Solo Boy Review in Telugu: సోలో బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • గౌతమ్ కృష్ణ (Hero)
  • శ్వేత అవస్తి (Heroine)
  • రమ్య పసుపులేటి, పోసాని కృష్ణమురళి, అనిత చౌదరి, షఫీ (Cast)
  • పి.నవీన్ కుమార్ (Director)
  • సెవెన్ హిల్స్ సతీష్ (Producer)
  • జుడా సాండీ (Music)
  • త్రిలోక్ సిద్ధు (Cinematography)
  • ప్రవీణ్ పూడి (Editor)
  • Release Date : జూలై 04, 2025
  • సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ (Banner)

ఒక్కోసారి కంటెంట్ ఏముంటుందిలో అని ఏమాత్రం ఆశించకుండా చూసే సినిమాలు ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాంటి సినిమానే “సోలో బాయ్” (Solo Boy). బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రం చాలా సైలెంట్ గా జూలై 4న రిలీజ్ అయ్యింది. మరి “తమ్ముడు, 3BHK” వంటి థియేటరికల్ మరియు బోలెడన్ని ఓటీటీ సినిమాలను తట్టుకొని ఈ చిత్రం నిలబడగలిగిందా? లేదా? అనేది చూద్దాం..!!

Solo Boy Review

కథ: చిన్నప్పటినుంచి తల్లిదండ్రులు గారాబంతో ముద్దుగా పెరిగిన కుర్రాడు కృష్ణ మూర్తి (గౌతమ్ కృష్ణ) (Gautham Krishna). కాలేజ్ లో ప్రేమించిన అమ్మాయి జీతం తక్కువ అని వదిలేస్తుంది, ప్రేమించి పెళ్లాడిన అమ్మాయి ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు అని వెళ్ళిపోతుంది, అల్లారుముద్దుగా పెంచిన తండ్రి కాలం చేస్తాడు. కష్టపడి చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి లేక, జీవితంలో సంతోషం లేక.. ఏదైనా సొంతంగా స్టార్ట్ చేయాలన్న తపనతో ఒక యాప్ క్రియేట్ చేస్తాడు.

కృష్ణమూర్తి క్రియేషన్ సక్సెస్ అయ్యిందా? అతడు కోల్పోయిన ఫైనాన్షియల్ స్టాటస్ తిరిగొచ్చిందా? ఈ ప్రయాణంలో అతడు ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? అనేది “సోలో బాయ్” కథాంశం.

నటీనటుల పనితీరు: గౌతమ్ కృష్ణ మంచి నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా.. జీవితంలో అన్నీ కోల్పోయిన బాధను, ఎలాంటి కష్టంలోనైనా సరే నిలదొక్కుకోవాలన్న తపనను చక్కగా ప్రదర్శించాడు. కాస్త వాచకం మీద కూడా దృష్టిసారిస్తే మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకుంటాడు.

శ్వేత అవస్తి, రమ్య పసుపులేటి గ్లామర్ తోపాటు మంచి ఎమోషన్ ని కూడా యాడ్ చేసారు. తండ్రిగా పోసాని కృష్ణమురళి చాలారోజుల తర్వాత మంచి పాత్రలో ఆకట్టుకున్నారు. అనిత చౌదరి కూడా ఓ మధ్య తరగతి తల్లి పాత్రలో అలరించింది.

షఫీ పాత్ర చిన్నదే అయినప్పటికీ.. తనదైన ప్రెజన్స్ తో కథలో కీలకంగా నిలిచాడు.

సాంకేతికవర్గం పనితీరు: క్వాలిటీ పరంగా సినిమాలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. ముఖ్యంగా మిక్సింగ్ & డి.ఐ మీద ఇంకాస్త ఖర్చు చేసి ఉంటే బాగుండేది. అయితే.. జుడా సాండీ ఆ తప్పుల్ని కవర్ చేశాడు. పాటలు కాస్తంత బాగున్నా భావన కలిగించగా.. నేపథ్య సంగీతం మాత్రం ఎమోషన్ ని, పెయిన్ ని, జర్నీని బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉండగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ షార్ప్ గా ఉంది. అందువల్ల మరీ ఎక్కువ ల్యాగ్ ఫీల్ కలగలేదు. 133 నిమిషాల నిడివి ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ గా నిలిచింది.

దర్శకుడు నవీన్ కుమార్ తాను చెప్పాలనుకున్న పాయింట్ ను ఎక్కువ సాగదీయకుండా చాలా సింపుల్ గా తెరకెక్కించాడు. ఒక మనిషి తనను తాను బలంగా నమ్మి, మనస్ఫూర్తిగా పని చేస్తే టైమ్ పట్టినా, ఏదో ఒక రకంగా పైకి ఎదుగుతాడు అనే నీతి కథను “సోలో బాయ్” సినిమాతో చెప్పిన విధానం బాగుంది. సినిమాటిక్ లిబర్టీస్ కాస్త ఎక్కువగానే తీసుకున్నప్పటికీ.. ఎక్కడా అతి లేకుండా జాగ్రత్తపడిన తీరు కూడా బాగుంది.

క్యారెక్టర్ ఆర్క్స్ & కంటెంట్ క్వాలిటీ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే.. నవీన్ కి దర్శకుడిగా మంచి భవిష్యత్ ఉంది. ఓవరాల్ గా “సోలో బాయ్”తో డీసెంట్ హిట్ కొట్టాడని చెప్పాలి.

విశ్లేషణ: ముందు చెప్పినట్లుగా కొన్ని సినిమాలు “అరే భలే ఉందే” అనిపిస్తాయి. “సోలో బాయ్” అలాంటి సినిమానే. నటీనటుల డీసెంట్ పెర్ఫార్మెన్స్, ఇన్స్పైర్ చేసే స్టోరీ కచ్చితంగా ఆకట్టుకుంటాయి. క్వాలిటీ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే గనుక మంచి థియేటరికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేది.

ఫోకస్ పాయింట్: సందేశంతోపాటు కాస్తంత ఇన్స్పిరేషన్ ఇచ్చే సోలో బాయ్!

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus