Sita Ramam Review: సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!

  • August 5, 2022 / 12:52 PM IST

తాను తీసిన సినిమాల సక్సెస్ కంటే మేకింగ్ కి ఎక్కువ ఫేమస్ అయిన డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “సీతారామం”. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం నేడు (ఆగస్ట్ 5) విడుదలైంది. మరి హను ఈసారైనా హిట్ కొట్టాడా లేదా అనేది చూద్దాం..!!

కథ: లూటినంట్ రామ్ (దుల్కర్ సల్మాన్) భారతీయ సేనలో సేవలందిస్తుంటాడు. తాను పాకిస్తాన్ లో చేసిన ఓ ఆపరేషన్ కారణంగా ఇండియా వైడ్ ఫేమస్ అవుతాడు. దాంతో అతడికి బోలెడన్ని ఉత్తరాలు రావడం మొదలవుతుంది. ఆ క్రమంలో సీతామహాలక్ష్మి అనే అమ్మాయి నుంచి వచ్చిన ఒక ఉత్తరం అతడ్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. “లెటర్స్ లవ్”తో మొదలైన ఈ ప్రేమ చివరికి ఏ తీరానికి చేరింది? అలాగే..

లండన్ లో పాకిస్తాన్ స్టూడెంట్ యూనియన్ లీడర్ అయిన అఫ్రీన్ (రష్మిక మందన్న) ఈ “లెటర్స్ లవ్” గురించి శోధించడం మొదలెడుతుంది. ఆ క్రమంలో ఆమెకు పరిచయమవుతాడు బ్రిగేడర్ విష్ణు శర్మ (సుమంత్). సీతా-రామ్ ల ప్రేమకు, బ్రిగేడర్ విష్ణుశర్మకు, పాకిస్థానీ అమ్మాయి అఫ్రీన్ కు ఉన్న సంబంధం ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానమే “సీతారామం” చిత్రం.

నటీనటుల పనితీరు: ఈ తరహా లవర్ బోయ్ క్యారెక్టర్స్ కు దుల్కర్ కేరాఫ్ అడ్రస్ లాంటోడు. ఈ చిత్రంలో రామ్ అనే సోల్జర్ క్యారెక్టర్లో అతడు ఇమిడిపోయిన విధానం, సెకండాఫ్ లో చూపిన సెకండ్ వేరియేషన్ ఆడియన్స్ ను అమితంగా ఆకట్టుకుంటాయి. మృణాల్ ఠాకూర్ కోసమే సీత పాత్ర పుట్టిందేమో అన్నట్లుగా ఒదిగిపోయిందామె. “మల్లీశ్వరి”లో కత్రినా తర్వాత ప్రిన్సెస్ క్యారెక్టర్ కి మళ్ళీ మృణాల్ బాగా సెట్ అయ్యింది. అందంతో మాత్రమే కాక అభినయంతోనూ ఆకట్టుకుంది.

దర్శకుడు హను ఆమె కళ్ళను క్లోజప్ షాట్స్ తో చూపిన తీరు, ఆమె పలికించిన హావభావాలు ముచ్చటా ఉన్నాయి. రష్మిక పాత్ర చిన్నదే అయినప్పటికీ.. మంచి ఇంపాక్ట్ క్రియేట్ అయ్యింది. ఆమె నటన కూడా బాగుంది. సుమంత్ కి ఈ సినిమా సెకండ్ ఇన్నింగ్స్ అనే చెప్పాలి. అక్కడక్కడా కాస్త ఓవర్ డ్రమాటిక్ అయినప్పటికీ.. క్యారెక్టర్ ను క్యారీ చేసిన విధానం బాగుంది. సుమంత్ కి మంచి పాత్రలు వస్తాయి ఈ సినిమా తర్వాత.

వెన్నెల కిషోర్ నవ్వించడానికి ప్రయత్నించాడు కానీ.. సినిమా కంటెంట్ తో అది సింక్ అవ్వకపోవడంతో.. ఆడియన్స్ పెద్దగా ఎంజాయ్ చేయలేదు. తరుణ్ భాస్కర్, మురళీశర్మ, భూమిక, శత్రు, సచిన్ కేడ్కర్ లు తమ తమ పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపించుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు: హను సినిమాకి టెక్నికాలిటీస్ బెస్ట్ ఉంటాయి. ఈ సినిమాకి వైజయంతీ మూవీస్ బ్యానర్ పెద్ద ఎస్సెట్ గా నిలిచింది. హను మదిలోని కథను తెరపై అద్భుతంగా ప్రెజంట్ చేయగలిగాడంటే కారణం వైజయంతీ మూవీస్ & స్వప్న సినిమా సంస్థలు కథను, దర్శకుడిని నమ్మి.. ఎలాంటి పరిమితులు లేకుండా సినిమాకి కావాల్సినంత ఖర్చు చేయడమే. మరో బ్యానర్ లో ‘సీతారామం” ఇంతే అద్భుతంగా ఉండేది కాదేమో. విశాల్ చంద్రశేఖర్ పాటలు, నేపధ్య సంగీతం సినిమాకి ఆయువుపట్టు. వాటి ప్లేస్ మెంట్ & పిక్చరైజేషన్ కూడా ఎంతో అందంగా ఉంది.

పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ ఎంత బాగుందంటే.. కాసేపు ప్రేక్షకుల్ని ఎత్తుకెళ్లి కాశ్మీర్ & ఓల్డ్ హైద్రాబాద్ రోడ్ల మీద కూర్చోబెట్టేశాడు. స్లోమోషన్ షాట్స్ ను రెగ్యులర్ లాంగ్ ఫ్రేమ్స్ లో కాకుండా.. క్లోజప్స్ లో చూపించిన విధానం బాగుంది. ఆర్ట్ వర్క్ & ప్రొడక్షన్ డిజైన్ ను ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. దర్శకుడు హను సినిమాల్లో, పాత్రల్లో ప్రేమ, బాధ, వెలితి లాంటి ఫీలింగ్స్ తోపాటు మానవత్వం తొణికిసలాడుతుంటుంది. “అందాల రాక్షసి”లో రాహుల్ పాత్ర ప్రాణ త్యాగం చేసినా, “పడిపడి లేచే మనసులో” శర్వ తనను తాను పోగొట్టుకున్నా, “కృష్ణగాడి వీర ప్రేమగాధ” నాని పిల్లల కోసం తన ప్రేమను పణంగా పెట్టినా..

అక్కడా త్యాగానికంటే మానవత్వం ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే.. “సీతారామం”లో ఆ మానవత్వపు ఛాయలు చాలా ధృఢంగా కనిపిస్తుంటాయి. యుద్ధం, మతం వంటి విషయాలను ఎంత స్వచ్ఛంగా చూపించొచ్చు అనే విషయాన్ని ఇప్పటికీ మణిరత్నం పదులసార్లు తెరకెక్కించినా.. హను అదే విషయాన్ని ఇంకాస్త కవితాత్మకంగా తెరకెక్కించి మార్కులు కొట్టేశాడు. ప్రీరిలీజ్ ఈవెంట్లో చెప్పినట్లుగా.. సెకండాఫ్ విషయంలో జాగ్రత్తపడిన హను.. ఈసారి ఫస్టాఫ్ సిండ్రోమ్ తో బాధపడ్డాడు. అయితే.. హను ఇప్పటివరకూ తీసిన సినిమాల్లో బెస్ట్ ఇదే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

విశ్లేషణ: “సీతారామం”కు యుద్ధంతో రాసిన ప్రేమకథ అనే ట్యాగ్ లైన్ చాలా యాప్ట్. హను తరహా సినిమాలను ఆస్వాదించే ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకునే సినిమా ఇది. ప్రేమ, యుద్ధం, త్యాగంతోపాటు హను ఎలివేట్ చేసిన మానవీయ కోణం కోసం ఈ చిత్రాన్ని తప్పకుండా చూడాల్సిందే.

రేటింగ్: 3/5

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus