సంగీత దర్శకులు వైన్ బాటిల్స్ లాంటి వాళ్ళు.. వైన్ బాటిల్స్ కి ఏజ్ పెరిగే కొద్దీ వాటి వేల్యూ పెరిగినట్లు, సీనియారిటీ పెరిగే కొద్దీ మ్యూజిక్ డైరెక్టర్స్ వేల్యూ కూడా పెరగాలి. కానీ.. విచిత్రంగా సీనియారిటీ పెరిగే కొద్దీ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన దేవిశ్రీప్రసాద్ వేల్యూ మాత్రం తగ్గిపోతోంది. ఈ ఏడాది బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అయిన “ఎఫ్ 2” దేవిశ్రీ ప్రసాద్ ఖాతాలోకే వచ్చి చేరినప్పటికీ.. ఆ సినిమాలో దేవి మార్క్ మాత్రం ఎక్కడా కనిపించదు. కానీ.. ఆ సినిమాకి ముందు వచ్చిన “వినయ విధేయ రామ” కానీ.. మరో రెండు వారాల్లో విడుదలకానున్న “మహర్షి” సినిమా ట్యూన్స్ కానీ శ్రోతలను కనీస స్థాయిలో కూడా ఆకట్టుకోలేకపోయాయి.
“వినయ విధేయ రామ” సినిమాకి బోయపాటి సంగీత దర్శకుడు కాబట్టి.. బోయపాటి సినిమాల్లో సంగీతానికి పెద్దగా ప్రాముఖ్యత ఉండదు కాబట్టి ఆ సినిమా సంగీతం విషయాన్ని ఎవరు పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. కానీ.. వంశీ పైడిపల్లి మునుపటి సినిమాలన్నీ మ్యూజికల్ చార్ట్ బస్టర్స్. అలాంటి వంశీ పైడిపల్లితో కలిసి “ఎవడు” తర్వాత “మహర్షి” సినిమాకి వర్క్ చేసిన దేవిశ్రీప్రసాద్ ఇప్పటివరకూ అందించిన బాణీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆకట్టుకొనే విధంగా లేకపోవడం గమనార్హం. ఇలా దేవి రోజురోజుకీ తన వేల్యూ తానే దిగజార్చుకోంటుండడం దేవి అభిమానులను బాధపెడుతున్నప్పటికీ.. ఏమీ చేయలేక కనీసం నేపధ్య సంగీతమైనా బాగా చేస్తే చాలు అని ఎదురుచూస్తున్నారు.