బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తను శ్రీ దత్తా ఇటీవల ‘నా ఇంట్లో నాకు భద్రత లేదు. పోలీసుల వద్దకు వెళ్తాను. ఎవరైనా సాయం చేయండి’ అంటూ ఓ వీడియో చేసింది. అది చాలా వైరల్ అయ్యింది. ఆమె చేసిన కామెంట్స్ కూడా హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో ఓ ఆంగ్ల మీడియా ఆమెను సంప్రదించడం జరిగింది. తనకు ఆరోగ్యం బాగోలేకపోయినా ఇంటర్వ్యూలు ఇస్తున్నానని ఆమె తెలిపింది. అందరితోనూ తాను మాట్లాడతానని.. కొంచెం టైం పట్టొచ్చని ఆమె చెప్పుకొచ్చింది.
అలాగే మరో మీడియాతో ఆమె మాట్లాడుతూ.. “బాలీవుడ్ మాఫియా చాలా పెద్దది. నాకు ప్రాణ హాని ఉంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ను హత్య చేసినట్టే నన్ను కూడా హత్య చేయాలని చూస్తున్నారు. అందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి” అంటూ మరికొన్ని సంచలన కామెంట్లు చేసింది తను శ్రీ దత్తా. 2018లో మీటు ఉద్యమాన్ని నెలకొల్పింది ఈమెనే.
బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ తనని లైంగికంగా వేధించాడని… ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా షూటింగ్ టైంలో తనకు ఇష్టం లేకపోయినా లొంగదీసుకోవాలని ప్రయత్నించాడని ఆమె చెప్పుకొచ్చింది. పోలీసులు, కోర్టులు ఆమెకు సహకరించలేదు. కానీ సోషల్ మీడియా ద్వారా ఆమెకు ఇండియా మొత్తం సపోర్ట్ లభించింది. 6 ఏళ్లుగా ఆమె ఇంట్లోనే ఉంది. సినిమాలు కూడా చేయడం లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆమె మీడియా ముందుకు రావడం.. కొత్త అనుమానాలకు దారి తీసినట్లు అయ్యింది.