‘డిజె టిల్లు’ ‘టిల్లు స్క్వేర్’ సినిమాలతో టాప్ హీరోల లిస్టులో స్థానం దక్కించుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఇందులో ‘టిల్లు స్క్వేర్’ రూ.100 కోట్ల క్లబ్లో చేరిన సంగతి తెలిసిందే. దీంతో సిద్ధు మార్కెట్ కూడా పెరిగింది. అయితే తర్వాత వచ్చిన ‘జాక్’ పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాకి కనీసం రూ.10 కోట్ల షేర్ కూడా రాలేదు. ఓ సందర్భంలో డిస్టిబ్యూటర్ ఏషియన్ సునీల్ సైతం ‘జాక్’ సినిమా థియేట్రికల్ రన్ గురించి చాలా దారుణంగా మాట్లాడారు.
కంటెంట్ బాగోని సినిమాని ఎవరూ ఏమీ చేయలేరు. కాబట్టి.. దాని ఫలితానికి సిద్ధునే బాధ్యుడు అనడం కరెక్ట్ కాదు. కానీ ఆ సినిమా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సిద్ధు ఎక్కువగా జోక్యం చేసుకోవడం వల్ల రిజల్ట్ తేడా కొట్టినట్టు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ అండ్ టీం చెప్పుకొచ్చింది. దాని సంగతి పక్కన పెట్టేస్తే.. సిద్ధు నుండి ఇటీవల ‘తెలుసు కదా’ అనే సినిమా వచ్చింది.
దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి నుండి ఆడియన్స్ దృష్టిని ఆకర్షించలేకపోయింది. ఎటువంటి హైప్ లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. నీరజ కోన డైరెక్టర్ గా డెబ్యూ ఇచ్చారు. అయితే తొలిరోజు ఈ సినిమాకి కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాలేదు. అందువల్ల సిద్దు మార్కెట్ ఇప్పుడు అయోమయంలో పడింది.
ఇదిలా ఉంటే… సిద్ధు హీరోగా రవికాంత్ పేరెపు దర్శకత్వంలో ‘కోహినూర్’ అనే సినిమా అనౌన్స్ చేశారు. కానీ తర్వాత ఇదే కాంబోలో ‘బ్యాడాస్’ అనే టైటిల్ తో సినిమా వస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ‘కోహినూర్’ టైటిల్ నే మార్చారేమో అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే… టైటిల్ కాదు.. ఏకంగా కథే మార్చేశారని తెలుస్తుంది. ‘సితార..’ సంస్థే ఈ సినిమాని కూడా నిర్మిస్తుంది. బడ్జెట్ పెరిగిపోతుందని భావించి మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.