బాలనటులుగా ఎంట్రీ ఇచ్చి అటుపై వెండితెరను ఏలిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ లెక్క హీరోలతో పోలిస్తే హీరోయిన్లలో కొంత తక్కువే. శ్రీదేవి, మీనా, నిత్య మీనన్ వంటి వారు ఈ ఫీట్ లో సక్సెస్ సాధించగా వారి సరసన తాను నిలబడాలని కోరుకుంటోంది శ్రేయ శర్మ. ‘జై చిరంజీవ’, ‘దూకుడు’, ‘రోబో’ వంటి చిత్రాల్లో బాలనటిగా అలరించిన ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన తొలి చిత్రం ‘గాయకుడు’. పలు కారణాలతో అది విడుదల కానప్పటికీ ఈ నెల 16న తెరమీదికి రానున్న ‘నిర్మలా కాన్వెంట్’ సినిమా ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాలో పెద్ద కుటుంబానికి చెందిన ‘శాంతి’ అనే అమ్మాయి పాత్రలో కనపడనుంది శ్రేయ శర్మ. చదువులో అత్తెసరు మార్కులతో సరిపెట్టుకునే శాంతి కోపం, నిర్లక్ష్యం, అసూయ వంటి వాటిల్లో మాత్రం ఫస్ట్ ర్యాంక్ కొట్టేస్తుంది. అలాంటి శాంతి శామ్యూల్ తో ఎలా లవ్ లో పండింది అన్నది తెరపైనే చూడాలని చెబుతోంది శ్రేయ. ఇక వ్యక్తిగత వివరాలు పంచుకుంటూ స్వస్థలం హిమాచల్ ప్రదేశ్ అని చెప్పిన శ్రేయ ప్రస్తుతం ముంబైలో సెటిలయ్యామని తెలిపింది. సినిమాల్లో పడి చదువు గాలికొదిలేసిందని అనుకునేరు. ఆ మాట ఆమె వరకు చేరితే ఏదో ఒక సెక్షన్ చెప్పి కోర్టుకి లాగేస్తుంది. ఎంతైనా ‘లా’ స్టూడెంట్ మరి. ప్రస్తుతం లా ‘రెండో’ సంవత్సరం చదువుతున్న శ్రేయ చదువు పూర్తయ్యాక సినిమాలపై పూర్తి దృష్టి సారిస్తానని చెప్పింది.
https://www.youtube.com/watch?v=vCSnxc0PRc0