కరోనా సెకండ్ వేవ్ – లాక్‌డౌన్… దీంతో ప్రజలు పరిస్థితి తిరిగి మళ్లీ ఇబ్బందుల్లోకి వచ్చేసింది. తొలి వేవ్ తర్వాత తిరిగి కోలుకుంటున్నాం అనుకునేలోగా సెకండ్ వేవ్ ప్రతాపం చూపిస్తోంది. దీంతో పనులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వీరిలో డ్యాన్సర్లు కూడా చాలామంది ఉన్నారు. సినిమాలు, షోస్, సంగీత్‌లు… ఇలా ఎలాంటి కార్యక్రమాలు లేకపోవడం వల్ల చాలామంది డ్యాన్సర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని తెలుసుకున్న శేఖర్ మాస్టర్ సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పెట్టారు.
కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్ విధింపు తదితర కారణాల వల్ల పరిస్థితి దారుణంగా ఉంది. గ్రూప్ డ్యాన్సర్లు, టీవీ షోలు చేసే డ్యాన్సర్లకు పని దొరకడం లేదు. దీంతో వారి పరిస్థితి కష్టంగా మారింది. భోజనానికి కూడా ఇబ్బంది పడుతున్న డ్యాన్సర్లు చాలామంది ఉన్నారని తెలుస్తోంది. అలాంటి వారు ఎవరున్నా నన్ను సంప్రదించండి. వారికి నిత్యావసర సరకులు మా టీమ్ అందిస్తుంది’’ అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు శేఖర్ మాస్టర్. దీంతోపాటు అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావొద్దని, ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.
శేఖర్ మాస్టర్ అందిస్తున్న సాయం ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉన్న డ్యాన్సర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. లాక్‌డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల వారికి అందుబాటులో ఉండటం లేదని చెప్పుకొచ్చారు మాస్టర్. సాయం కోసం 9989189885 (Asst. Baba), 9618961492 (Asst. Sekhar),7416519257 (Asst. Vinod) నెంబర్లను ఇచ్చారు. ఇవి ఆయన అసిస్టెంట్ల నెంబర్లు. సాయం అవసరమైన డ్యాన్సర్లు ఈ నెంబర్లకు ఫోన్ చేయమని కోరారు. శేఖర్ మాస్టర్ ఎంతైనా ఆకలి కష్టం తెలిసినోడు కదా. మిగిలినవారికి తెలియదని కాదు.