సమాజాన్ని బాగా చదివేవారు… సినిమాలు బాగా తీస్తారని అంటారు. అలాంటి సినిమాల్లో పాత్రల్లో జీవం తొణికిసలాడుతుంది అని చెబుతుంటారు. అలాంటి సినిమాలు తీసిన దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో ఇలా లైవ్లీనెస్ కనిపిస్తూ ఉంది. తాజాగా ‘లవ్‌స్టోరీ’ సినిమాలోనూ అదే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఆయనకు కథల పాయింట్‌ల దొరుకుతాయో ఆయన మాటల్లోనే… శేఖర్ కమ్ము పుస్తకాలు బాగా చదువుతారని మనకు తెలిసిన విషయమే.
ఆ పుస్తకాలు చదివేటప్పుడు అందులోని కథల్ని బాగా ఆస్వాదిస్తారట. అయితే వాటి నుండి మరో కథ రాయాలని అనుకోరట. ఆయన సినిమాల కథలు, అందులోని భావోద్వేగాలు అన్నీ సమాజం నుండి తీసుకున్నవేనట. తన చుట్టూ జరిగే పరిణామాలు, ఉన్న మనుషుల్ని చూసే రాసుకుంటారట. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు మైమరచిపోయి తెరపై పాత్రలతో ప్రయాణం చేయాలి అనేది ఆయన ఆలోచనట. ఇటీవలకాలంలో తెలుగు భాషలోని యాసలను తెలుగు సినిమాలో చక్కగా చూపిస్తున్నారు.
జానపదాలు వినిపిస్తూ, మన మట్టి కథలను ప్రజలకు అందిస్తున్నారు. నిజానికి ఇదెప్పుడో జరగాల్సిన ప్రక్రియ. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదోడు, రైతులు ఇలా రకరకాల జీవితాల్ని వాస్తవానికి దగ్గరగా ఆవిష్కరించే కథలు మరిన్ని రావాలి. నాకు తెలంగాణ యాసపై పట్టుంది. అందుకే నా చిత్రాల్లో తెలంగాణ యాస గుబాళిస్తుంటుంది.