రాజమౌళి సినిమాలే కాదు సర్‌ప్రైజ్‌లు కూడా భారీగానే ఉంటాయి. మహేష్ బాబు – ప్రియాంక చోప్రా – పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో ఆయన రూపొందిస్తున్న ‘గ్లోబ్‌ట్రాటర్’ (వర్కింగ్ టైటిలా లేక ఇదే ఫిక్సా అనేది తేలాలి) నుండి నిన్న రాత్రి ఓ అప్‌డేట్ వచ్చింది. సినిమా థీమ్ మొత్తాన్ని ఓ మూడున్నర నిమిషాలలో వివరిస్తూ ఓ పాటను రిలీజ్ చేశారు. మామూలుగా అయితే ఆ పాట చాలా స్పెషల్. దానిని ప్రముఖ కథానాయిక శ్రుతి హాసన్ ఆలపించడంతో ఇంకా స్పెషల్ అయిపోయింది.
శ్రుతి హాసన్‌కు పాటలు పాడటం కొత్తేమీ కాదు. గతంలో చాలా పాటలు పాడింది. ఆమెకు ఓ మ్యూజిక్ బ్యాండ్ కూడా ఉంది. అయితే ఓ అగ్ర హీరో సినిమాకు, ఓ అగ్రదర్శకుడి సినిమాకు పాటలు పాడటం తెలుగులో అయితే ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. ఈ విషయాన్ని ఇన్నాళ్లూ సీక్రెట్‌గా ఉంచిన టీమ్ ఆ పాట రిలీజ్ అవ్వడానికి కొన్ని గంటల ముందు ఫొటో బయట పెట్టి స్వీట్ షాక్ ఇచ్చారు. దాని నుండి తేరుకునేలోపే పాటను రిలీజ్ చేసి మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు.
శ్రుతి హాసన్‌ది పెక్యూలియర్ వాయిస్. ఆమె మాట్లాడితేనే బేస్ ఉంటుంది. అలాంటి ఆమె పాడితే ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందులోనూ ఆమె హైపిచ్‌లో పాడుతుంటే వినేవాళ్లకు, ఆ వీడియో చూసినవాళ్లకు గూస్‌బంప్స్ పక్కా అని చెప్పొచ్చు. ‘‘సంచారి సంచారి.. నినదించే రణభేరి.. సంహారి సంహారి.. మృత్యువుపై తన స్వారీ’’ అంటూ మహేష్ బాబు పాత్రను, అతని ప్రయాణాన్ని వర్ణిస్తూ సాగిన ఈ పాటకు కీరవాణి స్వరాలు సమకూర్చగా, చైతన్య ప్రసాద్ సాహిత్యమందించారు. శ్రుతితో కలసి కాలభైరవ పాడారు.
ఈ సినిమాలో మహేష్ బాబు లుక్‌ని, సినిమా నేపథ్యాన్ని వివరించడానికి రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ నెల 15న భారీ స్థాయిలో ఓ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఆ రోజు వేదిక మీద ఈ పాటను శ్రుతి మరోసారి ఆలపిస్తారని సమాచారం. అప్పుడైతే స్టేజీ దద్దరిల్లిపోతుంది అని చెప్పొచ్చు.