సినిమా హిట్ అయితే రివ్యూలకు, రివ్యూ రైటర్లకు థ్యాంక్స్ చెప్పే హీరోలు ఎంతమందో తెలియదు కానీ.. పొరపాటున సినిమా ఫ్లాప్ అయ్యింది అంటే మాత్రం రివ్యూల మీద సదరు రివ్యూలు రాసిన రైటర్ల మీద విరుచుకుపడిపోతుంటారు హీరోలు మరియు దర్శకులు. నిజానికి రివ్యూల వల్ల సినిమాలు హిట్ అయ్యే అవకాశం ఉంది కానీ.. ఫ్లాప్ అయ్యే ఛాన్స్ మాత్రం అస్సలు లేదు. ఈ విషయాన్ని మన హీరోలు, దర్శకనిర్మాతలు ఎందుకు గ్రహించరు అనేది విశ్లేషకులకు అర్ధం కానీ విషయం.
అయితే.. ఇటీవల “రణరంగం” చిత్రానికి వచ్చిన రివ్యూలకు కూడా శర్వానంద్ అందరిలాగే నెగిటివ్ గా రెస్పాండ్ అవుతాడు అనుకున్నారు జనాలు. కానీ.. శర్వానంద్ చాలా మెచ్యూర్డ్ గా వ్యవహరించిన విధానం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. “రణరంగం సినిమాలో కథ లేదు అనే విషయం మాకు ఎప్పుడో తెలుసు.. ఇది స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా. రివ్యూ రైటర్స్ కరెక్ట్ గానే రాశారు. కాస్త జాలి చూపించి ఉంటే సినిమా కలెక్షన్స్ బాగుండేవి. రివ్యూల నుంచి ఎప్పుడో ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాను. ఇకపై కూడా అదే చేస్తాను” అని శర్వానంద్ రివ్యూల గురించి స్పందించిన విధానం చాలా మెచ్యూర్డ్ గా ఉంది. ఇలాగే ముందుకు సాగితే.. శర్వా స్టార్ హీరోగా ఎదగడానికి పెద్ద ఎక్కువ టైమ్ ఏమీ పట్టదు.