థియేట్రికల్ గా హిట్ అయ్యి, బయ్యర్లకు మంచి లాభాలను ఇచ్చిన ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను భారీ డీల్‌లో అమ్మి మరోసారి వార్తల్లో నిలిచింది. సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు ఉన్నప్పటికీ, సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) అంచనాలకు మించి వసూళ్లు సాధించడంతో, నిర్మాత దిల్ రాజుకు గట్టి లాభాలు అందాయి.
గేమ్ ఛేంజర్ వంటి భారీ సినిమాలకు ఊహించని స్థాయిలో పెట్టుబడులు పెట్టిన దిల్ రాజు, ఈ సినిమాతో ఆ నష్టాలను చాలా వరకు ఈ సినిమాతో రికవర్ చేసుకున్నారని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు సినిమా రూ. 100 కోట్లకు పైగానే ప్రాఫిట్స్ అందించినట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫాం ZEE5 ఈ సినిమా రైట్స్‌ను దాదాపు 27 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే, స్ట్రీమింగ్‌కు ముందు, ఈ సినిమాను జీ తెలుగులో టెలికాస్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇది ఓటీటీ వ్యూయర్‌షిప్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. సినిమాలో వెంకటేష్ పవర్‌ఫుల్ క్యారెక్టర్, కామెడీ టైమింగ్, కుటుంబ ఎమోషన్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. వెంకీ సరసన ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్లుగా నటించగా, నరేశ్ (Naresh), సాయి కుమార్ (Sai Kumar ), ఉపేంద్ర లిమాయే (Upendra Limaye), శ్రీనివాస రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
అనిల్ రావిపూడి మునుపటి సినిమాల మాదిరిగానే, ఈ చిత్రంలో కూడా మాస్, కామెడీ, ఎమోషన్ మిక్స్ చేశారు. ఈ సినిమా విజయంతో సంక్రాంతికి వస్తున్నాం 2 ప్రకటన కూడా వచ్చింది. వెంకటేష్ స్వయంగా 2027 సంక్రాంతికి ఈ సినిమా సీక్వెల్ రానున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం వెంకటేష్ రాణా నాయుడు 2 కోసం సిద్ధమవుతున్నారు.