2026 సంక్రాంతి సినిమాల వార్ గురించి నిన్ననే మాట్లాడుకున్నాం. రవితేజ ఎంట్రీతో ఈసారి పొంగల్ ఫైట్ మామూలుగా ఉండదు అని లెక్కలేసుకున్నాం. అయితే అనుకున్నట్లుగా అన్నీ వస్తేనే ఆ పరిస్థితి. కానీ అన్నీ రావడం సాధ్యమేనా అని లెక్కలేసుకున్నాం. అయితే ఇప్పుడు మరో రెండు సినిమాలు ఆ సీజన్ మీద కన్నేశాయని వార్తలొస్తున్నాయి. అందులో ఒకరు శర్వానంద్ కాగా, మరొకరు అల్లరి నరేశ్. దీంతో సంక్రాంతి రేసు ఇంకాస్త మజాను తీసుకొచ్చింది. ఎలాగూ ఇన్ని సినిమాలు అప్పుడు రావు. కానీ ఏవి వస్తాయి అనే ఫైట్ ఆసక్తికరంగా మారింది.
శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా షూటింగ్ ఎప్పుడో అయిపోయింది. ఆ మధ్య ఓసారి ప్రచారం కూడా షురూ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఏమైందో ఏమో మళ్లీ ఆపేశారు. ఓటీటీ డీల్ కుదరకపోవడంతో లేట్ అవుతోంది అని టాక్ వచ్చింది. ఇప్పుడు పనులు కొలిక్కి వచ్చాయి. దీంతో సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేశారు. ఇక ‘ఆల్కహాల్’ అంటూ అల్లరి నరేశ్ కూడా జనవరినే టార్గెట్ చేస్తున్నాడు. కుదిరితే సంక్రాంతికి లేదంటే జనవరి మొదటి వారంలో రావాలని అనుకుంటున్నాడట.
కిశోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సినిమాను ఎలాగైనా సంక్రాంతి బరిలో నిలపాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాత సుధాకర్ చెరుకూరి. సంక్రాంతి లక్ష్యంగానే చిత్రీకరణ ప్రారంభించుకున్న టీమ్.. అన్నీ అనుకున్నట్లుగా సాగితే జనవరి 13ను లాక్ చేసుకున్నారట. చిరంజీవి ‘మన శంకర్ వరప్రసాద్ గారు’, ప్రభాస్ ‘ది రాజాసాబ్’, బాలకృష్ణ ‘అఖండ 2: తాండవం’ పొంగల్ ఫైట్‌కి వస్తాయని టాక్. వీటికితోడు నవీన్ పొలిశెట్టి సినిమా ‘అనగనగా ఒక రాజు’ సినిమా కూడా బరిలో ఉంది.
చూద్దాం పొంగల్ ఫైట్ – 2026 ఎలా ఉండబోతుందో? ఆ రోజుకి ఎవరు ఫైనల్‌గా పోరులో నిలుస్తారో. ఎందుకంటే ఇన్ని సినిమాలు పొంగల్‌కి వచ్చే పరిస్థితి లేదు. థియేటర్లు సరిపోయే పరిస్థితి అస్సలు లేదు. కానీ ఏదో ఆశతో చాలామంది సంక్రాంతి అని అంటున్నారు.