గ్రామాల్లో కొంతమంది మాస్టార్లు ఉంటారు.. వారికీ చదువు చెప్పడం బాగా వచ్చు.. కార్పొరేట్ స్కూల్ వాళ్లు ఎక్కువజీతం ఇస్తామన్నా.. వెళ్లరు. ప్రపంచం ర్యాకుల కోసం.. ఎక్కువ జీతాల కోసం అందరూ పరుగెడుతున్నా.. వారు మాత్రం తక్కువ జీతం వచ్చినా, గ్రామాల్లోనే ఉంటూ నచ్చిన పిల్లలకి చదువు చెప్పడానికి ఇష్టపడుతారు. జేబు సంతృప్తికన్నా.. జాబు సంతృప్తికే ప్రాధాన్యత ఇస్తారు. అటువంటి కేటగిరీల్లోకి వస్తారు డైరక్టర్ శేఖర్ కమ్ముల. పద్దెనిమిదేళ్ల క్రితమే మెగా ఫోన్ పట్టిన ఈ డైరక్టర్ ఎక్కువశాతం కొత్తవారితోనే సినిమాలు చేశారు. ఆనంద్, హ్యాపీడేస్ వంటి మంచి సినిమాలను అందించారు.
కొత్తవారితో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం తీసి ఆర్ధికంగా నష్టాలను చూసారు. ఆ తర్వాత విజయాలు పలకరించకపోవడంతో మెగా హీరో వరుణ్ తేజ్ తో ఫిదా మూవీ తీసి మళ్ళీ శేఖర్ కమ్ముల హిట్ ట్రాక్ లోకి వచ్చారు. దీంతో అతనితో మూవీ చేయాలనీ స్టార్ హీరోలు ఆశపడ్డారు. నిర్మాతలు క్యూ కట్టారు. అతను మాత్రం మళ్ళీ కొత్తవారికోసం కథ రాసుకున్నారు. ఇందులో ఒక స్టార్ హీరోయిన్ తప్ప, ఎక్కువ మంది నూతన నటీనటులే నటించబోతున్నట్టు సమాచారం. మరి దీన్ని స్వయంగా నిర్మిస్తారా? లేదా? అనేది ఇప్పుడే తెలియదు. ఆర్టిస్టుల సెలక్షన్ అన్ని పూర్తి అయిన తర్వాత ఈ మూవీ విశేషాలను అధికారికంగా ప్రకటించనున్నారు.