Sarkaaru Noukari Review In Telugu: సర్కారు నౌకరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • ఆకాష్ గోపరాజు (Hero)
  • భావన (Heroine)
  • తనికెళ్ళభరణి, సాయిశ్రీనివాస్ వడ్లమాని, సూర్య, మణిచందన్, రాజేశ్వరి ముళ్ళపూడి, రమ్యా (Cast)
  • గంగనమోని శేఖర్ (Director)
  • కె.రాఘవేంద్రరావు (Producer)
  • శాండిల్యా పిసపాటి (Music)
  • గంగనమోని శేఖర్ (Cinematography)
  • Release Date : జనవరి 01, 2024

టాలీవుడ్ ఆడియన్స్ కు సుపరిచితురాలైన సింగర్ సునీత్ కుమారుడు ఆకాష్ గోపరాజును కథానాయకుడిగా పరిచయం చేస్తూ.. గంగనమోని శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రఖ్యాత దర్శకుడు కె.రాఘవేంద్రరావు నిర్మించడం విశేషం. 2024లో విడుదలైన మొదటి సినిమా ఇదే కావడం విశేషం. సరిగ్గా మూడ్రోజుల క్రితం యాంకర్ సుమ కుమారుడు హీరోగా పరిచయమవ్వగా.. ఇప్పుడు సింగర్ సునీత కొడుకు ప్రేక్షకుల్ని హీరోగా పలకరించడం ప్రత్యేకతను సంతరించుకుంది. మరి “సర్కారు నౌకరీ” ఎలా ఉందో చూద్దాం..!!

కథ: మహబూబ్ నగర్ లోని కొల్లాపూర్ గ్రామంలోని మండల పరిషత్ ఆఫీస్ లో పని చేస్తుంటాడు గోపాల్ (ఆకాష్ గోపరాజు). ఇష్టపడి పెళ్లి చేసుకున్న సత్య (భావన)తో ఊర్లో చాలా హుందాగా బ్రతుకుతుంటాడు.

అయితే.. గోపాల్ ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి మాత్రమే కాదు.. ఆ మండలంలో ఎయిడ్స్ వ్యాధి వ్యాపించకుండా అందరినీ జాగ్రత్తపరచాల్సిన బాధ్యత అతడిది. దాంతో ఊరంతా అతడ్ని తక్కు చేసి చూడడాన్ని, అసభ్యంగా అతడితో వ్యవహరించడాన్ని భార్య సత్య తట్టుకోలేకపోతుంది. ఒకానొక సందర్భంలో సర్కారు నౌకరి కావాలో, నేను కావాలో తేల్చుకోమని అల్టిమేటం జారీ చేస్తుంది. అసలు గోపాల్ ఉద్యోగం విషయంలో ఎందుకని అంత పట్టుబట్టి కూర్చున్నాడు? ఈ సర్కారు నౌకరీ వల్ల అతనికి ఒరిగిందేమిటి? అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు: సునీత కుమారుడైన ఆకాష్ నటుడిగా పర్వాలేదనిపించుకున్నాడు కానీ.. స్క్రీన్ ప్రెజన్స్ విషయంలో మాత్రం నిలబడలేకపోయాడు. హావభావాల విషయంలో ఇంకా పరిణితి చెందాల్సిన అవసరముంది.హీరోయిన్ భావన పల్లెటూరి అమ్మాయిగా ఒదిగిపోయింది. గొడవపడే సన్నివేశాలు మరియు కొన్ని ఎమోషనల్ సీన్స్ లో పాత్రకు న్యాయం చేసింది. బావామరదళ్లుగా నటించిన వారు బాగున్నారు కానీ.. వారి పాత్రల వల్ల ఎమోషన్ సరిగా క్యారీ అవ్వలేదు. తనికెళ్లభరణి పాత్ర చిన్నదే అయినా తన సీనియారిటీతో నెట్టుకొచ్చేశాడు. రమ్య పొండూరి, రాజేశ్వరి ముళ్ళపూడి తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: శ్యాండిలా పిసపాటి పాటలు బాగున్నాయి. ప్రొడక్షన్ డిజైన్ మరియు ఆర్ట్ వరకు సినిమా కాన్సెప్ట్ ను ఎలివేట్ చేసే స్థాయిలో ఉన్నాయి. సినిమాటోగ్రఫీ వర్క్ సోసోగా ఉంది. రూరల్ అందాలను చూపించడంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు ఛాయాగ్రాహకుడు కమ్ దర్శకుడు గంగనమోని శేఖర్. ఇక శేఖర్ దర్శకత్వ మరియు రచనా ప్రతిభ గురించి మాట్లాడుకోవాలంటే.. పాయింట్ గా అనుకున్నప్పుడు ఇది హిలేరియస్ గా వర్కవుటయ్యే కథ. కానీ.. కథనం & సన్నివేశాల రూపకల్పన చాలా ముఖ్యం. ఆ రెండు విషయాల్లో శేఖర్ విఫలమయ్యాడు.

మొదటి 20 నిమిషాలు కాస్త పర్వాలేదనిపించుకున్నా.. ఆ తర్వాత మాత్రం కథను ముందుకు నడపడంలో తడబడ్డాడు. ఒకానొక సందర్భంలో ఇది సర్కారు వారి వాణిజ్య ప్రకటనలా అనిపిస్తుంది. అలాగే.. క్లైమాక్స్ లో హీరో ఔన్నత్యాన్ని ఒకేసారి పెంచేయడం కోసం ఇరికించిన క్లైమాక్స్, & బ్యాక్ స్టోరీ చాలా అసహజంగా ఉన్నాయి. అలాగే.. ఎయిడ్స్ వ్యాధి గురించి, దాని నివారణ గురించి వివరించే విధానం ఇంకాస్త బోల్డ్ గా ఉండొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఇబ్బంది కలగకూడదు అని దర్శకుడు వేసుకున్న ఈ బోర్డర్ కూడా మైనస్ గా మారింది.

విశ్లేషణ: స్క్రీన్ ప్లే & సీన్ కంపోజిషన్ విషయంలో జాగ్రత్త తీసుకొని ఉంటే మంచి విజయం సాధించి ఉండేదీ చిత్రం. ఈ రెండిటితోపాటు.. కన్విన్సింగ్ క్లైమాక్స్ లోపించడంతో సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక చతికిలపడింది. అయితే.. మూలకథ విషయంలో మాత్రం దర్శకనిర్మాతల గట్స్ ను ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి.

రేటింగ్: 2.25/5

Rating

2.25
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus