సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా కాలం తర్వాత పూర్తిస్థాయి మాస్ రోల్లో కనిపించిన చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించగా మహేష్ బాబు నిర్మాణ భాగస్వామిగానూ నిలిచారు.. దిల్ రాజు సమర్పకులుగా వ్యవహరించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ ఫ్యామిలీ మాస్ ఎంటర్ టైనర్ ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

కథ: మంచు కొండల నడుమ ఎముకలు కోరికే చలిలో దేశ సంరక్షణ కోసం పరితపించే సైనికుడు మేజర్ అజయ్ కృష్ణ (మహేష్ బాబు). ఎలాంటి సమస్యనైనా తెలివితో చాకచక్యంగా పరిష్కరించగలగడం అజయ్ నైజం. తన సహచరుడు అజయ్ (సత్యదేవ్) ఒక ఆపరేషన్ లో భాగంగా తీవ్ర గాయాల పాలవ్వడంతో.. అతడి చెల్లి పెళ్లి దగ్గరుండి జరిపించడం కోసం కాశ్మీర్ నుండి కర్నూలు బయలుదేరుతాడు. ఆ ట్రైన్ జర్నీలో పరిచయమవుతుంది సంస్కృతి (రష్మిక).

కట్ చేస్తే.. కర్నూలులో జనాలందరిచేత చేతులెత్తి మొక్కించుకోగల ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న ప్రొఫెసర్ భారతి (విజయశాంతి)కి ఎమ్మెల్యే నాగేంద్ర (ప్రకాష్ రాజ్) తలనొప్పిగా మారి ఇబ్బందిపెడుతుంటాడు.

ఈ కర్నూలు గొడవల్లోకి అజయ్ ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు? భారతి-నాగేంద్రల నడుమ ఉన్న గొడవలను ఎలా సరిదిద్దాడు? తన సహచరుడికి ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకోగలిగాడు? అనేది “సరిలేరు నీకెవ్వరు” కథాంశం.

నటీనటుల పనితీరు: “ఖలేజా, దూకుడు” తర్వాత మహేష్ బాబులోని కామెడీ టైమింగ్ ను పూర్తిస్థాయిలో వాడుకున్న చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. ఈ సినిమాలో మహేష్ బాడీ లాంగ్వేజ్ కానీ.. మ్యానరిజమ్స్ కానీ భలే కొత్తగా ఉంటాయి. మహేష్ అభిమానులు సీన్ సీన్ కి ఈల వేసే రేంజ్లో ఉంది మహేష్ ఆటిట్యూడ్. ఒక బాధ్యతగల సైనికుడిగా మాత్రమే కాక ఒక కుటుంబ పెద్దగా, అనాయాన్ని ఎదిరించే ధీరుడిగా మహేష్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. వాటన్నిటినీ అద్భుతంగా పండించాడు మహేష్. మహేష్ ఎప్పుడు ఒకేలా నటిస్తున్నాడు, ఎక్స్ ప్రెషన్స్ మారచడం లేదు అని కామెంట్ చేసినవాళ్లందరికీ ఒక చక్కని సమాధానం మేజర్ అజయ్ కృష్ణ పాత్ర. ఇక “డాంగ్ డాంగ్, మైండ్ బ్లాక్” సాంగ్స్ లో మహేష్ డ్యాన్స్ చూశాక.. ఇన్నాళ్లపాటు మహేష్ ఎందుకిలా డ్యాన్స్ చేయలేదు? అని బాధపడతారు బాబు ఫ్యాన్స్.. ఆ రేంజ్ లో కుమ్మేశాడు. ఇందుకు శేఖర్ మాస్టర్ కి కృతజ్ణతలు చెప్పుకోవాలి. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ లో మహేష్ ఈజ్ ని రష్మిక కూడా మ్యాచ్ చేయలేకపోయింది. ఈ పాటని అనిల్ రావిపూడి చెప్పినట్లు అభిమానులు సీట్లలో కూర్చోవడం కష్టమే.

13 ఏళ్ల తర్వాత కెమెరా ముందుకొచ్చిన లేడీ అమితాబ్ విజయశాంతిలో కెమెరా అంటే బెరుకు కనిపించలేదు. ఓ బాధ్యతకలిగిన వైద్య కళాశాల ప్రొఫెసర్ గా డిగ్నిఫైడ్ రోల్లో మెప్పించింది. మహేష్-విజయశాంతి కాంబినేషన్ ఎపిసోడ్స్ చూడముచ్చటగా ఉంటాయి.

“ఎఫ్ 2″లో మెహరీన్ తర్వాత అంతకుమించిన ఇరిటేషన్ క్రియేట్ చేసిన క్యారెక్టర్ “సరిలేరు నీకెవ్వరు” చిత్రంలో రష్మికది. కానీ.. మెహరీన్ క్యారెక్టర్ ను ఎంజాయ్ చేసిన ఆడియన్స్.. ఈమె కామెడీని కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. రష్మిక “అర్ధమవుతుందా?” అని సొంత గొంతుతో అడిగినప్పుడల్లా చెప్పలేనంత చిరాకు వస్తుంటుంది కానీ.. వెంటనే అది కామెడీ అని గుర్తు చేసుకొని నవ్వేసుకొంటుంటారు ఆడియన్స్.

కర్నూలు.. కొండారెడ్డి బురుజు అనగానే ప్రకాష్ రాజ్-మహేష్ బాబుల “ఒక్కడు” సినిమా గుర్తుచ్చేస్తుంది. మరీ ఆ రేంజ్ లో కాకపోయినా ఈ సినిమాలో విలనిజాన్ని బాగానే పండించాడు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ – మహేష్ నడుమ వచ్చే సన్నివేశాలు సోసోగా ఉన్నా.. ఎలివేషన్స్ మాత్రం పీక్స్ లో ఉన్నాయి. మహేష్ క్యారెక్టర్ ను హైలైట్ చేసిన విధానం ఫ్యాన్స్ ని విశేషంగా అలరిస్తుంది. వెన్నెల కిషోర్, సుబ్బరాజు, సత్యదేవ్, సత్య తదితరులు నటనతో, హాస్యంతో ఆకట్టుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు: “భరత్ అనే నేను, మహర్షి” ఆడియోతో ఫ్యాన్స్ ని బాగా హర్ట్ చేసిన దేవిశ్రీప్రసాద్ “సరిలేరు నీకెవ్వరు” చిత్రంతోనూ అదే ఫ్లోను కంటిన్యూ చేశాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ తోనూ ఆకట్టుకోలేకపోయాడు. కాకపోతే.. పాటలన్నీ చూడడానికి బాగుండడంతో దేవి నెగిటివ్ కాస్త కవర్ అయిపోయింది. రత్నవేలు పనితనాన్ని పూర్తిస్థాయిలో కాకపోయినా ఓ మోస్తరుగా వినియోగించుకున్న చిత్రమిది. “డాంగ్ డాంగ్” పాట చిత్రీకరణలో లైట్స్ & షాడోస్ తో రత్నవేలు చేసిన మ్యాజిక్ సత్ఫలితాన్నిచ్చింది. అలాగే మహేష్ ఎలివేషన్ సీన్స్ కానీ.. స్లోమోషన్ షాట్స్ కానీ ఫ్యాన్స్ కు నచ్చేలా బాగా చిత్రీకరించారు రత్నవేలు. నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడా వెనకాడలేదు. సెట్స్, ఆర్టిస్ట్స్ విషయంలో డబ్బులు భారీగా ఖర్చుపెట్టారు.

ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడి విషయానికొస్తే.. ముందు సినిమాల్లో జూనియర్ స్టార్స్ తో కాబట్టి పెద్దగా కథ-కథనంపై కాన్సన్ ట్రేట్ చేయకపోయినా కామెడీతో లాక్కొచ్చేశాడు.

కానీ.. “సరిలేరు నీకెవ్వరు” మహేష్ లాంటి సూపర్ స్టార్ తో కావడంతో ఆయన యాటిట్యూడ్ ను ప్రేక్షకులకు పరిచయం చేయడంలో కానీ.. సెకండాఫ్ లో ఎమోషన్ తోపాటు ఎలివేషన్స్ ను హైలైట్ చేయడంలో కానీ గట్టిగానే తడబడ్డాడు. మహేష్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించడంలో పూర్తిస్థాయిలో విజయం సాధించాడు అనిల్ రావిపూడి.. ఇక ఎవ్వరూ ఊహించని విధంగా క్లైమాక్స్ ను రాసుకొన్న విధానం బాగుంది కానీ.. దాన్ని జనాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనేది చూడాలి. ఓవరాల్ గా.. ఒక దర్శకుడిగా అభిమానులను మెప్పించాడు అనిల్ రావిపూడి..

విశ్లేషణ: మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లాంటి సినిమా “సరిలేరు నీకెవ్వరు”. ఇంటర్వెల్ బ్లాక్, మైండ్ బ్లాక్ సాంగ్ & సెకండాఫ్ లో వచ్చే మహేష్-ప్రకాష్ రాజ్ తలపడే సన్నివేశాల కోసం ఫ్యాన్స్ రిపీట్ షోలు వేయడం ఖాయం. కాకపోతే.. సెకండాఫ్ లో సాగదీత మరియు నిడివి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకొని ఉంటే సాధారణ ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేసేవారు. మొత్తానికి సంక్రాంతికి మహేష్ బోణీ కొట్టేసినట్లే.

రేటింగ్: 3/5

Click Here To Read in English

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus