బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

‘ఎంటర్‌టైన్మెంట్‌ లైక్ నెవర్‌ బిఫోర్‌’ అంటూ టీజర్ టైమ్‌ నుండే చెబుతూ వచ్చిన బిగ్‌బాస్‌ టీమ్‌… అదే పని చేసింది. ‘బిగ్‌బాస్‌ 4’ పార్టిసిపెంట్స్‌ ఎంపికలో చాలా గట్టి ప్రయత్నాలే చేసింది. రకరకాల రంగాల నుండి సెలబ్రిటీలను తీసుకొచ్చింది. ఏ ఇద్దరి మధ్యా ఎలాంటి పోలిక లేదు. అందుకే ఈసారి ఎంటర్‌టైన్మెంట్‌ నెవర్‌ బిఫోర్‌. అలా ఈ సారి బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎవరెవరు ఉంటారో చూడండి.

హాట్‌షాట్‌ మోనాల్‌ గజ్జర్‌

బిగ్‌బాస్‌ 4లో ఫస్ట్‌ కంటెస్టెంట్‌… మోనాల్‌ గజ్జర్‌. ఇలా పేరు చెబితే కష్టం కానీ అల్లరి నరేశ్‌ హీరోయిన్‌ అంటే ఠక్కున గుర్తు పట్టొచ్చు. ‘సుడిగాడు’ సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చిన అందం ఈ భామ. టాలీవుడ్‌లో ‘వెన్నెల 1 1/2’, ‘ఒక కాలేజీ స్టోరీ’, ‘బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాలి’, ‘దేవ్‌దాసి’, ‘కాగజ్‌’ తదితర సినిమాలు చేసి ఆ తర్వాత పరిశ్రమకు దూరమైంది. బిగ్‌బాస్‌లో వీళ్లు ఉండొచ్చు అంటూ ఊహాగానాలు వచ్చిన తొలి పార్టిసిపెంట్‌ ఈమెనే. అనుకున్నట్లే ఆమె ఉంది.. అందులోనూ ఫస్ట్‌ వచ్చింది. గుజరాత్‌కి చెందిన మోనాల్‌ అహ్మదాబాద్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. మిస్‌ గుజరాత్‌ కూడా ఎంపికైంది. ప్రస్తుతం గుజరాతీ సినిమాల్లో నటిస్తోంది. ‘ఏ విషయానికైనా తొందరగా మనసులోకి తీసుకొని ఎమోషనల్‌ అయిపోతాను’ అంటూ లాంచ్‌ రోజే చెప్పి… ఓ ఇమేజ్‌కి పరిమితమైంది. పోను పోను ఎంత ఎమోషన్ అయిపోతుందో చూడాలి.

డైరక్టర్‌ సూర్య కిరణ్‌

‘సత్యం’, ‘ధన 51’, ‘రాజు భాయ్‌’ సినిమాల దర్శకుడు సూర్య కిరణ్‌ గుర్తున్నాడా? ఆయనే రెండో పార్టిసిపెంట్‌. పూర్తి పేరు సుబ్రమణి రాధా సురేశ్‌. తొలి సినిమాతో బంపర్‌ హిట్‌ కొట్టేసిన సూర్య కిరణ్‌ ఆ జోరులో వరుస సినిమాలు చేసినా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. సూర్య కిరణ్‌ దర్శకుడిగానే కాకుండా… బాలనటుడిగా ఎప్పటినుండో చిత్రపరిశ్రమకు పరిచయమే. 200 సినిమాల్లో బాలనటుడిగా కనిపించి అలరించాడు. ఇటీవల కాలంలో ఆర్థికంగా చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు.

చీమ.. ఏనుగు లాస్య

యాంకర్‌ లాస్య.. అంటే బాగానే గుర్తొస్తుంది కానీ.. ‘ఏనుగు చీమ జోక్‌’ లాస్య అంటే ఇంకా బాగా గుర్తొస్తుంది. ఆ చీమ.. ఏనుగు ఫన్‌ ఇప్పుడు బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి వచ్చింది. ‘సమ్‌ థింగ్‌ స్పెషల్‌’ అంటూ 2012లో టీవీ షో ద్వారా బుల్లితెరకు పరిచయమైన లాస్య… ‘మొండి మొగుడు పెంకి పెళ్లాం’, ‘మా ఊరి వంట2, ‘ఢీ’ షోలు చేసింది. తర్వాత మంజునాథ్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత షోల నుండి విరామం తీసుకుంది. 2019లో వీరికి దక్ష్‌ అనే బాబు పుట్టాడు. ప్రస్తుతం ‘లాస్య టాక్స్‌’ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా అందరికీ అందుబాటులో ఉంది. ఇప్పుడు బిగ్‌బాస్‌తో అందరి ఇంటికి రోజూ రాబోతోంది.

యంగ్‌ గన్‌ ‘అభిజిత్‌’

బిగ్‌బాస్‌ 4 హాట్‌ ఫేవరేట్‌ పేర్లలో అభిజిత్‌ ఒకటి. అదేంటి తొలి ఎపిసోడ్‌కే హాట్‌ ఫేవరేట్‌ అని చెప్పేస్తారా అనుకుంటున్నారా. అతని గురించి తెలిస్తే ఎవరన్నా అదే మాట అంటారు. ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’తో సినిమాల్లోకి ప్రవేశించిన అభిజిత్‌ చాక్లెట్‌ బాయ్‌గా, యంగ్‌ టాలెంటెడ్‌ యాక్టర్ గా‌ పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ‘మిర్చి లాంటి కుర్రాడు’ సినిమాతో తనను తాను నిరూపించాడు. ఆ తర్వాత వెబ్‌ షోలో కూడా అదరగొట్టాడు. ‘పెళ్లి గోల’ పేరుతో మూడు సిరీస్‌లు చేసి అదరగొట్టాడు. ఇప్పుడు అదే జోరు బిగ్‌బాస్‌లో చూపించబోతున్నాడు.

జోర్దార్‌ సుజాత

గత బిగ్‌బాస్‌ సీజన్‌లో తీన్మార్‌ సావిత్రి చేసిన హంగామా గుర్తుందా. ఈ సారి అలాంటి సందడి చేయడానికి మరో అమ్మాయి ఈ సారి బిగ్‌బాస్‌లో అడుగుపెట్టింది. ఆమె కూడా న్యూస్‌ ప్రజెంటరే. పేరు సావిత్రి. జోర్దార్‌ సావిత్రి. తెలంగాణ యాసలో లాంచింగ్‌ ఎపిసోడ్‌ అదరగొట్టేసిన సుజాత… అచ్చ తెలుగు తెలంగాణ అమ్మాయిగా లంగావోణిలో వావ్‌ అనిపించింది. వార్తలు చెప్పడం తనదైన శైలిని నిరూపించుకున్న సుజాత.. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఏం చేస్తుందో చూడాలి. అన్నట్లు ఈ అమ్మాయి మాట తీరు చూస్తుంటే… నువ్వు ఒకటంటే నేను రెండంటే అన్నట్లుగా ఉంది.

దిల్‌ సే మెహబూబ్‌

బిగ్‌బాస్‌లో సోషల్‌ మీడియా స్టార్ల సందడి ఏటా ఉండేదే. ఈసారి కూడా అదే ఫార్ములాను బిగ్‌ బాస్‌ రన్‌ చేసింది. సోషల్‌ మీడియా నుండి మెహబూబ్‌ను తీసుకొచ్చింది. మెహబూబ్‌ ఎవరబ్బా అనుకుంటున్నారా… మెహబూబ్‌ దిల్‌సే’ అండి. ఇన్‌స్టాగ్రామ్‌ 2,40,000 మందికిపైగా ఫాలోవర్స్‌ ఉన్న యంగ్‌ స్టార్‌ మెహబూబ్‌. కవర్‌ సాంగ్స్‌, టిక్‌ టాక్‌ వీడియోలు చూస్తే మెహబూబ్‌ టాలెంట్‌ ఏంటో తెలుస్తుంది. అయినా ఎందుకంత కష్టం. రేపటి నుండి బిగ్‌బాస్‌ హౌస్‌లో చూసేయొచ్చు లెండి. అన్నట్లు మెహబూబ్‌ది గుంటూరు.

ఫియర్‌ లెస్‌ దేవీ నాగవల్లి

దేవి నాగవల్లి… టీవీ9 చూసేవారికి ఈ పేరు బాగా పరిచితం. ఫియర్‌లెస్‌ దేవీ నాగవల్లి అని అంటుంటారు. ఈ న్యూస్‌ రిపోర్టర్‌/ప్రెజెంటర్‌ ఇప్పుడు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చింది. బిగ్‌ బాస్‌ సీజన్లలో టీవీ9 రిపోర్టర్లు రావడం పెద్ద కొత్తేం కాదు. గతంలోనూ చాలామంది వచ్చారు. అలా ఈ ఏడాది దేవీ నాగవల్లిని తీసుకొచ్చారు. రాజమండ్రిలో పుట్టి పెరిగిన దేవీ.. కామర్స్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ చదివింది. గ్రాఫిక్‌ డిజైనర్‌ కూడా. మరి ఇప్పుడు బిగ్‌బాస్‌లో ఎలాంటి గ్రాఫిక్స్‌ డిజైన్‌ చేస్తుందో చూడాలి.

దేత్తడి… హారిక

యూట్యూబ్‌లో సిరీస్‌లు చూసేవాళ్లకు ‘దేత్తడి హారిక’ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘దేత్తడి’, ‘చిత్రవిచిత్రం’ పేర్లతో సిరీస్‌లతో యూట్యూబ్‌లో బాగా పాపులర్‌ అయిపోయింది. ఇప్పుడు బిగ్‌బాస్‌లోకి వచ్చింది. మాంచి సాంగ్‌తో లాంచింగ్‌ ఎపిసోడ్‌లో ఎంట్రీ ఇచ్చిన హారిక… తన క్యూట్‌ నెస్‌తో అందరినీ ఆకట్టుకుంది. చూడటానికి ముద్దుగా, బొద్దుగా, క్యూట్‌ కనిపించిన హారిక ఈ సీజన్‌లో హాట్‌ఫేవరేట్‌గా నిలవడం ఖాయం. ఇంట్లోకి ఎంట్రీనే ‘నమస్తే వాట్సాప్‌’ అంటూ మొదలుపెట్టిన హారిక… రేపటి నుండి ఏం చేస్తోందో చూద్దాం.

ఇస్మార్ట్‌ సోహైల్‌ & బోల్డ్ ఆరియానా

బిగ్‌బాస్‌లోకి వస్తోన్న మరో పార్టిసిపెంట్‌ సయ్యద్‌ సోహైల్‌ రియాన్‌. చూడటానికి చాక్లెట్‌ బాయ్‌లా కనిపిస్తున్నా… నటనలో మాత్రం చాలా మాస్‌. ‘మ్యూజిక్‌ మ్యాజిక్‌’ సినిమాతో ఇండస్ట్రీలో ప్రవేశించిన సోహైల్‌ ఆ తర్వాత ‘సినీ మహాల్‌’, ‘కోనాపురం జరిగిన కథ’, ‘యురేఖ’ సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత ‘కృష్ణవేణి’, ‘నాతి చరామి’ సీరియల్స్‌లో నటించాడు. ఇప్పుడు బిగ్‌బాస్‌లోకి వచ్చాడు. అయితే సోహైల్‌ని డైరెక్ట్‌గా ఇంట్లోకి పంపించలేదు.

ఇక్కడే బిగ్‌బాస్‌ తన స్టైల్‌ గేమ్‌ ప్రారంభించాడు. అదేంటి తొలి ఎపిసోడ్‌లోనేనా అనుకుంటున్నారా? ఎంటర్‌టైన్మెంట్‌ నెవర్‌ బిఫోర్‌ అన్నారు కదా. సోహైల్‌ను బిగ్‌బాస్‌ ఇంటి పక్కన ఉన్న మరో ఇంట్లో ఉంచారు. అదీనూ ఒక్కడినే కాదు.. ఆయనతోపాటు ఆరియానా గ్లోరీ అనే అమ్మాయి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మాయి గురించి చాలామంది తెలుసనుకుంటా. టీవీ యాంకర్‌గా ఇప్పటికే ఈ చిన్నది అందరికీ పరిచయమే. బోల్డ్‌ ట్యాగ్‌లైన్‌ పేరుతో బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చింది ఆరియానా. చిన్నతనంలో చాలా కష్టాలు పడ్డానంటూ… బోల్డ్‌గా ఉంటూ తనేంటో నిరూపించుకుంటా అని వచ్చింది. వీరిద్దరినీ బిగ్‌బాస్‌ నైబర్‌ హౌస్‌లో పెట్టాడు. అక్కడ వీరేం చేస్తారు.. వీరితో బిగ్‌బాస్‌ ఏం చేయిస్తాడో చూడాలి.

మాస్‌ అమ్మ రాజశేఖర్‌

గత బిగ్‌బాస్‌ సీజన్‌లో ఫన్‌ అంటే బాబా భాస్కర్‌… బాబా భాస్కర్‌ అంటే ఫన్‌. అంతగా అలరించాడు ఈ డ్యాన్స్‌ బాస్‌. ఈసారి ఆ ఫన్‌ని డబుల్‌ చేయడానికి ఆయన గురువునే తీసుకొచ్చాడు బిగ్ భాస్కర్‌. ఆయనే అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌. తమిళ- తెలుగు మిక్సింగ్‌ లాంగ్వేజ్‌తో అమ్మ రాజశేఖర్‌ ఏం సందడి చేస్తాడో చూడాలి. అమ్మ రాజశేఖర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి. డ్యాన్స్‌లతో మాస్‌ మాస్టర్‌ అనిపించుకున్న రాజశేఖర్‌… ‘రణం’, ‘టక్కరి’, ‘సత్యం’, ‘సెల్యూట్‌’ లాంటి సినిమాలతో దర్శకుడిగానూ నిరూపించుకున్నాడు. ఇటీవల కాలంలో సైలంట్‌గా ఉన్నాడు. అమ్మ రాజశేఖర్‌ గతంలో కొన్ని టీవీ షోలకు జడ్జిగా కూడా వ్యవహరించాడు. ‘ఛాలెంజ్‌’, ‘ఘర్షణ’ లాంటి షోలకు జడ్జిగా చేశాడు.

ఫైర్‌బ్రాండ్‌ కళ్యాణి

‘కరాటే’ కల్యాణి… తెలుగు సినిమాలు చూసేవారికి పరిచయం అక్కర్లేని పేరు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న కరాటే కళ్యాణి ఈ బిగ్‌బాస్‌ సీజన్‌లో అడుగుపెట్టింది. సినిమాల్లో హాట్‌ క్యారెక్టర్లు మాత్రమే కాకుండా… సీరియస్‌ క్యారెక్టర్లు కూడా వేసే కళ్యాణి… నిజ జీవితంలో అనుభవించని కష్టాలు లేవు. వాటిని వివరిస్తూనే లాంచ్‌ ఎపిసోడ్‌లో తనదైన శైలిలో, తనకు బాగా నచ్చిన బుర్ర కథ స్టైల్‌లో బిగ్‌ బాస్ గురించి చెప్పి ఆకట్టుకుంది. నిజ జీవితంలో కరాటే నేర్చుకుని ఫైటర్‌ అనిపించుకున్న కళ్యాణి… మరి బిగ్‌బాస్‌లో ఏం చేస్తుందో చూడాలి.

ర్యాపర్‌.. నోయల్‌

సింగర్‌, యాక్టర్‌, ర్యాపర్‌, హోస్ట్‌, ఆర్‌జే, వీజే… ఇన్ని కళలు ఉన్న అతికొంతమందిలో నోయల్‌ షాన్‌ ఒకడు. ఆ ఒకడు రేపటి నుండి బిగ్‌బాస్‌లో మిమ్మల్ని అలరించబోతున్నాడు. ‘విడాకులు తీసుకున్నాం’ అంటూ ఇటీవల తన రియల్‌ లైఫ్‌లో జరిగిన విషయాన్ని… వెల్లడించి ఆశ్చర్యపరిచిన నోయల్… ఇప్పుడు బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘సరిగమప లిటిల్‌ ఛాంప్స్‌’, ‘సూపర్‌ కుటుంబం’ లాంటి షోస్‌ కూడా హోస్ట్‌ చేశాడు. బయట చాలా సందడిగా కనిపించే నోయల్‌… బిగ్‌బాస్‌ హౌస్‌లో ఇంకెంత సందడి చేస్తాడో చూడాలి.

అందాల ఫీస్ట్‌ … దివి

బిగ్‌బాస్‌లో వచ్చినవారందరూ సెలబ్రిటీలు అయితే ఏముంటుంది… ఇక్కడికొచ్చి సెలబ్రిటీ అవుదాం అనుకుంటున్నా అంటూ ఎంట్రీ ఇచ్చింది దివి. అసలు పేరు దివ్య వాద్యా. ‘మహర్షి’ సినిమాలో కనిపించిన ఈ భామ… అప్పుడే భలే ఉందే అనిపించుకుంది. హైదరాబాద్‌కి చెందిన ఈ అందాల బాంబ్‌ ఎంబీఏ పూర్తి చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోలతో బాగా పాపులర్‌ అయిన దివి మరి బిగ్‌బాస్‌లో ఏమాత్రం రాణిస్తుందో చూడాలి.

అఖిల్‌ వచ్చాడు…

బిగ్‌బాస్‌ 4లో మోస్ట్‌ డిజైరబుల్‌ మ్యాన్‌ ను కూడా తీసుకొచ్చారు. అతనే అఖిల్‌ సార్థక్‌. టీవీ సీరియల్స్‌ చూసేవాళ్లకు అఖిల్‌ బాగా తెలుసు. లాంచింగ్‌ స్టేజీ మీద ఏకంగా 50 పుషప్స్‌ చేసి తనేంటో, తన స్టామినా ఏంటో నిరూపించుకున్న అఖిల్‌ మరి హౌస్‌లో ఇంకెంత స్టామినా చూపిస్తాడో చూడాలి. ‘బావా మరదళ్లు’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన అఖిల్‌ ఆ తర్వాత ‘ఎవరే నువ్వు మోహిని’, ‘బంగారు గాజులు’, ‘కల్యాణి’, ‘ముత్యాల ముగ్గు’ సీరియల్స్‌లో నటించాడు.

గంగవ్వనా.. మజాకా

యూట్యూబ్‌లో స్టార్‌ అవ్వాలంటే యూత్‌కి మాత్రమే సాధ్యమా? అంటే కాదనే అంటారు నెటిజన్లు. కారణం ఓ ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అని నిరూపించిన స్టార్‌. ఆమెనే గంగవ్వ. అవును గంగవ్వ కూడా బిగ్‌బాస్‌లోకి వచ్చింది. 58 ఏళ్ల గంగవ్వ యూట్యూబ్‌లో ఎంత పాపులర్‌ చాలామందికి తెలుసు. అంతెందుకు మీకూ తెలిసే ఉంటుంది. యూట్యూబ్‌లో తొలుత వీడియోలతో వావ్‌ అనిపించిన గంగవ్వ ఆ తర్వాత సినిమా స్టార్ల ఇంటర్వ్యూలతో సూపర్‌ వావ్‌ అనిపించింది. ఇప్పుడు అదే మ్యాజిక్‌ బిగ్‌బాస్‌లో చూపించడానికి స్పెషల్‌ పార్టిసిపెంట్‌గా సిద్ధమై వచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus