Shikaru Review: షికారు సినిమా రివ్యూ & రేటింగ్!

  • July 1, 2022 / 10:19 PM IST

రజినీకాంత్ నటించిన ‘కబాలి’ చిత్రంలో యోగి పాత్రలో అద్భుతంగా నటించిన సాయి ధన్సిక, తెలుగులో నటించిన మొదటి స్ట్రైట్ మూవీ ‘షికారు’. కొద్దిరోజులుగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమోలు, టీజర్లు, ట్రైలర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కచ్చితంగా ఇది యూత్ ఫుల్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా అలరిస్తుంది అని ప్రేక్షకులు భావించారు. మరి వారి అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా ఉందా లేదా? అనే విషయం పై ఓ లుక్కేద్దాం రండి :

కథ : దీపిక(సాయి ధన్సిక) అనే అమ్మాయికి కొంచెం ఏజ్ గ్యాప్ ఉన్న నరసింహ(కన్నడ కిషోర్) తో పెళ్లి అవుతుంది. అతను ఒక పోలీస్ ఆఫీసర్. భార్యతో అతను చాలా రూడ్ గా బిహేవ్ చేస్తుంటాడు. ఆమె సున్నిత మనస్తత్వం కలిగిన అమ్మాయి. భర్తతో ఆమెకు ఎటువంటి ఆనందం కలగడం లేదు అని భావించి జీవితంలో ఏదో ఒకటి సాధిద్దాం అని డిసైడ్ అయ్యి.. తన భర్తకు తెలియకుండా చదువుని కొనసాగిస్తుంది. అదే సమయంలో ఆమెకు బాబీ(అభినవ్) అనే పెళ్లి కాని యువకుడితో పరిచయమవుతుంది.

ఉద్యోగం నిమిత్తం సిటీకి వచ్చిన బాబీని.. తన భర్త ఇంట్లో లేని సమయంలో తన ఇంటికి పిలుస్తుంది దీపిక. అయితే అదే సమయంలో ఊహించని విధంగా దీపిక భర్త ఇంటికి వస్తాడు. బాబీ ఆమె ఇంట్లో ఇరుక్కుపోతాడు. అతన్ని ఎలాగైనా అక్కడి నుండి తప్పించాలి అని అతని స్నేహితులు ప్రయత్నిస్తూ ఉంటారు. చివరికి అతను బయటపడ్డాడా? లేక పోలీస్ ఆఫీసర్ అయిన నరసింహకి దొరికిపోయాడా? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు : సాయి ధన్సిక ఎంత మంచి నటి అనే విషయం మన తెలుగు ప్రేక్షకులకు ‘కబాలి’ చిత్రం ద్వారా నిరూపించింది. ‘షికారు’ చిత్రంలో కూడా ఆమె చాలా చక్కగా నటించింది. అమాయకపు అమ్మాయి అయిన దీపిక పాత్రకి జీవం పోసింది. అలాగే కొన్ని చోట్ల కామెడీని కూడా చక్కగా పండించింది. కన్నడ కిషోర్ తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. ‘హ్యాపీ’ చిత్రం నుండి ఆయన విలనిజంతో, విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ఈ చిత్రంలో కూడా ఆయన మార్కు నటనతో ఆకట్టుకున్నాడు.

అభినవ్ అలాగే అతని స్నేహితులుగా నటించిన వారిలో మనం ధీరజ్ ఆత్రేయ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఓ సందర్భంలో అతను బాలకృష్ణ కి సంబంధించిన డైలాగులు, అలాగే బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి చెబుతుంటే థియేటర్లు విజిల్స్ తో, చప్పట్లతో, కేకలతో దద్దరిల్లాయి. డౌట్ లేకుండా ధీరజ్ ఆత్రేయ నటనకు మంచి మార్కులు పడతాయి. అతనికి భవిష్యత్తులో మరిన్ని మంచి అవకాశాలు వస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు హరి కొలగాని యూత్ కు కనెక్ట్ అంశాలతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. అలాగే ఆధ్యంతం ఎంటర్టైన్ చేసే స్క్రీన్ ప్లే తో బోర్ కొట్టకుండా నడిపించిన విధానానికి ఆయన్ని మెచ్చుకోవచ్చు. చివర్లో చిన్న మెసేజ్ కూడా ఇచ్చారు ఆయన. అలాగే శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. శ్యామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.

పిఎస్ఆర్ కుమార్ (బాబ్జి) నిర్మాణ విలువలు కథకి తగ్గట్టుగా కరెక్ట్ గా సరిపోయాయి.అనవసరమైన ఖర్చుల జోలికి పోలేదు కాబట్టి ఈ విషయంలో నిర్మాత తో పాటు దర్శకుడిని కూడా అభినందించాలి. ఇక నిడివి కూడా 2 గంటల 12 నిమిషాలు మాత్రమే ఉండటం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి.

విశ్లేషణ : మొత్తంగా ‘షికారు’ … యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మెచ్చేలా చిన్న మెసేజ్ తో ఎంటర్టైన్ చేస్తుంది. వీకెండ్ కు ఈ చిత్రాన్ని హ్యాపీగా ఓసారి ట్రై చేయొచ్చు.

రేటింగ్: 2.25/5

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus