బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ స్టార్ దర్శకుడు అట్లీతో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు ఎప్పుడో అధికారిక ప్రకటన వచ్చింది. కానీ అనేక కారణాల వల్ల ఈ ప్రాజెక్టు డిలే అవుతూ వచ్చింది. మొత్తానికి ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. తాజాగా టైటిల్ ను రివీల్ చేస్తూ ఓ చిన్న వీడియో గ్లింప్స్ ను కూడా విడుదల చేశారు. ‘జవాన్’ అనే టైటిల్ ను ఈ చిత్రానికి ఫిక్స్ చేసినట్టు ప్రకటించారు.’రాజా రాణి’, ‘తేరి’, ‘మెర్సల్’ ‘బిగిల్’ వంటి వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న అట్లీ ఈ చిత్రంతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతుండడం విశేషం.
ఇక ‘రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్ పై గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ‘జవాన్’ హిందీతో పాటు తమిళ, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో 2023 వ సంవత్సరంలో జూన్ 2న విడుదల కాబోతోంది. ఇక ఈ టైటిల్ గ్లింప్స్ విషయానికి వస్తే గాయపడిన సింహంలా షారుఖ్ ఖాన్ ఒక ఇంట్లో మొహం నిండా కట్లు కట్టుకుని… ఆయుధాలతో కనిపిస్తున్నాడు.
ఈ వీడియోలో చాలా మాస్ అప్పీల్ ఉంది. కాకపోతే చూడ్డానికి ఇది కమల్ హాసన్- లోకేష్ కనగరాజన్ ల ‘విక్రమ్’ ఫస్ట్ టీజర్ లా ఉంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఆ వీడియోలో కూడా కమల్ హాసన్ ఒక ఇంట్లో ఆయుధాలు సెట్ చేసుకుంటూ ఉంటాడు. అయితే అక్కడ కమల్ వంట కూడా చేస్తుంటాడు.
అయితే ఈ రెండు చిత్రాలకి అనిరుధ్ సంగీత దర్శకుడు కావడంతో ఈ సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి అనుకోవాలి. ఇక 2013లో వచ్చిన ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ తర్వాత షారుఖ్ ఖాన్ హిట్టు మొహం చూడలేదు. మరి ఈ చిత్రంతో అయినా ఓ బ్లాక్ బస్టర్ అందుకుంటాడేమో చూడాలి..!