“A: AD Infinitum” సినిమాతో దర్శకుడిగా తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న యుగంధర్ ముని తెరకెక్కించిన రెండో చిత్రం “శంబాల”. ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి “శంబాల”తో ఆది సాయికుమార్ హిట్టు కొట్టగలిగాడా? లేదా? అనేది చూద్దాం..!!
కథ: శంబాల అనే గ్రామంలో అర్ధరాత్రి వచ్చిపడిన ఉల్క కారణంగా ఊర్లో ఏవేవో జరుగుతూ ఉంటాయి. ఆ ఉల్కను పరీక్షించడానికి సెంట్రల్ గవర్నమెంట్ విక్రమ్ (ఆది సాయికుమార్)ను పంపిస్తుంది.
సైంటిస్ట్ అయిన విక్రమ్ ఈ మిస్టికల్ మిస్టరీని ఎలా ఛేదించాడు? ఈ క్రమంలో అతడు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? అసలు ఊరి ప్రజల్ని పట్టి పీడిస్తున్నది ఏమిటి? దాన్ని ఆది ఎలా ఎదుర్కొన్నాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “శంబాల” చిత్రం.
నటీనటుల పనితీరు: 2017లో వచ్చిన “నెక్స్ట్ నువ్వే” తర్వాత హీరోగా ఆది కమర్షియల్ హిట్ అందుకోలేకపోవడమే కాక, నటుడిగానూ మెప్పించలేకపోయాడు. ఒకానొక సందర్భంలో ఆది అర్జెంటుగా బ్రేక్ తీసుకుంటే బెటర్ అనిపించింది. ఆ కామెంట్స్ & క్రిటిసిజంను సీరియస్ గా తీసుకొని ఆది సాయికుమార్ నటుడిగా “శంబాల” చిత్రంలో మెప్పించాడు. క్యారెక్టరైజేషన్ లో చిన్నపాటి లోపాలున్నప్పటికీ.. నటుడిగా చాలా స్థిరంగా కనిపించాడు. ఎమోషన్స్ ను బాగా పలికించాడు.
రవివర్మను కొత్తగా చూపించారు. అతను కూడా చాలారోజుల తర్వాత దొరికిన మంచి పాత్ర కావడంతో తన 100% ఇచ్చాడు. మీసాల లక్ష్మణ్ కూడా మంచి నటనతో అలరించాడు. మలయాళ నటి శ్వాసిక విజయ్ పాత్ర ద్వారా పండించిన ఎమోషన్ బాగున్నప్పటికీ.. ఆమె యద సంపదను పదే పదే బహిర్గతపరుస్తూ పెట్టిన క్లోజ్ ఫ్రేములు ఎబ్బెట్టుగా ఉన్నాయి. సినిమాలో ఉన్న కంటెంట్ కి ఆ నావెల్ షాట్స్ అనవసరం అనిపించింది.
ఇంద్రనీల్, అన్నపూర్ణమ్మ, మధునందన్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఇక హీరోయిన్ అర్చన అయ్యర్.. ఆమె పాత్ర ప్రెడిక్టబుల్ గా ఉండడం అనే మైనస్ ను పక్కన పెడితే, స్క్రీన్ ప్రెజన్స్ తో మాత్రం ఆకట్టుకుంది. ఆమె పాత్ర సినిమాకి కీలకం అవ్వడం, దానికంటూ ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండడం ఆమెను బాగా ఎలివేట్ చేశాయి.
సాంకేతికవర్గం పనితీరు: శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం ఈ సినిమాకి ఆయువుపట్టు. సినిమాకి కీలకమైన ఎమోషన్స్ ను, యాక్షన్ బ్లాక్ ను ఎలివేట్ చేసిన విధానం బాగుంది. సౌండ్ డిజైన్ & మిక్సింగ్ క్వాలిటీ కూడా బాగున్నాయి.
ప్రవీణ్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ముఖ్యంగా కలరింగ్ విషయంలో తీసుకున్న కేర్ ను మెచ్చుకోవాలి. ఆర్ట్ డిపార్ట్మెంట్ తమ బెస్ట్ ఇచ్చారు కానీ.. లొకేషన్స్ రిపీటెడ్ గా ఉండడం అనేది చిన్నపాటి మైనస్.
టెక్నికల్ గా ఇన్ని అంశాలు బాగున్నప్పటికీ.. గ్రాఫిక్స్ అవుట్ పుట్ చీప్ గా ఉండడం అనేది సినిమా అవుట్ పుట్ ని ఎఫెక్ట్ చేసింది. అది కూడా కీలకమైన సన్నివేశాలకు ఆ గ్రాఫిక్స్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. అది సరిపోదన్నట్లు దాదాపు ఆరేడు నిమిషాల మైథాలజీ సీన్స్ ను AI ద్వారా చేయడం అనేది విజువల్ గా మంచి ఎక్స్ పీరియన్స్ ఇవ్వలేకపోయింది. అప్పటికే స్కెచ్ ఫార్మాట్ లో చూపించినప్పటికీ.. సీజీ అయితే ఇంపాక్ట్ ఇంకా బాగుండేది.
దర్శకుడు యుగంధర్ ముని షాట్ కంపోజిషన్ బాగుంటుంది. మొదటి సినిమా విషయంలోనే అది ప్రూవ్ చేసుకున్నాడు. “శంబాల” విషయంలోనూ అతని మార్క్ ఎస్టాబ్లిష్మెంట్ కనిపిస్తుంది. అయితే.. లాజికల్ గా కన్విన్స్ చేయడంలో మాత్రం కాస్త తడబడ్డాడు. అలాగే.. ఫస్టాఫ్ లో ఎస్టాబ్లిష్మెంట్ కోసం మరీ ఎక్కువ టైమ్ తీసుకున్నాడు. సందర్భాలు ఇంకొన్ని ఉండాల్సింది. ఆ టెంట్ చుట్టే ఎక్కువ సీన్స్ ఉన్నాయి. అలాగే.. బ్యాక్ స్టోరీ అనేది ఇంకాస్త ఆసక్తికరంగా చూపించొచ్చు. కానీ.. అదేమో సింపుల్ గా చుట్టేశారు. అలాగే.. క్లైమాక్స్ లో కీలకమైన అంశానికి సరైన జస్టిఫికేషన్ లేకుండాపోయింది. ఈ విషయాల్లో కేర్ తీసుకొని ఉంటే “శంబాల” ఇంకాస్త పెద్ద హిట్ అయ్యేది. అయినప్పటికీ.. కాస్త తడబడినా తన రెండో సినిమాతోనూ దర్శకుడిగా తన సత్తాను ఘనంగానే చాటుకున్నాడు యుగంధర్ ముని.
విశ్లేషణ: మ్యాజిక్ ఉంటే లాజిక్ ఉండదు.. లాజిక్ ఉంటే మ్యాజిక్ ఉండదు. కానీ.. సైన్స్ కి లాజిక్ తప్పనిసరి. అసలు సైన్స్ తో పని లేదు అనుకుంటే.. ఎలాగైనా కథని నడిపించవచ్చు. ఈ సైన్స్ & శాస్త్రం మధ్య బ్యాలెన్స్ విషయంలో చిన్నపాటి హల్ చల్ అయ్యింది కానీ.. “శంబాల” ఒక మిస్టికల్ థ్రిల్లర్ గా కచ్చితంగా అలరిస్తుంది. గత కొన్నేళ్లుగా ఆది సాయికుమార్ నుండి వచ్చిన సినిమాలన్నిటికంటే “శంబాల” చాలా బెటర్ ప్రాజెక్ట్. శ్రీచరణ్ పాకాల బ్యాగ్రౌండ్ స్కోర్, ఆది సాయికుమార్ సిన్సియర్ ఎఫర్ట్స్, యుగంధర్ ముని స్క్రీన్ ప్లే కోసం ఈ చిత్రాన్ని థియేటర్లో చూడాల్సిందే.
ఫోకస్ పాయింట్: కొట్టాడండీ సాయికుమార్ కొడుకు మంచి హిట్టు!
రేటింగ్: 3/5