ఐసీయూలో సీనియర్ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స
- August 20, 2026 / 12:05 PM ISTByFilmy Focus Desk
ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించడంతో 95 ఏళ్ల జానకి ఆసుపత్రిలో చేరారని తెలుస్తోంది. శ్వాసకోశ సమస్యలతో కొన్ని రోజుల క్రితం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె చేరారు. అయితే బుధవారం రాత్రి ఆమె ఆరోగ్యం క్షీణించటంతో ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారని సమాచారం. ఈ మేరకు కోలీవుడ్ వర్గాల నుండి వార్తలు వస్తున్నాయి. ‘షావుకారు’ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన జానకి 450కిపైగా సినిమాల్లో నటించారు.
Shavukaru Janaki
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలతో పాటు హిందీలోనూ నటించారు. తొలి సినిమా తనకు ఎంత గుర్తింపు తీసుకొచ్చిందో చెప్పడానికి ఆమె పేరు వింటే చాలు అర్థమైపోతుంది. తన కెరీర్‌లో జానకి.. దిగ్గజ నటులతో నటించారు. నటిగానే కాకుండా మహిళగా కూడా ఆమె చాలా స్ట్రాంగ్. నాటి రోజుల్లో పెళ్లి తర్వాత, ఒక బిడ్డకు తల్లి అయ్యాక సినిమా రంగంలోకి వచ్చి అగ్ర నటిగా ఎదగడం ఆమె సాధించిన అసాధారణ విజయం.

షావుకారు జానకి 14 ఏళ్ల వయసులోనే శంకరమంచి శ్రీనివాసరావుతో వివాహం జరిగింది. చదువుకునే రోజుల్లోనే ఆమె ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో రేడియో ఆర్టిస్ట్‌గా పనిచేసేవారు. వివాహం తర్వాత ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఆ సమయంలో మూడు నెలల వయసున్న బిడ్డను ఎత్తుకుని, కుటుంబ పోషణ కోసం ఆమె సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. ప్రముఖ దివంగత నటి కృష్ణకుమారి ఈమెకు సొంత చెల్లెలు. ప్రముఖ నటి వైష్ణవి ఈమెకు మనవరాలు.
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, శివాజీ గణేశన్, ఎంజీఆర్, జెమినీ గణేశన్ వంటి మహామహుల సరసన కథానాయికగా మెప్పించారు. గ్లామర్ పాత్రల కంటే హోమ్లీ, ఎమోషనల్, బోల్డ్, బలమైన మహిళా పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. ఈ క్రమంలో ‘కన్యాశుల్కం’, ‘రోజులు మారాయి’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘మంచి మనసులు’ లాంటి చిత్ర రాజాల్లో భాగమయ్యారు. సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే రంగస్థలంపై మక్కువతో 3000కపైగా లైవ్ స్టేజ్ షోలు చేశారు. సినిమా పరిశ్రమకు అందించిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి రెండు సార్లు నంది అవార్డులు, తమిళనాడు ప్రభుత్వం నుండి కలైమామణి పురస్కారం అందుకున్నారు.











