గాయకుడిగా సంగీత ప్రపంచాన్ని ఓ ఏలు ఏలుతున్న సమయంలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వడం చాలా అరుదుగా చూస్తుంటాం. సంగీత దర్శకులు కొంతమంది ఈ తరహా ప్రయత్నాలు చేశారు. తెలుగులో కీలక పాత్రల్లో నటించారు కానీ, నేరుగా హీరోగా చేసిన వాళ్లు తక్కువే. అలా చేసిన సరైన విజయం అందుకోలేకపోయిన వాళ్లూ ఉన్నారు. తాజాగా మరో సింగర్ అందులోనూ సెన్సేషనల్ సింగర్ ఇప్పుడు హీరోగా మారుతున్నాడని సమాచారం. సౌత్‌లోనే ప్రేమ పాటలు, ఫీల్ ఉన్న పాటలు పాడటం ఆ సింగర్ స్పెషాలిటీ.
ఆ సింగర్ ఎవరో మీకు తెలిసిపోయే ఉంటుంది. అవును… ఆయనే సిద్ శ్రీరామ్ అలియాస్ సిద్ధార్థ్ శ్రీరామ్. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ… ఇలా అన్ని భాషల్లో తన గాన మాధుర్యంతో అందరినీ మెప్పిస్తున్నాడు. 2013లో ‘కడలి’ సినిమాతో గాయకుడిగా అరంగేట్రం చేసిన శ్రీరామ్… ఆ తర్వాత ఓ సినిమాకు సంగీత దర్శకత్వం కూడా వహించాడు. ఇప్పుడు కథానయకుడిగా మారబోతున్నాడట. అది కూడా గాయకుడిగా తనకు అవకాశం ఇచ్చిన దర్శకుడి చేతుల మీదుగానే అని సమాచారం.
గాయకుడిగా యూట్యూబ్‌లో, మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో దుమ్మురేపుతున్న సిద్ శ్రీరామ్ ఇక వెండితెరపై నటుడిగా మెరుపులు మెరిపించాలని చూస్తున్నాడన్నమాట. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘కడలి’ సినిమాతో సిద్ శ్రీరామ్ గాయకుడిగా తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన సినిమాతోనే సిద్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు కోడంబాక్కం సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని తెలుస్తోంది. మణిరత్నం టీమ్ చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో హీరోగా నటించేందుకు సిధ్ శ్రీరామ్ అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ సినిమాకి మణిరత్నం దర్శకత్వం చేస్తారా? లేక నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తారా అనేది తెలియాల్సి ఉంది. గతంలో తెలుగులో శ్రీరామచంద్ర ఇలానే హీరోగా ప్రయత్నం చేసి ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు సిద్ శ్రీరామ్ అయినా మంచి విజయం అందుకోవాలని ఆశిద్దాం. అలాగే గాయకుడిగా కూడా సినిమాల ప్రయాణం కొనసాగించాలని కోరుకుందాం. ఎందుకంటే ఆయన పాటల మాధుర్యం అలా ఉంటుంది మరి. ఆల్ ది బెస్ట్ సిద్ శ్రీరామ్.