సినిమా ఫ్లాప్ అని ఒప్పుకొన్న స్పైడర్ నిర్మాతలు!

“ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు” అని మన పెద్దలు అంటుండేవారు. ఎందుకంటే.. ఒక మనిషి జీవితంలో అత్యంత కష్టమైన పనులు అవేనని వారు భావించేవారు. అదే సామెతను మన తెలుగు చిత్రసీమకు ఆపాదిస్తేగనుక “సినిమా తీసి చూడు, ఆ సినిమాని రిలీజ్ చేసి చూడు” అని చెప్పుకోవచ్చు. అయితే.. నవతరానికి తగ్గట్లు ఆ సామెతలో చిన్న చిన్న మార్పులు చేస్తే “సినిమా రిలీజ్ చేసి చూడు, హిట్ అని ఒప్పించి చూడు” అని కూడా చెప్పుకోవచ్చు. ఈమధ్యకాలంలో సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చేయడంతో సినిమా రిజల్ట్ మొదటి ఆటతోనే అందరికీ తెలిసిపోతుంది. కొన్ని సినిమాలకు ఫస్ట్ షో కల్లా ఫైనల్ రిజల్ట్ తెలిసిపోతుంది. హిట్ అయితే ఒకే కానీ.. ఏమాత్రం నెగిటివ్ టాక్ వచ్చినా ఆ రిజల్ట్ ను మ్యానిపులేట్ చేసి తమ సినిమా సూపర్ హిట్ అని చెప్పుకోవడానికి నిర్మాతలు నానా ఇబ్బందులు పడుతుంటారు.

కానీ.. “స్పైడర్” సినిమా నిర్మాతల్లో ఒకరైన ఎన్వీ ప్రసాద్ మాత్రం నిర్భయంగా “అవును మా సినిమా ఫ్లాపయ్యింది” అంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఎంత కొత్త కథ, వైవిధ్యమైన కథనం ఉన్నప్పటికీ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకొనే అంశాలు లేకపోవడం.. జనాలు కూడా ఎక్కువ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకోవడంతో ఆ సినిమా సరిగా ఆడలేదు. తెలుగుతోపాటు తమిళంలోనూ ఏకకాలంలో రిలీజైన “స్పైడర్” రెండు భాషల్లోనూ యావరేజ్ టాక్ తెచ్చుకోగా.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఎన్వీ ప్రసాద్, మహేష్ బాబు ఆ నష్టాలను పూడ్చే పనిలో ఉన్నారు. ఏదేమైనా తమ సినిమా ఒరిజినల్ టాక్ ను నిర్మాతలు ఈ విధంగా పబ్లిక్ గా ఒప్పుకోవడం వల్ల ఇండస్ట్రీలో ట్రాన్స్ పెరన్సీ పెరుగుతుంది. మిగతా నిర్మాతలు కూడా తమ సినిమాల కలెక్షన్ రిపోర్ట్స్ మరియు రిజల్ట్స్ ను మీడియాకి ఇచ్చేప్పుడు ఎన్వీ ప్రసాద్ ను ఫాలో అవుతారేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus