తీసినవి నాలుగు సినిమాలు అయినా.. ఎమోషన్స్‌ని బాగా క్యారీ చేయగలరు అనే పేరు సంపాదించుకున్నారు శివ నిర్మాణ. ఆఖరిగా ఆయన నుండి వచ్చిన ‘ఖుషి’ సినిమా బాక్సాఫీసు దగ్గర ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా ఆయన రైటింగ్‌కి మంచి మార్కులే పడ్డాయి. అయితే ఏమైందో ఏమో ఆ సినిమా వచ్చి రెండేళ్లు అయినా ఇంకా కొత్త సినిమా స్టార్ట్ అవ్వలేదు. ఆయనతో రెండు సినిమాలు చేసిన నాని మరో ఛాన్స్ ఇస్తారు అనే వార్తలొచ్చినా ఇంకా ఏదీ ఓకే అవ్వలేదు. అయితే ఇప్పుడు శివ నిర్వాణ తన స్టయిల్ మార్చేశారు అని చెబుతున్నారు.
‘నిన్ను కోరి’, ‘మజిలీ’ లాంటి ఎమోషనల్ లవ్ స్టోరీస్ తీసి యూత్‌ఫుల్ సబ్జెక్ట్‌లను బాగా హ్యాండిల్ చేస్తారు అని పేరు తెచ్చుకున్న శివ నిర్మాణ ‘టక్ జగదీష్’, ‘ఖుషి’తో ఆ స్థాయి విజయాలు అయితే అందుకోలేకపోయారు. దీంతో ఇప్పుడు ఏ స్టయిల్ సినిమాతో రాబోతున్నారు అనే చర్చ మొదలైంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో శివ నిర్వాణ మరో సినిమా చేయాల్సి ఉంది. ‘ఖుషి’ సినిమా సమయంలో ఈ డీల్ కూడా జరిగిందట. ఇప్పుడు దానిని పూర్తి చేసే పనిలో ఉన్నారట శివ.
దీని కోసం రవితేజను హీరోగా ఎంపిక చేసుకున్నారు అని సమాచారం. మైత్రీతో రవితేజకు మరో సినిమా అగ్రిమెంట్ ఉండటం కూడా ఓ కారణమట. ‘జాట్’ సినిమాకు ముందు గోపీచంద్ మలినేని డైరక్షన్‌లో రవితేజ సినిమా ఒకటి అనౌన్స్ అయి ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. డిఫరెంట్ థ్రిల్లర్ సబ్జెక్టు, ఊహించని ట్విస్టులతో ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా శివ నిర్వాణ ఓ కథ సిద్ధం చేశారని సమాచారం. ఫాదర్ సెంటిమెంట్, రివేంజ్, ఎమోషన్స్ అంశాలను బ్యాలన్స్ చేస్తూ కొత్త కథను సిద్ధం చేసి నెరేషన్ కూడా ఇచ్చారని సమాచారం.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే రవితేజ – శివ నిర్వాణ సినిమా వచ్చే నెలలో ముహూర్తం జరుపుకోనుందని సమాచారం. ఇక రవితేజ లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’ అక్టోబర్ 31న విడుదల కానుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) 2026 సంక్రాంతి బరిలో ఉంది. వీటి తర్వాత శివ నిర్వాణ సినిమానే ఉండొచ్చు అని చెబుతున్నారు.