సెల్ఫీరాజా

  • July 15, 2016 / 09:59 AM IST

గత కొంతకాలం నుండి అల్లరి నరేష్ కు సరైన హిట్టు సినిమా పడలేదు. సొంత బ్యానర్ లో నిర్మించిన ‘బందిపోటు’ సినిమా కూడా బెడిసి కొట్టింది. దీంతో కొన్ని రోజులు సైలెంట్ అయిపోయాడు ఈ సడెన్ స్టార్. ఈశ్వర్ రెడ్డి చెప్పిన కథ నచ్చడంతో ‘సెల్ఫీరాజా’ అవతారమెత్తాడు. మరి ఈ సెల్ఫీరాజా అల్లరి నరేష్ హిట్ ఇచ్చిందో లేదో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ : రాజా(నరేష్) చిన్నప్పుడే తల్లి తండ్రులు చనిపోవడంతో పిన్ని, బాబాయ్ ల వద్ద పెరుగుతాడు. రాజాకు సెల్ఫీస్ తీసుకునే అలవాటు ఉంది. ఎంతలా అంటే తను తీసుకునే సెల్ఫీలతో పక్కవాళ్ళను ఇబ్బంది పెట్టేంతలా. ఒకరోజు శ్వేతా(కామ్నా రణావత్)అనే అమ్మాయిని చూసి మొదటిచూపులోనే ప్రేమలో పడతాడు రాజా. శ్వేతా కూడా రాజాను ఇష్టపడుతుంది. శ్వేతా తండ్రి సిటీ పోలీస్ కమీషనర్. ఇరు కుటుంబ సభ్యులు వీరి ప్రేమను అంగీకరించి ఇద్దరికి పెళ్లి చేస్తారు. అయితే పెళ్ళైన రోజే శ్వేతా ఒక విషయానికి బాధ పడి రాజాను వదిలివెళ్లిపోతుంది. దీంతో రాజా చనిపోవాలని చాలా ప్రయత్నాలు చేస్తాడు. చివరగా కాకి(రవిబాబు) అనే వాడితో తనను చంపమని డీల్ కుదుర్చుకుంటాడు. ఇంకొంతమంది రాజాను చంపడానికి తిరుగుతూ ఉంటారు. రాజా తన నిర్ణయం మార్చుకొని శ్వేతా ప్రేమను గెలిపించుకున్నాడా..? రాజాను చంపడానికి ప్రయత్నిస్తున్న వారెవరు..? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..!

నటీనటుల పనితీరు : సెల్ఫీరాజా గా అల్లరి నరేష్ తన పాత్రకు న్యాయం చేసాడు. అయితే ఈ తరహా పాత్రల్లో నరేష్ ను ఇప్పటికే చాలా సినిమాల్లో చూసేసాం. దీంతో ఆ పాత్రలో ఎలాంటి కొత్తదనం కనిపించదు. అలానే భీమ్స్ అనే మరో పాత్రలో అల్లరి నరేష్ స్క్రీన్ పై డ్యూయల్ రోల్ లో కనిపించడం విశేషం. అయితే ఆ పాత్రలో ఎలాంటి కొత్తదనం కనిపించదు. శ్వేతా పాత్రలో కనిపించిన కామ్నాకు మొదటి సినిమా అయినా… ఒకే అనిపించింది. సాక్షి చౌదరి కేవలం రెండు పాటలకు, రెండు సీన్లకు పరిమితమయింది. అంకుశం అనే పోలీస్ పాత్రలో పృద్వీ అక్కడక్కడా ప్రేక్షకులను నవ్విస్తాడు. అలానే నరేష్ ను ఎప్పుడు చిక్కులో పడేసే సప్తగిరి ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. ఇంతకు మించి ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఎన్ని పాత్రలు ఉన్నా.. రొటీన్ గానే కనిపిస్తాయి.

సాంకేతికవర్గం పనితీరు : ఈశ్వర్ రెడ్డి అనుకున్న కథను చక్కగా ప్రెజంట్ చేయలేకపోయాడు. సింపుల్ కథను తీసుకొని దానికి కామెడీను జోడించి సినిమా తీసేసారు. కథనంతో కూడా క్యూరియాసిటీ కలగదు. సాయి కార్తిక్ మ్యూజిక్ వినడానికి నీచంగా ఉంది. తను ఎన్ని హిట్ సినిమాలకు మ్యూజిక్ చేసిన ఈ ఒక్క సినిమాతో మొత్తం పేరు పోగొట్టుకుంటాడు. ఫొటోగ్రఫీలో కూడా క్వాలిటీ లేదు. ఎడిటింగ్ కూడా సో.. సో.. గా ఉంటుంది. నిర్మాణ విలువలు ఏవరేజ్ గా ఉన్నాయి.

విశ్లేషణ : ఏ సినిమా అయినా.. చేయడానికి ముందుగా కావాల్సింది కథ. దానికి తగ్గ కథనం. అవి రెండు ఉంటే.. మిగిలిన ఏ విషయాలను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. దురదృష్టవశాత్తు ఈ సినిమాకు ఆ రెండూ లేవు. దీనికి తోడు నాసిరకం సంగీతం, ఫొటోగ్రఫీ తోడైంది. సినిమా ఫ్లాప్ కావడానికి ఇంతకు మించి కావాల్సింది ఏముంటుంది. అల్లరి నరేష్ లాంటి హీరోతో చేయాల్సిన కథ కాదు. ఈ తరహా కామెడీను, నటనను చాలా సినిమాల్లో చూసేసాం. ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విధంగా సినిమా ఉండాలని కానీ.. థియేటర్ నుండి ఎప్పుడు వెళ్ళిపోతామా అనిపించకూడదు. పిచ్చి కామెడీ, ఎక్స్పోజింగ్ సీన్స్, సందర్భం లేని పాటలు ఉంటే ప్రేక్షకులు సినిమాను చూడట్లేదు. పెద్ద హీరోలు సైతం కంటెంట్ ను నమ్మి సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కథ లేకుండా వచ్చిన స్టార్ హీరోల సినిమాలు సైతం బాక్సాఫిస్ వద్ద బోల్తా పడ్డాయి. ఈ నేపథ్యంలో ‘సెల్ఫీరాజా’ వంటి నాసిరకం సినిమాను ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో.. చూడాలి..!

రేటింగ్ : 1/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus