SIR Review in Telugu: సార్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • February 17, 2023 / 08:27 AM IST

Cast & Crew

  • ధనుష్ (Hero)
  • సంయుక్త మీనన్ (Heroine)
  • సముద్రఖని, సాయికుమార్ తదితరులు (Cast)
  • వెంకీ అట్లూరి (Director)
  • నాగవంశీ-సాయి సౌజన్య (Producer)
  • జి.వి.ప్రకాష్ కుమార్ (Music)
  • వై.యువరాజ్ (Cinematography)

తమిళ స్టార్ కథానాయకుడు ధనుష్ నటించిన మొదటి బైలింగువల్ సినిమా “సార్”. “తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే” చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మించారు. పాటలు కానీ ట్రైలర్ కానీ సినిమాకి ఆశించినంత బజ్ తీసుకురాలేకపోయాయి. దాంతో కాస్త ధైర్యం చేసి, సబ్జెక్ట్ మీద నమ్మకంతో తెలుగు, తమిళ భాషల్లో పెయిడ్ ప్రీమియర్ షోస్ వేశారు. మరి ఈ డేరింగ్ స్టెప్ ఎంతవరకూ వర్కవుటయ్యిందో చూద్దాం..!!

కథ: బాలగంగాధర్ తిలక్ అలియాస్ బాలు సార్ (ధనుష్) త్రిపాఠి విద్యాసంస్థలో జూనియర్ లెక్చరర్. త్రిపాఠి విద్యాసంస్థల వ్యవస్థాపకుడు త్రిపాఠి (సముద్రఖని) గవర్నమెంట్ కళాశాలను డెవలప్ అవ్వకుండా చేయడానికి వేసిన మాస్టర్ ప్లాన్ లో భాగంగా బాలుని సిరిపురం ప్రభుత్వ కళాశాలకు ట్రాన్స్ఫర్ చేస్తాడు.

ఇదేమీ తెలియక సిరిపురంలో పాఠాలు చెప్పడం మొదలుపెట్టిన బాలు.. విద్యా వ్యవస్థకు పట్టిన చీడ లాంటి ప్రైవేటీకరణను ఎలా ఎదిరించాడు? విద్యార్ధులను ఏ విధంగా విద్యావంతులుగా తీర్చిదిద్దాడు? అనేది “సార్” కథాంశం.

నటీనటుల పనితీరు: అలవోకగా ఎలాంటి పాత్రలో అయినా జీవించడం ధనుష్ కు వెన్నతో పెట్టిన విద్య. ఈ చిత్రంలోనూ మాష్టార్ గా చాలా చక్కగా ఒదిగిపోయాడు. ఎప్పట్లానే ఎమోషనల్ సీన్స్ లో కంటతడి పెట్టించాడు. ఒక సాధారణ సన్నివేశాన్ని, ఓ నటుడు తన హావభావాలతో ఏ విధంగా ఎలివేట్ చేయగలడు అనేందుకు “సార్” సెకండాఫ్ లో ధనుష్ నటన ఒక నిఘంటువుగా నిలుస్తుంది.

సంయుక్త మీనన్ విషయంలో దర్శకుడికంటే కెమెరామెన్ ఎక్కువ జాగ్రత్త పడ్డాడు. ఆమె ముఖంలో ఎలాంటి హావభావాలు పండవు అని త్వరగా అర్ధం చేసుకొని, ఆమెకు ఎలాంటి క్లోజప్స్ పెట్టకుండా, చాలావరకూ ఆమె డైలాగ్స్ చెబుతున్న సన్నివేశాల్లో సజెషన్ షాట్స్ తో లాక్కొచ్చి, ప్రేక్షకులు ఆమెను చూసి ఇబ్బందిపడకుండా చేశాడు.

చాన్నాళ్ల తర్వాత సాయికుమార్ ఒక అర్ధవంతమైన పాత్రలో కనిపించాడు. సముద్రఖని ఎప్పట్లానే విలనిజాన్ని ఎక్కువ కష్టపడకుండా పండించి పర్వాలేదనిపించుకున్నాడు. ఆడుకాలం నరేన్, హైపర్ ఆది, రాజేంద్రన్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: ఒక రొటీన్ పాయింట్ ను, అంతకంటే రొటీన్ & అసహజమైన ఫస్టాఫ్ తో ఏమాత్రం అలరించలేకపోయిన కథకుడు-దర్శకుడు వెంకీ అట్లూరి.. సెకండాఫ్ లో మాత్రం మ్యాజిక్ చేశాడు. ముఖ్యంగా ధనుష్ ను ఊరు నుండి బహిష్కరించే సన్నివేశం మరియు సినిమా థియేటర్ ను ట్యూషన్ సెంటర్ లా వినియోగించే సన్నివేశాలను కంపోజ్ చేసిన విధానం ప్రశంసార్హం. ఫస్టాఫ్ చూసి “ఈ సినిమా కష్టమేరా” అనుకునే ప్రేక్షకులు.. సెకండాఫ్ చూసి “ఫస్టాఫ్ తీసిన డైరెక్టరేనా.. సెకండాఫ్ తీసింది?” అని ఆశ్చర్యపోయే స్థాయిలో మలిభాగం ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా.. మాష్టార్ పాత్రలు హీరోలా ఎలివేట్ చేయడం కోసం రాసుకున్న థియేటర్ సీక్వెన్స్ & ధనుష్ వివిధ గెటప్ లు వేసే సందర్భాలను కంపోజ్ చేసిన విధానం సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి.

సెకండాఫ్ విషయంలో చూపిన శ్రద్ధలో కనీసం పావు వంతైనా ఫస్టాఫ్ మీద కూడా పెట్టి ఉంటే.. “సార్” సినిమా ధనుష్ కెరీర్ లో మరో కలికితురాయిగా నిలిచేది. కానీ.. అది లోపించడంతో, ఇప్పుడు ఎబౌ యావరేజ్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే.. క్లైమాక్స్ ను డీల్ చేసిన విధానం, హీరో విజయాన్ని అతడి గెలుపులా ఎలివేట్ చేయకుండా, అతడి ఆశయం, ఆలోచన యొక్క గెలుపుగా మలిచి.. చిత్రాన్ని ముగించిన విధానం దర్శకుడిగా వెంకీ అట్లూరి ఆలోచనాధోరణికి అద్ధం పట్టింది.

ధనుష్ తర్వాత సినిమాకి పూర్తిస్థాయిలో న్యాయం చేసింది సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్. నేపధ్య సంగీతంతో సినిమాకి జీవం పోసాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో పొలం ఫైట్ లో వచ్చే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ మ్యాజిక్ చేస్తుంది.

యువరాజ్ సినిమాటోగ్రఫీ లోపమో, లేక ఆర్ట్ డిపార్ట్మెంట్ అజాగ్రత్తో తెలియదు కానీ.. సినిమా చాలావరకూ ఎంతో అసహజంగా అనిపిస్తుంది.

ప్రొడక్షన్ డిజైన్ లో చాలా లోపాలున్నాయి. సాధారణంగా సినిమాలకి చాలా లావిష్ గా ఖర్చు చేసే సితార సంస్థ.. “సార్” విషయంలో మాత్రం కాస్త చిన్నచూపు చూశారనిపించింది. అలాగే.. సినిమాకి ఒన్నాఫ్ ది మెయిన్ మైనస్ గా ఆర్ట్ డిపార్ట్మెంట్ ను వేలెత్తి చూపాలి.

విశ్లేషణ: చదువు ప్రాముఖ్యత వివరిస్తూ ఇప్పటికే చాలా సినిమాలోచ్చాయి. కానీ.. ధనుష్ నటన, జి.వి.ప్రకాష్ కుమార్ నేపధ్య సంగీతం, సెకండాఫ్ ను వెంకీ అట్లూరి డిజైన్ చేసుకున్న విధానం “సార్”ను రొటీన్ కమర్షియల్ సినిమాలా కాకుండా.. ఒక బాధ్యతాయుతమైన చిత్రంగా నిలిపాయి. ఫస్టాఫ్ ను ఇంకాస్త పక్కాగా ప్లాన్ చేసుకొని ఉంటే.. “సార్” కచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యేది.

రేటింగ్: 2.75/5

Click Here To Read in ENGLISH

Rating

2.75
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus