ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌పై చేసిన కామెంట్లకుగాను నటుడు సిద్ధార్థ్ క్షమాపణలు చెప్పాడు. సోషల్ మీడియా వేదికగా ఓ లేఖ ద్వారా బహిరంగంగా తన క్షమాపణలు తెలియజేశాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో చోటు చేసుకున్న భద్రతా లోపాన్ని ప్రస్తావిస్తూ ‘‘ప్రధాని మోదీపై దాడికి యత్నించడం పిరికి పంద చర్య’’ అంటూ ఇటీవల సైనా ట్వీట్ చేసింది. దానికి స్పందిస్తూ భారత హీరో సిద్ధార్థ్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు.
అందులో ఆయన రాసిన కొన్ని పదాలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో సిద్ధార్థ్ చేసిన ట్వీట్‌పై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విమర్శలు గుప్పించారు. జాతీయ మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ సైనాకు క్షమాపణలు చెప్పాడు. నా ట్వీట్‌లో రాసిన రూడ్ జోక్‌కి తనను మన్నించాలని కోరాడు. ‘‘నా ఉద్దేశంలో ఎలాంటి తప్పు లేదు.
కానీ కొందరు నా మాటలు తప్పుగా చూపి నా మీద విమర్శలు చేస్తున్నారు. మహిళలు అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. నా ట్వీట్‌లో జెండర్‌కు సంబంధించిన విషయాలేవీ లేవు. సైనా నా క్షమాపణలు మన్నించాలి’’ క్షమాపణ లేఖలో రాసుకొచ్చాడు సిద్ధార్థ్. ట్వీట్ ద్వారా ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని లేఖలో పేర్కొన్నారు. తాను అన్న మాట అది కేవలం జోక్ మాత్రమేనని, మనసు బాధపెట్టి ఉంటే క్షమించాలని రాసుకొచ్చారు. నా ట్వీట్ ద్వారా మీ మీద మాటల దాడి చేయాలని నేను అనుకోలేదు. జోక్‌గా అనుకున్నది అలా ఇబ్బందిరకంగా మారిపోయింది.
నా ఉద్దేశం ఏ మాత్రం అది కాదు. ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేద్దామని కూడా అన్నారు. నువ్వు ఎప్పటికీ నా ఛాంపియన్‌వే అంటూ రాసుకొచ్చాడు సిద్ధార్థ్. సైనాపై సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలకు దేశవ్యాప్తంగా ప్రముఖులు ఖండించారు. కేంద్ర మంత్రి రిజిజు కూడా ఇది సరైన చర్య కాదంటూ మాట్లాడారు. గతంలో ఓ పార్టీకి సంబంధించిన నాయకుల మీద సిద్ధార్థ్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అదే పార్టీకి చెందినవారు సిద్ధార్థ్ మీద ఈ విషయాన్ని ఆయుధంగా చేసుకున్నారనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.