సెవెన్

  • June 6, 2019 / 10:01 AM IST

“భలే భలే మగాడివోయ్, నేను లోకల్” చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసిన నిజార్ షఫీ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రం “సెవెన్”. హావీష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో ఏకంగా 6 మంది హీరోయిన్లు నటించడం విశేషం. థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి దర్శకుడు రమేష్ వర్మ కథ-సంభాషణలు అందించారు. 2011లో “నువ్విలా”తో హీరోగా పరిచయమైన హావీష్ అప్పట్నుంచి ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. మరి “సెవెన్”తో ఆ హిట్ దొరికిందా లేదా అనేది తెలుసుకొందాం..!!

కథ: రమ్య (నందిత శ్వేత) తన భర్త కార్తీక్ (హావీష్) గత రెండ్రోజులుగా కనిపించడం లేదని కంప్లైంట్ ఇవ్వడం కోసం పోలీస్ స్టేషన్ కి వస్తుంది. అక్కడ కమిషనర్ విజయ్ ప్రకాష్ (రహమాన్)కు తన భర్త గురించిన వివరాలు చెబుతుండగా.. అదే తరహాలో జెన్నీ (అనీషా ఆంబ్రోస్), అభినయ (అదితి ఆర్య) విషయంలోనూ జరిగిందని, కార్తీక్ అనేవాడు పైకి కనిపించినంత అమాయకుడు కాదని, పెద్ద మోసగాడని రమ్యకి వివరిస్తాడు విజయ్ ప్రకాష్.

కానీ.. రమ్య, జెన్నీ, అభినయలను ప్రేమించి వాళ్ళ జీవితాలను నానా ఇబ్బందులు పెట్టిన కార్తీక్ కి, పోలీసుల చేత అరెస్ట్ కాబడిన కార్తీక్ ఎలాంటి సంబంధం లేదని తెలుసుకొంటాడు విజయ్ ప్రకాష్.

అసలు కార్తీక్ ఎవరు? అతడి చుట్టూ అల్లుకున్న ఈ చదరంగం నుండి ఎలా బయటపడ్డాడు? అనేది “సెవెన్” కథాంశం.

నటీనటుల పనితీరు: రెజీనా క్యారెక్టర్, ఆమె నటన సినిమా సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. ఆమె చూపిన వేరియేషన్స్ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరచడం ఖాయం. కానీ.. ఆ క్యారెక్టరైజేషన్ విషయంలో ఇంకాస్త క్లారిటీ ఉండి ఉంటే జనాలు ఆ పాత్రకి ఇంకా బాగా కనెక్ట్ అయ్యేవారు.

అనీషా ఆంబ్రోస్ అందాలు సినిమాకి గ్లామర్ ను యాడ్ చేశాయి. నటన పరంగానూ ఆమె ఆకట్టుకొంది. నందిత శ్వేత, త్రిధ చౌదరి, అదితి ఆర్య, పూజిత పొన్నాడలు తక్కువ సన్నివేశాలకు పరిమితమైనా వారి పాత్రల వల్ల సినిమాలో మంచి టెన్షన్ క్రియేట్ అయ్యింది.

ఇక హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి 8 ఏళ్ళు పూర్తవుతున్నా కూడా హావీష్ నటనలో “ఎబిసిడి”ల దగ్గరే ఆగిపోయాడు. ఈ సినిమాలో హావీష్ మూడు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు. ఆహార్యం విషయంలో కనిపించిన వైవిధ్యం వ్యవహార శైలిలో కొరవడింది. కనీసం డబ్బింగ్ అయినా వేరే వాళ్ళతో చెప్పించి ఉంటే క్యారెక్టర్ కి కావాల్సిన ఇంపాక్ట్ కుదిరి ఉండేది. అవేమీ లేకపోవడంతో కథలో చాలా కీలకమైన హావీష్ పాత్ర చాలా నార్మల్ గా కనిపిస్తుంటుంది.

సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రాఫర్ టర్నడ్ డైరెక్టర్ నిజార్ షఫీ కథను అర్ధం చేసుకొన్న విధానం బాగోలేదో లేక అర్ధం కాలేదో తెలియదు కానీ.. ఒక అద్భుతమైన థ్రిల్లర్ ను చాలా సాదాసీదాగా తెరకెక్కించాడు. ఒక దర్శకుడిగా నిజార్ ఫెయిల్ అయ్యాడు కానీ.. ఒక సినిమాటోగ్రాఫర్ గా మాత్రం మంచి మార్కులే సంపాదించుకొన్నాడు. ఒక మల్టీ లేయర్ స్టోరీకి చాలా కీలకమైన అంశం ఆసక్తికరంగా సాగే స్క్రీన్ ప్లే, ఆకట్టుకొనే క్యారెక్టర్స్. ఈ రెండు సెవెన్ సినిమాలో మిస్ అయ్యాయి.

దర్శకుడు రమేష్ వర్మ ఈ చిత్రానికి అందించిన స్క్రిప్ట్ కథగా చెప్పుకోవడానికి నిజంగానే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కానీ.. సినిమాగా తెరకెక్కించెప్పుడు చాలా జాగ్రత్తలు అవసరం. కథ రాసుకున్నప్పుడు చూపిన శ్రద్ద.. కథనంలో లోపిస్తుంది. అందువల్ల సినిమాలో ఏదో మ్యాటర్ ఉంది అని ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలోపే వార్నీ ఇంతేనా అని అనుకొనేలా చేస్తుంది.

విశ్లేషణ: ఏదో ఆరుగురు హీరోయిన్లున్నారు, విడుదలైన రెండు పాటలు మంచి రోమాంటిక్ గా ఉన్నాయి, ట్రైలర్ కూడా కాస్త ఆసక్తికరంగానే ఉంది కదా అని ఏదో ఊహించి థియేటర్ కి వెళ్తే మాత్రం దారుణంగా మీ అంచనాలు తలక్రిందులు అవ్వడమే కాదు.. థియేటర్లో నీరసించి నిశ్చేష్టులవ్వడం ఖాయం. సో.. రెజీనా, అనీషా, నందిత శ్వేత, పూజిత పొన్నాడల మీద విశేషమైన అభిమానం, ఆప్యాయతలతోపాటు సహనం కూడా ఉంటేనే “సెవెన్” సినిమాని చివరి వరకూ చూడగలరు.

రేటింగ్: 1.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus