ఆర్యభట్ట, శ్రీనివాస రామానుజన్ ల తర్వాత మ్యాథ్స్ లో భారతదేశ ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పిన ఘనతను దక్కించుకున్న ఏకైక మహిళ శకుంతలా దేవి. హ్యూమన్ కంప్యూటర్ గా పేర్కొనే ఆమె జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమే “శకుంతలా దేవి”. అమేజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ: బెంగుళూరు దగ్గరలోని ఓ గ్రామంలో జన్మించిన రెండో అమ్మాయి శకుంతలా దేవి (విద్యాబాలన్). స్కూల్ కి వెళ్లకపోయినా అయిదేళ్ళ వయసు నుంచే లెక్కల మీద అద్భుతమైన పట్టు ఉన్న ప్రతిభాశాలి ఈ చిన్నారి. మ్యాథ్స్ లో ఆమె ప్రతిభను గమనించిన ఆ తండ్రి ఆమెతో పలు స్కూల్స్ లో మ్యాథ్స్ షోలు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. బెంగుళూరు నుంచి లండన్ దాకా వ్యాప్తిచెందుతుంది శకుంతలా దేవి పాపులారిటీ.
స్వతహా ఇండిపెండెంట్ ఉమెన్ అయిన శకుంతలా దేవి పెళ్లి చేసుకోకుండానే తాను ఇష్టపడిన ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ (జీషు సేన్ గుప్తా)ను పెళ్లాడకుండానే అను (సాన్యా మల్హోత్రా)కు జన్మనిచ్చి.. ఎప్పట్లానే తన మ్యాధ్స్ షోస్ చేసుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. అయితే.. శకుంతలాదేవి లైఫ్ స్టైల్ తో సింక్ అవ్వలేకపోతుంది ఆమె కూతురు అను. ఈ తల్లీకూతుళ్ల మధ్య ఈగో ఇష్యూస్ ఎక్కడిదాకా సాగాయ్ అనేది సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు: శకుంతలా దేవిగా విద్యాబాలన్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. ఆమె వాచకం, బాడీ లాంగ్వేజ్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటాయి. కూతురు పాత్రలో “దంగల్” ఫేమ్ సాన్య మల్హోత్రా, అల్లుడిగా అమిత్ సాద్, భర్తగా జీషు సేన్ గుప్తా క్యారెక్టర్స్ ను న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రఫీ, సంగీతం చెప్పుకొనే స్థాయిలో లేవు. సినిమాలోని సన్నివేశాలు దేశవిదేశాల్లోవి అయినప్పటికీ.. చీప్ ప్రొడక్షన్ డిజైన్ కారణంగా అవన్నీ స్టూడియోల్లోనే తీసినట్లుగా తెలిసిపోతుంటుంది.
ఇక “వెయిటింగ్” లాంటి స్వచ్చమైన సినిమాతో ప్రేక్షకుల్ని అలరించిన అను మీనన్ “శకుంతలా దేవి” చిత్రానికి దర్శకత్వం వహిస్తోంది, శకుంతలా దేవిగా విద్యాబాలన్ నటిస్తోంది అని తెలిసేసరికి ఈ ఇద్దరి కలయికలో అద్భుతమైన ఎమోషనల్ ఎంటర్ టైనర్ ఎక్స్ పెక్ట్ చేశాను. అయితే.. శకుంతలా దేవి జీవితాన్ని సరికొత్త కోణంలో పరిచయం చేసే కంగారులో ఆమె లైఫ్ లో కీలకమైన మెథమెటిక్స్ ను పక్కనపెట్టేసింది అను మీనన్. ఎమోషనల్ కనెక్టివిటీ కోసం సెన్సిబిలిటీస్ ను వదిలేసినట్లుగా అనిపిస్తుంది. శకుంతలా దేవి బిహేవియర్ ను ఆడియన్స్ ను పూర్తిస్థాయిలో అర్ధమయ్యేలా ఎలివేట్ చేయలేదు. ఆ కారణంగా ఆమె పాత్రలో ఉన్న డైనమిజం.. సినిమాలో కనిపించదు.
విశ్లేషణ: ఒక సినిమాలో జీవం కనిపించినప్పుడే అది ప్రేక్షకుల మనసుల్ని ఆకట్టుకోగలుగుతుంది, అలాగే.. ఒక బయోపిక్ లో జీవితం, జీవితం యొక్క లోతు కనిపించాలి. మహానటి హిట్ అవ్వడానికి, ఎన్టీఆర్ ఫ్లాప్ అవ్వడానికి రీజన్ అదే. ఇప్పుడు శకుంతలా దేవి చిత్రంలోనూ జీవం కానీ జీవితం కానీ కనిపించదు. పైగా.. సన్నివేశాల అల్లికకు కూడా ఒక లయ ఉండదు. ఆ కారణంగా స్పూర్తినివ్వాల్సిన “శకుంతలా దేవి” కేవలం ఒక ఎంటర్ టైనర్ గా మిగిలిపోయింది. భారతదేశ జెండాను ప్రపంచవ్యాప్తంగా రెపరెపలాడించిన శకుంతలా దేవికి ఈ సరైన సినీ నివాళి మాత్రం కాదు.
రేటింగ్: 2.5/5
ప్లాట్ ఫార్మ్: అమేజాన్ ప్రైమ్