మధుర శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో సంజీవ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “సంతాన ప్రాప్తిరస్తు”. “స్పార్క్” ఫేమ్ విక్రాంత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో సగటు భారతీయ పురుషుడు ఎదుర్కొంటున్న స్పెర్మ్ కౌంట్ కీలకాంశంగా తెరకెక్కడం విశేషం. మరి ఈ సెన్సిటివ్ టాపిక్ ను టీమ్ ఎలా డీల్ చేశారు? దానికి ఆడియన్స్ ఏమేరకు కనెక్ట్ అయ్యారు? అనేది చూద్దాం..!!
కథ: నెలకి 60 వేల రూపాయల జీతం వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగం, తల్లిదండ్రులు లేకపోయినా.. అంతే ప్రేమగా చూసుకునే అక్క-బావ, మంచి స్నేహితులు, ప్రేమించి పెళ్లాడిన అమ్మాయి. ఇలా జీవితంలో అన్ని చాలా హ్యాపీగా సాగిపోతున్న తరుణంలో ఒక షాక్ తగులుతుంది చైతన్య (విక్రాంత్ రెడ్డి)కి. అదేంటంటే.. పిల్లలు కనేందుకు కావాల్సినంత స్పెర్మ్ కౌంట్ లేదు అనేది.
ఆ కౌంట్ పెంచుకునేందుకు చైతన్య పడిన కష్టాలు ఏమిటి? ఈ క్రమంలో అతడు ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? అనేది సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు: ముందుగా ఈ తరహా కథను యాక్సెప్ట్ చేసినందుకు విక్రాంత్ ను మెచ్చుకోవాలి. హీరో అంటేనే మగాడు అనే ఒక టెంప్లేట్ ను ఫాలో అయ్యే సినిమా ఇండస్ట్రీలో.. హీరోకి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నట్లు చూపించడం అనేది మెచ్చుకోదగ్గ విషయం. నటుడిగా విక్రాంత్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు. కానీ.. హావభావాల విషయంలో ఇంకాస్త పరిణితి అవసరం.
చాందిని చౌదరి స్క్రీన్ ప్రెజన్స్ & నటన బాగున్నప్పటికీ.. ఆమెకు వేరే అమ్మాయితో డబ్బింగ్ చెప్పించడం అనేది కాస్త ఎబ్బెట్టుగా ఉంది. తెలంగాణ యాసతో సమస్య వల్లే ఇలా చేసి ఉంటే మాత్రం అది కరెక్ట్ కాదు. తెలుగమ్మాయిగా చాందిని ఎప్పటినుండో తెలుసు అందరికీ.. అలాంటిది ఆమెకి డబ్బింగ్ వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించడం అనేది మైనస్ అయ్యింది.
చాలారోజుల తర్వాత మురళీధర్ గౌడ్ కి మంచి క్యారెక్టర్ దొరికింది. ఫుల్ లెంగ్త్ పాత్రలో మురళీధర్ గౌడ్ తన సత్తాను ఘనంగా చాటుకున్నాడు.
అభినవ్ గోమటం కామెడీ టైమింగ్ & పంచులు ఎప్పట్లానే నవ్వించాయి.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు సంజీవ్ రెడ్డి ఎంచుకున్న పాయింట్, ఆ పాయింట్ ను ఎక్కడా అసభ్యత, అశ్లీలత లేకుండా డీల్ చేసిన విధానం అభినందనీయం. మరీ ముఖ్యంగా అందరూ తెలుగు ఆరిస్టులను ఎంచుకుని ఇంకా మంచి పని చేశాడు. అలాగే.. కాన్సెప్ట్ స్పెర్మ్ కౌంట్ కదా అని అస్తమానం దాని గురించి డిస్కస్ చేయకుండా.. మంచి ఫ్యామిలీ డ్రామా & ఎమోషన్స్ ను సినిమాలో మేళవించిన తీరు బాగుంది. అయితే.. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ప్రేక్షకులు బోర్ ఫీలవ్వకుండా కుదిరినన్ని సన్నివేశాలు, సందర్భాలు రాసుకున్నాడు సంజీవ్.. అయితే అవన్నీ అలరించే విధంగా తీర్చిదిద్దడంలో కాస్త తడబడ్డాడు. అయితే.. సినిమాని ముగించిన విధానం, అక్కడ పండించిన ఎమోషన్స్ మాత్రం బాగా వర్కవుట్ అయ్యాయి. ఓవరాల్ గా.. దర్శకుడిగా, కథకుడిగా సంజీవ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడని చెప్పొచ్చు.
సునీల్ కశ్యప్ పాటలు పర్వాలేదు అనిపించేలా ఉన్నా.. నేపథ్య సంగీతం మాత్రం చాలా బెటర్ గా ఉండొచ్చు అనిపించింది. చాలా చోట్ల ఎమోషన్ ను సరిగా ఎలివేట్ చేయలేదు.
సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. ఎడిటర్ సాయికృష్ణ కుదిరినంతలో క్రిస్ప్ గా సినిమాని ఎడిట్ చేశాడు. ట్రాన్సిషన్స్ బాగున్నాయి. వాటి వల్ల సీన్ టు సీన్ కనెక్టివిటీ అనేది బాగా సెట్ అయ్యింది.
ఆర్ట్ & ప్రొడక్షన్ టీమ్ మంచి అవుట్ పుట్ ఇచ్చారు. నిర్మాతలు కూడా సినిమాకి అవసరమైనంతలో మంచి బడ్జెట్ కేటాయించారు. అందువల్ల క్వాలిటీ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు.
విశ్లేషణ: ఒకప్పుడు సినిమాలో ఒక జంటకు పిల్లలు పుట్టలేదు అంటే.. అది హీరోయిన్ సమస్య అన్నట్లుగానే చూపించేవారు. ఎందుకంటే హీరో మగాడు అనే ఇమేజ్ ను బలోపేతం చేయడమే ప్రధానాంశంగా ఉండేది. ఒకవేళ ఆ తరహా సమస్యను చూపించినా.. అది సైడ్ క్యారెక్టర్స్ లేదా కమెడియన్స్ కు ఆపాదించేవారు. అలాంటిది స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం అనేది హీరో పాత్రకి యాడ్ చేయడమే పెద్ద విషయం. అయితే.. మారుతున్న కాలంలో, ప్రేక్షకుల ఆలోచనాధోరణి, సినిమాని చూసే విధానం కూడా మారుతూ వచ్చాయి కాబట్టి.. “సంతాన ప్రాప్తిరస్తూ” అనే సినిమా సాధ్యపడింది అని చెప్పొచ్చు. దర్శకుడు సంజీవ్ రెడ్డి కూడా ఈ సమస్యకి సరైన మోతాదులో ఆరోగ్యకరమైన హాస్యాన్ని జోడించి డీసెంట్ గా తెరకెక్కించాడు. అందువల్ల.. “సంతాన ప్రాప్తిరస్తు” మంచి ఫన్ ఎంటర్టైనర్ విత్ ఏ మెసేజ్ గా నిలిచింది. ఇప్పటివరకు మగాళ్లు మనసుల్లోనే దాచేసుకున్న ఈ సమస్యను.. ఇకపై ఓపెన్ గా డిస్కస్ చేసుకునేందుకు స్కోప్ ఇచ్చింది ఈ చిత్రం.
ఫోకస్ పాయింట్: సెన్సిటివ్ టాపిక్ ని సెన్సిబుల్ గా డీల్ చేసిన సంజీవ్!
రేటింగ్: 3/5