సింగమ్ 3

“సింగం” సిరీస్ లో వచ్చిన తాజా చిత్రం “ఎస్ 3”. సూర్య యూనివర్సల్ కాప్ గా మరోమారు నటవిశ్వరూపం చూపించిన ఈ చిత్రంలో శృతిహాసన్ సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికీ పదిసార్లు పోస్ట్ పోన్ అవ్వడంతోపాటు ఇవాళ కూడా ఆలస్యంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ : నరసింహం (సూర్య) కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక విన్నపం మేరకు ఆంధ్రా నుంచి మంగుళూరుకు ట్రాన్స్ ఫర్ చేయబడతాడు. అక్కడి పాత కమిషనర్ హత్య కేసుతోపాటు.. సిటీలో శాంతి భద్రతలను రక్షించమని అతడికి బాధ్యతలు అప్పగిస్తాడు కర్ణాటక హోమ్ మినిస్టర్.
అలా స్పెషల్ డ్యూటీ మీద వచ్చిన నరసింహం.. తనదైన స్టైల్ లో కేస్ సాల్వ్ చేస్తూ.. కమిషనర్ హత్య వెనుక ఇంటర్నేషన్ మాఫియా హ్యాండ్ ఉందని తెలుసుకొంటాడు.
ఆస్ట్రేలియాలో ఉన్న విట్టల్ (ఠాకూర్ అనూప్ సింగ్)కు మంగుళూరులోని కమీషనర్ ను ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో తెలుసుకొనే ప్రయత్నంలో నరసింహంకు కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి.
ఏమిటా నిజాలు? ఆస్ట్రేలియా మాఫియాకు మంగుళూరుకు ఉన్న సంబంధం ఏమిటి? వాటిని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ నరసింహం ఎలా ఛేదించాడు? అనేది “సింగం 3” చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.

నటీనటుల పనితీరు : ఇదివరకటి రెండు భాగాల్లో కంటే సూర్య పోలీస్ ఆఫీసర్ గా మరింత ఫిట్ గా కనిపించడంతోపాటు పెర్ఫార్మెన్స్ విషయంలోనూ పరిణితి ప్రదర్శించాడు. అనుష్కను కంటిన్యూ చేయాలి కాబట్టి ఈ మూడో భాగంలోనూ నటింపజేసి.. బాగోడు కాబట్టి ఒక పాట పెట్టారేమో అన్నట్లుగా ఉంది ఆవిడ క్యారెక్టరైజేషన్. ఇక లుక్ పరంగా “సైజ్ జీరో” సెట్స్ నుంచి డైరెక్ట్ గా “సింగం 3” షూటింగ్ కి వెళ్ళిపోయిందేమో అనే ఆలోచన ప్రేక్షకుడికి రాకమానదు.

శృతిహాసన్ ను క్యారెక్టర్ అనేది లేకపోయినా.. ఏమాత్రం మొహమాటపడకుండా చేసిన అందాల ప్రదర్శనతో బి,సి సెంటర్ ఆడియన్స్ ను ఆకట్టుకొంది. మెయిన్ విలన్ గా నటించిన ఠాకూర్ అనూప్ సింగ్ కి కండలు కనిపించేలా కసరత్తులు చేయడం, స్టైలిష్ లుక్ కోసం అస్తమానం జుట్టు సవరించుకోవడం మినహా విలనిజాన్ని ఎలివేట్ చేసిందేమీ లేదు.

సాంకేతికవర్గం పనితీరు : ప్రియన్ సినిమాటోగ్రఫీ బాగుంది. డ్రోన్ షాట్స్, లాంగ్ ఫ్రేమ్స్, క్లోజప్ టు లాంగ్ కన్వర్షన్ షాట్స్ సన్నివేశంలోని ఇంటెన్సిటీని రిప్రెజంట్ చేశాయి. హెలికామ్ షాట్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. మెలోడీకి కేరాఫ్ అడ్రెస్ లాంటి హరీష్ జైరాజ్ “సింగం 3” లాంటి మాస్ సినిమాకి ఇచ్చిన సంగీతం చాలా రొటీన్ గా ఉంది. ఇక “గడ.. గడ.. గడ..” అంటూ వచ్చే నేపధ్య సంగీతం ప్రేక్షకుడి గుండె “దడ దడ”లాడేలా చేస్తుంది. ఎడిటింగ్ సింక్ అవ్వలేదు. సీన్ టు సీన్ కనెక్టివిటీ కూడా బాలేదు. మరి అది స్క్రీన్ ప్లే ప్రోబ్లమా లేక మరేదైనా అనేది చిత్ర బృందానికే తెలియాలి.

“సింగం 1″కి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. హీరోకి సమానమైన విలన్ ప్రకాష్ రాజ్ క్యారెక్టరైజేషన్. వారిద్దరి మధ్య రసవత్తరమైన పోరు ప్రేక్షకుల్ని సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. “సింగం 2″లో మిస్ అయ్యింది అదే, హీరో చాలా ఈజీగా అందరినీ రాఫ్ఫాడించేస్తూ తనకు ఎవరూ ఎదురు లేరు అన్నట్లుగా సాగిపోతుంటాడు. మూడో భాగంలోనూ దర్శకుడు హరి అదే ఫార్ములాను పట్టుకొని సాగదీసేశాడు. ఓవరాల్ గా ఊర మాస్ ఆడియన్స్ మినహా మరెవ్వరినీ అలరించలేని చిత్రంగా “సింగం 3” మిగిలిపోయింది.

విశ్లేషణ : యాక్షన్ సినిమాలకు ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అనేది ఎప్పుడూ ఉంటారు. అయితే.. “సింగం 3″లో యాక్షన్ కంటే బీజీయమ్ హోరు ఎక్కువయ్యింది. సింగిల్ స్క్రీన్స్ సంగతి తెలియదు కానీ.. మల్టీప్లెక్స్ లో సినిమా చూసేవారు మాత్రం చెవుల్లో దూది పెట్టుకొని సినిమా చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

రేటింగ్ : 2.25/5

Click Here For ENGLISH Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus