సీత

“నేనే రాజు నేనే మంత్రి” అనంతరం తేజ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “సీత”. కాజల్ టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా నటించాడు. టీజర్, ట్రైలర్ తోనే విశేషమైన ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం పలు వివాదాల అనంతరం నేడు (మే 24) విడుదలైంది. మరి సినిమాగా “సీత” ఏమేరకు ఆకట్టుకొంది అనేది చూద్దాం..!!

కథ: ఈ ప్రపంచంలో డబ్బు తప్ప మరే ఇతర అంశం మీద బంధం మీద ఎలాంటి ఫీలింగ్స్ లేని ఒక నవతరం యువతి సీత (కాజల్ అగర్వాల్). తాను స్వంతంగా స్టార్ట్ చేయాలనుకున్న కన్ స్ట్రక్షన్ బిజినెస్ కోసం లోకల్ ఎమ్మెల్యే బసవరాజు (సోసూ సూద్) సహాయాన్ని కోరుతుంది. ఆ సహాయానికి బదులుగా తనతో నెలరోజులపాటు సహజీవనం చేయమని కోరతాడు బసవరాజు. తన అవసరం కోసం ఆ నిమిషం సరేనన్న సీత, తన పని పూర్తయ్యాక బసవరాజుకి హ్యాండ్ ఇస్తుంది.

ఎలాగైనా సీతను తన పడక గదికి రప్పించుకోవడమే గోల్ గా పెట్టుకొన్న బసవరాజు రకరకాలుగా ఆమెను ఇబ్బందులకు గురి చేస్తుంటాడు. ఈ క్రమంలో ఈ ఇబ్బందులన్నిటి నుండి బయటపడాలంటే.. తనకు బావ అయిన రామ్ (బెల్లంకొండ శ్రీనివాస్) చాలా అవసరమని గ్రహించి అతడి పేరు మీద ఉన్న ఆస్తి కోసం అతడి దగ్గర చేరుతుంది. కానీ.. చెడుకి దూరంగా ఎక్కడో భూటాన్ లో పెరిగిన రామ్ మన సీత పాప అనుకున్న పనికి సరిగా సహకరించడు. అతడి నుంచి ఆస్తిని లాక్కోవడమే కాక.. బసవరాజు నుంచి తప్పించుకోవడం కోసం సీత ఏం చేసింది? చివరికి ఏం జరిగింది? అనేది “సీత” సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు: ఇదివరకే కాజల్ నటిగా తనను తాను చాలా సినిమాల్లో ప్రూవ్ చేసుకొన్నప్పటికీ.. ఈ సినిమా మాత్రం ఆమె కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పాలి. నెగిటివ్ షేడ్ లో కాజల్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకుడ్ని సినిమాలో విశేషంగా లీనం చేస్తుంది. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది కాజల్ స్క్రీన్ ప్రెజన్స్ & పెర్ఫార్మెన్స్ మాత్రమే.

బెల్లంకొండ శ్రీనివాస్ మొట్టమొదటిసారిగా హీరోలా కాకుండా నటుడిలా కనిపించాడు. క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయాడు. కాకపోతే మునుపటి సినిమాలతో పోల్చి చూస్తే పర్వాలేదనిపించాడు.

హానెస్ట్ పి.ఏ పాత్రలో తనికెళ్లభరణి పాత్ర ప్రేక్షకులకు మంచి రిలీఫ్. అలాగే.. సోనూ సూద్ కూడా ఆకట్టుకొన్నాడు. ఈ విలన్ పాత్ర ‘ఏక్ నిరంజన్”లోని విలన్ క్యారెక్టర్ ను గుర్తుకు తెస్తుంది. కానీ.. సెల్ఫ్ ట్రోల్ మాత్రం జనాల్ని ఆకట్టుకొంది. మన్నారా చోప్రా, బిత్తిరి సత్తి, మహేష్ ల పాత్రలు సినిమాలో ఎందుకున్నాయి అనేది వారికే అర్ధం కావాలి.

సాంకేతికవర్గం పనితీరు: తేజ స్టేజ్ మీద అనూప్ పాటలు ఏదో ఇచ్చాడు కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా ఇచ్చాడు అని అన్నప్పుడే సినిమాకి అనూప్ ఎంత వీక్ సాంగ్స్ ఇచ్చాడో అర్ధం చేసుకోవచ్చు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సోసోగా, అతడి పాత సినిమాల పాటల్ని గుర్తుకు తెచ్చేలా ఉంది.

శిర్షా సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. కానీ.. సీజీ వర్క్ మాత్రం చాలా చీప్ గా ఉంది. ముఖ్యంగా హీరోహీరోయిన్ కాంబినేషన్ లో వచ్చే యాక్షన్ బ్లాక్స్ సీజీ వర్క్ ఏమాత్రం సహజంగా లేదు. లక్ష్మీభూపాల మాటలు కొన్ని హార్డ్ హిట్టింగ్ గా ఉన్నాయి. అలాగే తనికెళ్ళభరణి విలన్ పాత్రధారి సోనూ సూద్ ను తిట్టే సంభాషణలు బాగున్నాయి. అయితే.. సినిమా మొత్తంలో గుర్తుండిపోయే స్థాయి డైలాగ్స్ ఏమీ లేవనే చెప్పాలి. అలాగే.. ఏ ఒక్క డైలాగ్ కూడా స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది.

దర్శకుడు తేజ కథ కంటే క్యారెక్టరైజేషన్స్ బాగా రాసుకున్నాడు. హీరో రామ్, హీరోయిన్ సీత, విలన్ బసవరాజు పాత్రలు రొటీన్ క్యారెక్టర్స్ కు భిన్నంగా కొత్తగా ఉన్నాయి. కానీ.. ఆ క్యారెక్టర్స్ యొక్క ప్రత్యేకత ఎలివేట్ అయ్యే సన్నివేశాలు మాత్రం పడలేదు. దాంతో క్యారెక్టరైజేషన్స్ కొత్తగా ఉన్నాయి అని సంతోషపడాలో.. ఆ కొత్త క్యారెక్టర్స్ కూడా చెత్తగా సాగుతున్నందుకు బాధపడాలో అర్ధం కాక మిన్నకుండిపోతాడు ప్రేక్షకుడు. ఆడియన్స్ కి ఒక కొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలన్న తేజ ఆలోచన బాగున్నప్పటికీ.. ఆ ఆలోచనకు సహకరించే కథనం కొరవడడంతో “సీత” ట్రైలర్ గా ఆకట్టుకొన్నంతగా.. సినిమాగా అలరించలేకపోయింది.

విశ్లేషణ: ట్రైలర్ బాగుంది కదా.. సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందేమోనని ఆశించి థియేటర్ కి వస్తే మాత్రం తీవ్రమైన నిరాశకు గురవ్వడం ఖాయం. కాకపోతే.. కాజల్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ మరియు కొన్ని కామెడీ సీన్స్ కోసం మాత్రం ఈ సినిమాని కాస్త ఓపిక, సహనంతో ఒకేఒక్కసారి చూసే ధైర్యం మాత్రం చేయొచ్చు.

రేటింగ్: 1/5

CLICK HERE TO READ IN ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus