యువ హీరో శర్వానంద్ శతమానం భవతి విజయం తర్వాత చేసిన “రాధ” నిరాశపరిచినప్పటికీ మహానుభావుడితో హిట్ కొట్టారు. ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాలో శర్వానంద్ డ్యూయల్ రోల్ పోషించనున్నారు. ఒకటి లవర్ బాయ్ కాగా.. మరొకటి మిడిల్ ఏజ్ క్యారెక్టర్. 40 ఏళ్ల శర్వానంద్ పక్కన జోడీగా కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారు. అలాగే రెండో హీరోయిన్ గా హలో బ్యూటీ కళ్యాణి ప్రియదర్శి నటించనుంది. ఇందులో సీనియర్ శర్వానంద్ కి మంచి లవ్ స్టోరీ ఉంది. అందుకోసం 1980 కాలం నాటి పరిస్థితులను సినిమాలో చూపించనున్నారు. ఈ షూటింగ్ ను విశాఖలో ప్రారంభించారు.
1980 నాటి సెట్ ను ఇక్కడ రూపొందించారు. మగధీర, మర్యాదరామన్న, భాగమతి సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన రవీందర్ రెడ్డి 80 కాలం నాటి వైజాగ్ సెట్ ను తీర్చి దిద్దారు. టీ కొట్టు, పాత బంగాళాలు, 1982 వైజాగ్ బస్టాండ్.. కళ్లకు కట్టేలా వేసిన ఈ సెట్లో మొదటి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించారు.ఆ తర్వాత షెడ్యూల్ కాకినాడ పోర్టులో జరగనుంది. ఇక మూడో షెడ్యూల్ కోసం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కోటి రూపాయలతో సెట్ వేయనున్నారు. స్వామిరారా, కేశవా, కిరాక్ పార్టీ వంటి చిత్రాలతో మంచి పేరుతెచ్చుకున్న సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ క్రేజ్ ఉంది.