లాక్ డౌన్ అనంతరం థియేటర్ల వద్ద సందడి మొదలైంది. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా జనాలు థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తున్నారు. టాక్ బాగుందంటే అన్ని సినిమాలు కవర్ చేసేస్తున్నారు. దీంతో వరుసగా సినిమాలను రిలీజ్ చేయడం మొదలుపెట్టారు మేకర్స్. ప్రతీ వారం కనీసం రెండు, మూడు సినిమాలైనా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. గత వారం నాలుగు సినిమాలు సందడి చేయగా.. ఈ వారం ఏకంగా అరడజను చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.
నితిన్ నటించిన ‘చెక్’, నందితా శ్వేతా ‘అక్షర’, జేడీ చక్రవర్తి నటించిన ‘ఎంఎంఓఎఫ్’, అలానే ‘అంగుళీక’, ‘క్షణక్షణం’, ‘నిన్నిలా నిన్నిలా ‘ ఇలా మొత్తం ఆరు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో ఎన్ని సినిమాలకు క్రేజ్ ఉందనే సంగతి పక్కన పెడితే.. థియేటర్లు మాత్రం కొత్త పోస్టర్లతో వెలిగిపోతున్నాయి. చంద్రశేఖర్ యేలేటి డైరెక్ట్ చేసిన ‘చెక్’ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. జైలు నేపథ్యంలో సాగే ఈ కథ సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని నమ్మకంగా చెబుతున్నాడు హీరో నితిన్.
పైగా ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి ఓపెనింగ్స్ బాగా వచ్చే ఛాన్స్ ఉంది. మిగిలిన చిత్రాల్లో ‘అక్షర’ సినిమాకి కాస్త క్రేజ్ ఉందని చెప్పుకోవాలి. కానీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం థియేటర్ కి వస్తారా లేదా అనేది సందేహమే. ‘ఎంఎంఓఎఫ్’ సినిమాని హారర్, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఇది కూడా ఈ వారమే రానుంది. మరి ఈ చిత్రాల్లో ఏది సక్సెస్ అందుకుంటుందో చూడాలి!