“బిస్కెట్, వైకుంఠపాళి” చిత్రాల దర్శకుడు అనిల్ గోపిరెడ్డి తెరకెక్కించిన తాజా చిత్రం “సీత రాముని కోసం”. సెంటిమెంటల్ హారర్ ఫిలిమ్ గా రూపొందిన ఈ చిత్రంలో కారుణ్య టైటిల్ పాత్ర పోషించగా.. శరత్ కథానాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ చిత్రంలో దర్శకుడు అనిల్ గోపిరెడ్డి కూడా నటించడం విశేషం. భారీ స్థాయిలో పబ్లిసిటీ చేయబడ్డ ఈ సినిమా విశేషాలేంటో తెలుసుకొందాం.
కథ : విక్రాంత్ (శరత్) పారా సైకాలజిస్ట్, అమెరికాలో ఉండే విక్రాంత్ తన అక్క కోసం హైద్రాబాద్ లో ఓ మారుమూల కొన్న ఓ విల్లాలో ఆత్మలు సంచరిస్తున్నాయని తెలుసుకొని, ఆ ఆత్మల బాధ తెలుసుకొని వాటిని ఇంటి నుండి పంపిద్దామని ఇండియాకి వస్తాడు. ఇంట్లో రెండు ఆత్మలు ఉన్నాయని గ్రహించిన విక్రాంత్ ఆ ఇంటికి సంబంధించిన కథను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. అదే సమయంలో ఆ ఇంట్లో నివసించే ఆత్మలు కూడా విక్రాంత్ ను భయపెట్టడం లాంటివి చేయకుండా అతడికి క్లూస్ ఇస్తూ సహాయపడుతుంటాయి. అసలు ఎవరివా ఆత్మలు, ఆ ఇంట్లో ఎందుకున్నాయి, ఎవరి కోసం ఎదురుచూస్తున్నాయి, విక్రాంతి ఆ ఆత్మల బాధ తీర్చగలిగాడా? అనేది “సీత రాముని కోసం” కథాంశం.
నటీనటుల పనితీరు : ముందుగా టైటిల్ పాత్ర పోషించిన కారుణ్య చౌదరి గురించి మాట్లాడుకోవాలి. నిబద్ధత కలిగిన నేటితరం గృహిణిగా సహజమైన నటనతో ఆకట్టుకొంది. ఆమె కళ్ళతో పలికించిన హావభావాలు బాగున్నాయి. హీరో శరత్ న్యూజెర్సీలో యాక్టీంగ్ కోర్స్ చేసినా ఏమాత్రం ఉపయోగం లేకపోయింది. ఎక్స్ ప్రెషన్ కనబడనీయకుండా కళ్ళజోడు పెట్టి కవర్ చేసినా సరే కీలకమైన సన్నివేశాల్లోనూ బ్లాంక్ ఫేస్ పెట్టడంతో సన్నివేశంలోనూ ఎమోషన్ ఆడియన్స్ కి అర్ధం కాక చిరాకుపడతారు. మరో పాత్ర పోషించిన దర్శకుడు అనిల్ గోపిరెడ్డిది కూడా అదే పరిస్థితి. మాగ్జిమమ్ ట్రై చేశాడు కానీ.. తేలిపోయాడు. ఇద్దరు చిన్నారులు భయపెట్టడానికి విఫల ప్రయత్నాలు చేశారు. పాపం వారిని దెయ్యాలుగా చూపడానికి వేసిన మేకప్ మాత్రం నిజంగా భయానకంగా ఉంది.
సాంకేతికవర్గం పనితీరు : జైపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకి కాస్తంత ఫీల్ ను యాడ్ చేసినప్పటికీ.. తెరపై కనిపించే నటీనటుల్లో కారుణ్య మినహా ఎవరూ కనీస స్థాయిలో కూడా నటనతో మెప్పించలేకపోవడంతో ఆయన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. దర్శకుడు-సంగీత దర్శకుడు-కీలకపాత్రధారి అయిన అనిల్ గోపిరెడ్డి చెప్పాలనుకొన్న విషయం బాగుంది కానీ.. చెప్పిన విధానం బాలేదు. అందులోనూ ఎక్కువ క్రాఫ్త్స్ లో వర్క్ చేయడం వలన కీలకమైన దర్శకుడి పాత్రను సరిగా పోషించలేకపోయాడు. ఓపెనింగ్ సీన్స్, కెమెరా వర్క్ బాగుంది కదా “కాస్త ఇంట్రెస్టింగ్ గా సాగుతుందేమో” అని ప్రేక్షకుడు సీట్ లో కాస్త సెటిల్ అయ్యేలోపే చీప్ సీజీ వర్క్, టెక్నికల్ యాస్పెక్ట్స్ తో ఆ ఫీల్ ను పోగొట్టి “ఇంకెంత సేపు సాగదీస్తాడో” అనుకొనేలా చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా మాత్రం పర్వాలేదనిపించుకొన్నాడు.
విశ్లేషణ : కథ బాగుంది, కథనం బాలేదు. హీరోయిన్ పెర్ఫార్మెన్స్ బాగుంది, హీరో మరియు సపోర్టింగ్ ఆర్టిస్ట్స్ కు యాక్టింగ్ రాదు. పాటలు బాగున్నాయి, చిత్రీకరణ బాగోలేదు. ఓవరాల్ గా సినిమాలో మేటర్ ఉంది, మేకింగ్ బాలేదు.
రేటింగ్ : 1.5/5