దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. అయితే దాని తర్వాతి మాటను ఎప్పుడూ, ఎవరూ చెప్పలేదు. అయితే సినిమా వాళ్ల జీవితాల్ని తిరగేస్తే ఆ ఇంకో మాట మనమే చెప్పొచ్చు. అదేంటంటే… ‘చక్కబెట్టుకున్న ఇంటిని ఎవరికీ నమ్మి ఇవ్వొద్దు.. మోసపోవద్దు’. చాలామంది సినిమా తారల జీవితాల్లో ఈ ఘటన చాలాసార్లు జరిగింది. తాజాగా సీనియర్ నటి జయలలిత జీవితంలోనూ ఇదే జరిగిందట. కథానాయికగా జీవితం ప్రారంభించి… అన్ని రకాల పాత్రలూ చేశారు జయలలిత.
టాలీవుడ్‌లో ఆమె కోసం కొన్ని రకాల పాత్రలు రాసిపెట్టేవారు అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ క్రమంలో ఆమె బాగానే పారితోషికం పొందేవారు. అలా ఆర్థికంగా మంచి స్థితిలోకే వచ్చారు. కానీ కొంతమందిని నమ్మడం వల్ల ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. చాలా తక్కువ మందికి తెలిసిన ఈ విషయాన్ని జయలలిత ఇటీవల ఓ టీవీ షోలో వెల్లడించారు. తెలిసిన వ్యక్తులు అని నమ్మి కొంతమందికి జయలలిత అప్పుగా డబ్బులు ఇచ్చేవారట. అలా ఇచ్చి, తీసుకునే క్రమంలో ఆ వ్యక్తికి సుమారు నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చారట.
ఆ డబ్బులతో అతను ఉడాయించేశాడట. దీంతో కాస్ట్‌లీ కార్లలో తిరిగే జయలలిత ఇప్పుడు క్యాబ్‌ల్లో తిరిగే పరిస్థితి వచ్చిందట. ఈ వ్యవహారంలో ఆమె ఇంకా చాలా విషయాలు చెప్పారు. త్వరలో అవీ బయటకు వస్తాయి. ఈలోగా డబ్బులు, సంపాదన, ఆస్తుల విషయంలో సినిమావాళ్లు ఎంత జాగ్రత్తగా ఉండాలో జయలలితను చూసి అర్థం చేసుకోవాలి. అన్నట్లు ఈ సూత్రం అందరికీ వర్తిస్తుంది అనుకోండి.