సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.ఈ మధ్య కాలంలో మీనా భర్త విద్యాసాగర్ పోస్ట్ కోవిడ్ సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే. నిన్న ఆర్.నారాయణ మూర్తి తల్లి మరణించిన సంగతి తెలిసిందే. ఆ షాక్ నుండీ ఇంకా తెలుకోకముందే సీనియర్ ఎడిటర్ గౌతంరాజు కూడా మరణించారు.ఆయన వయసు 68 సంవత్సరాలు. గత కొద్దరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఆయన హాస్పిటల్ లో చికిత్స పొందుతూ వస్తున్నారు.
మంగళవారం నాడు ఆయన హాస్పిటల్ నుండీ డిశ్చార్జ్ అయ్యారు.. కానీ పరిస్థితి విషమించడంతో.. కోలుకోలేక ఆయన అర్థరాత్రి తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. గౌతంరాజు దాదాపు 40 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నారు. 800 కి పైగా సినిమాలకి ఎడిటర్ గా పనిచేశారు.పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, అల్లు అర్జున్ రేసు గుర్రం, చిరంజీవి ఖైదీ నంబర్ 150, రవితేజ కిక్, కృష్ణ వంటి సూపర్ హిట్ చిత్రాలకి ఈయన పని చేశారు. గౌతంరాజు గారి పార్ధీవదేహం ప్రస్తుతం మోతీనగర్ లో ఆయన నివాసంలో ఉంది.
మధ్యాన్నం 3 గంటలకు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సినీ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుని..ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.