శశి సినిమా రివ్యూ & రేటింగ్!

ఒక్క హిట్ కోసం గత కొన్నేళ్లుగా తహతహలాడుతున్న ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం “శశి”. సినిమా గురించి జనాలకు పెద్దగా తెలియకపోయినా “ఒకే ఒక లోకం నువ్వు” అనే పాట మాత్రం సూపర్ హిట్ అయ్యి జనాలు సినిమాను మర్చిపోకుండా చేసింది. ఇక పవన్ కళ్యాణ్ ట్రైలర్ లాంచ్ చేయడంతో సినిమాకి ఓ మోస్తరు హైప్ వచ్చింది. మరి ఈ సినిమాతోనైనా ఆది ఒక హిట్ అందుకోగలిగాడా లేదా అనేది చూద్దాం..!!

కథ: రాజా (ఆది సాయికుమార్) తను ప్రాణంగా చూసుకునే స్నేహితుడు శశి (శివ) ఓ యాక్సిడెంట్ లో చనిపోవడంతో అతడ్ని తలుచుకుంటూ బాధలో కూరుకుపోతాడు. ఆ తర్వాత మరో శశి (సురభి)ని తొలిసారి గుడిలో చూస్తాడు. అప్పటివరకూ మొండోడిలా ఉన్న రాజా రెండో శశిని చూసినప్పట్నుంచి కాస్త పద్ధతిగా మారుతుంటాడు. అసలు రాజా-శశి-శశిల నడుమ ఉన్న కథ ఏమిటి? అనేది “శశి” సినిమా కథ.

నటీనటుల పనితీరు: గెడ్డం పెంచేస్తే రఫ్ యాక్టింగ్ అనుకునే అపోహలో ఉన్నాడు ఆది సాయికుమార్. మనిషిలోని బాధ గెడ్డంలో కనిపించదు, అతడి కళ్లల్లో కనిపించాలి. ఆ విషయాన్ని ఆది అర్ధం చేసుకుంటే బాగుండు. అన్నిటికంటే ముఖ్యంగా నటుడిగా ప్రతి సినిమాతో ఇంప్రూవ్ అవ్వకపోయినా పర్లేదు కానీ, ఆది మాత్రం ఒక్కో మెట్టు దిగుతున్నాడు. కొన్నాళ్ల గ్యాప్ తీసుకున్నా పర్లేదు కానీ, ఒక మంచి సినిమా లెదా కాన్సెప్ట్ సినిమాతో ఆది తన ఉనికిని చాటుకోవాల్సిన తరుణం రావడం బాధాకరం.

సురభి ఒక బార్బీడాల్ తరహాలో సినిమాలో నిల్చుంది, కూర్చుంది, ఇచ్చిన కొన్ని డైలాగులు అప్పజెప్పింది. మొత్తానికి మిన్నకుండిపోయింది. రాజీవ్ కనకాల, అజయ్, తమిళ నటుడు జయప్రకాశ్, శరణ్యలు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: ఒక సినిమా పాయింట్ ను అనుకున్నప్పుడు కథనం రాసుకోవడానికంటే ముందు క్యారెక్టర్స్ రాసుకోవాలి. కానీ.. “శశి” సినిమా చూస్తున్నప్పుడు దర్శకుడు కానీ రచయిత కానీ ఆ ప్రయత్నం చేశారని అనిపించదు. ఆ డైలాగులు, సన్నివేశాల కంపోజిషన్ చూస్తే “ఇంకా మన దర్శకులు ఇక్కడే ఉండిపోయారా?!” అని ఆశ్చర్యపోవడం ఖాయం. సినిమాలోని పాత్రల తీరుతెన్నులు, కథనం ఒకెత్తు, డైలాగులు ఒకెత్తు. ఎనభైల కాలంలో రాసిన యండమూరి నవలల్లోని డైలాగులు ఇప్పుడు చదివినా కొత్తగుంటాయి. కాని “శశి” సినిమాలో ప్రేమ, స్నేహం, కుటుంబం గురించి చెప్పే డైలాగులు ఎప్పుడో డబ్బైల నాటి నాటకాలను గుర్తుచేస్తాయి. ఇక స్క్రీన్ ప్లే అయితే.. థియేటర్ లో నుండి ఒక రెండేళ్ళ తర్వాత బయటపడ్డాం అని ప్రేక్షకుడు ఫీలయ్యేలా చేస్తుంది. కెమెరా వర్క్, ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్ సోసోగా ఉన్నాయి.

విశ్లేషణ: ఒక సినిమా కథ-కథనం ఎంత అనాసక్తిగా ఉన్నా కనీసం ఒకట్రెండు సన్నివేశాలైనా ఆకట్టుకొనే విధంగా ఉంటాయి. కానీ.. “శశి” సినిమాలో ఆ ఒక్క సన్నివేశం ఎప్పుడొస్తుందా అని చివరివరకూ ఎదురుచూస్తూనే ఉంటాం. కానీ అది రాదు. ఎందుకంటే లేదు కాబట్టి. ఆది హీరోగా కంటే నటుడిగా ఉనికిని చాటుకోవాలి, సురభి ఇప్పటికైనా హావభావాల విషయంలో కాస్త పాక్టీస్ చేయాలి, దర్శకనిర్మాతలు గెడ్డం పెంచుకుని, మందు తాగే ప్రతి క్యారెక్టర్ “అర్జున్ రెడ్డి” అనుకోవడం మానేయాలి. లేదంటే “శశి” లాంటి సినిమాలు వచ్చి వెళ్ళిన విషయం కూడా ప్రేక్షకులకు తెలియకుండాపోతుంది.

రేటింగ్: 1.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus