ఓ సినిమాకి ప్రమోషన్స్ చాలా ముఖ్యం. ముఖ్యంగా చిన్న సినిమాలకి ప్రమోషన్స్ లేకపోతే… అది వస్తుందని జనాలకి తెలీకపోతే.. థియేటర్లకు జనాలు రారు కదా.! అసలే ఈ మధ్య థియేటర్లకు జనాలు రాకపోవడం అనేది బయ్యర్స్ ను, దర్శక నిర్మాతలను తీవ్రంగా బాధిస్తోంది. అందుకే మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో మాత్రం మేకర్స్ రాజీపడటం లేదు.
లక్షలు పోసి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి రెడీగానే ఉంటున్నారు. కాకపోతే వాళ్ళకి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే.. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ ను తీసుకురావడం. పెద్ద బ్యానర్లలో అంటే ‘గీతా ఆర్ట్స్’ ‘మైత్రి’ ‘పీపుల్ మీడియా’ ‘సితార..’ ‘షైన్ స్క్రీన్స్’ వంటి బ్యానర్లలో రూపొందే సినిమాలకి స్టార్ హీరోలు, దర్శకులు ఏదో ఒక రకంగా హాజరయ్యి టీంకి బెస్ట్ విషెస్ చెబుతారు.
కానీ మిగతా బ్యానర్లలో రూపొందే చిన్న సినిమాల ఈవెంట్లకి ఎవరు వస్తారు?ఈ మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్లకి స్టార్స్ కొరత కూడా ఏర్పడింది.దీంతో బండ్ల గణేష్, బి.వి.ఎస్ రవి వంటి సీనియర్ రైటర్లను కూడా రంగంలోకి దింపుతున్నారు.’జాక్’ ‘కన్నప్ప’ సినిమా ప్రమోషన్స్ నుండి బి.వి.ఎస్.రవి ఎక్కువ ఈవెంట్లకి హాజరవుతున్నాడు. వాస్తవానికి ఇతను స్టార్ కాదు. దర్శకుడిగా చేసిన సినిమాలు ఆడలేదు.
రైటర్ గా పేరుపడ్డ సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. విచిత్రంగా ఇతను పనిచేసిన.. పేరు పడని సినిమాలు హిట్ అయ్యాయి. అంటే.. ఘోస్ట్ రైటింగ్ చేసిన సినిమాలు అనుకోవాలి. ఉదాహరణకి ‘మనం’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకి ఐడియా ఇచ్చింది బి.వి.ఎస్ రవి అని చాలా మందికి తెలీదు. అయితే ఇతన్ని ఈ మధ్య వరుసగా ప్రీ రిలీజ్ లేదా సక్సెస్ మీట్లకి గెస్ట్ గా పిలుస్తున్నారు.
‘మిరాయ్’ వంటి సక్సెస్ మీట్లకి కూడా హాజరయ్యాడు. కానీ ‘బి.వి.ఎస్ రవి గెస్ట్ గా వచ్చి స్పీచ్..లు ఇవ్వడం వల్ల సినిమాలకి కలిసొచ్చేది ఏముంటుంది?’ అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.గతంలో ఫేడౌట్ అయిపోయినప్పటికీ దాసరి నారాయణరావు వంటి దర్శకులను ఈవెంట్లకి అతిథిలుగా ఆహ్వానించేవారు. ఇప్పుడు ఏమీ ఆప్షన్ లేక బి.వి.ఎస్ రవిని పిలుస్తున్నారు అనుకోవాలేమో.